పచ్చి అబద్ధాలతో ముగిసిన చర్చలు!

17 Aug, 2021 00:33 IST|Sakshi

రెండో మాట

అంతర్జాతీయ సైబర్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ రూపొందించిన ‘పెగసస్‌’ సాఫ్ట్‌వేర్‌ భారతదేశంలో యథేచ్ఛగా సాగిస్తున్న ‘కూపీ’లతో తమకు సంబంధం ఉన్నదా లేదా అనే విషయాన్ని తేల్చి చెప్పడానికి బీజేపీ పాలకులకు ఏళ్ళూపూళ్లూ పట్టవలసిన అవసరం లేదు. ‘పెగసస్‌’తో లోపాయికారీ ఒప్పందం ఏదో ప్రభుత్వానికి ఉందన్న ప్రతిపక్షాలు, పలు ప్రజాసంస్థల ఆరోపణలను ఖండించడానికి రెండు మాసాలకు పైగా కాలక్షేపం చేయవలసిన అవసరం లేదు! దేశంలోని రాజకీయ ప్రత్యర్థులపైన. జర్నలిస్ట్‌లపైన, కొందరు జడ్జీల ఫోన్లపైన ఎన్‌ఎస్‌ఓ రూపొందించిన ‘పెగసస్‌’ సాఫ్ట్‌వేర్‌ని భారత పాలకులు ఉపయోగిస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. గోవిందాచార్య సుప్రీంకోర్టులో 2019లోనే  ‘పెగసస్‌’ బాగోతం నిగ్గుతేల్చాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌ సుప్రీంలో ఇంకా అలాగే ఉండిపోయి ఉసురు నిలుపుకోవడమే అసలుసిసలు కొసమెరుపు!

‘‘చట్టాలు చేయడంలోనూ, పార్లమెంట్‌లో చర్చలు నిర్వహించడంలోనూ, చేసే చట్టాలలో కొట్టొచ్చే అస్పష్టత చోటు చేసుకున్నందువల్ల దేశంలో తగాదాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం దేశ పౌరులకు, న్యాయస్థానాలకు, తదితర కక్షిదారులకు చిరాకు కల్గిస్తోంది. ఫలితంగా చట్టాలను రూపొందించే ప్రమాణాలు పడిపోతున్నాయి.  చట్ట సభలు చేస్తున్న చట్టాలు ఏ ప్రయోజనం కోసం రూపొందుతున్నాయో మనకు తెలియడం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్య్ర ప్రతిపత్తిని కాస్తా ఇలాంటి చట్టాలు దిగజార్చివేస్తున్నాయి. ఫలితంగా చట్ట సభలు చేస్తున్న కొత్త చట్టాల లక్ష్యం ఏమిటో న్యాయస్థానాలకు బొత్తిగా అంతుచిక్కకుండా పోతున్నాయి.’’ 
–  సుప్రీంకోర్టు చీఫ్‌ జడ్జి ఎన్‌.వి. రమణ 

‘‘పెగసస్‌ సృష్టికర్త ఇజ్రాయెల్‌ సైబర్‌ గూఢచారి సంస్థ ఎన్‌.ఎస్‌.ఓ కార్యకలాపాలపైన, అలాంటి చట్టవిరుద్ధ గూఢచర్య కార్యకలాపాల్లో ఉన్న ఫేస్‌బుక్, వాట్సాప్‌ తదితర సంస్థలపైన తక్షణమే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని 2019లోనే నేను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరిగి పునరుద్ధరించగోరుతున్నాను. మన దేశంలో ఈ ‘పెగసస్‌’ గూఢచర్యం ఆధునిక సాంకేతిక సైబర్‌ టెర్రరిజంలో భాగం, దీన్ని సమాచార టెక్నాలజీ చట్టం కింద శిక్షించాలి. ‘పెగసస్‌’ గూఢచర్యం సహా యంతో ఈ దేశ పౌరుల గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించే వారందరినీ శిక్షించాల్సిందే. కోట్లాది మంది భారతీయుల ప్రాథమిక హక్కుల రక్షణ అనేది చట్ట నిబంధన (రూల్‌ ఆఫ్‌ లా)పైన ఆధారపడి ఉంది. ఇది రాజ్యాంగ బద్ధం. కనుక ‘పెగసస్‌’ వినియోగంపై విచారణ జరిపి తీరాలన్న నా 2019 నాటి పిటిషన్‌ను సుప్రీం తిరిగి చేపట్టాలి’’  
– ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్‌. గోవిందాచార్య పిటిషన్‌ (2019లోనే సుప్రీంకోర్టులో) 

పచ్చి అబద్ధాలతో ఈసారి పార్లమెంటు చర్చలు ముగియడానికి దారితీసిన పరిణామాలలో ప్రధానమైన అంశం... దేశాన్ని కుదిపేసిన అంతర్జాతీయ స్థాయి సైబర్‌ గూఢచార సమాచార వ్యవస్థ ఎన్‌.ఎస్‌.ఓ. నెలకొల్పిన ‘పెగసస్‌’ భారతదేశంలో యథేచ్ఛగా సాగిస్తున్న ‘కూపీ’ లతో బీజేపీ పాలకులకు సంబంధ బాంధవ్యాలలో నిజానిజాలకు సంబంధించినదే! ఈ విషయాన్ని తేల్చి చెప్పడానికి బీజేపీ పాలకులకు ఏళ్ళూపూళ్లూ పట్టవలసిన అవసరం లేదు. కానీ పాలనా విధానాలను విమర్శిస్తున్న పౌరులపైన మాజీ అధికారులు, పౌరహక్కుల సంఘాల నాయకులపైన, చివరికి కేంద్రపాలక వర్గంలోని కొందరు మంత్రుల అభ్యంతరాల పైన, విద్యార్థి, ఉద్యోగ వర్గాలపైన పాలకులు కన్నెర్ర చేయవలసిన అవసరం లేదు. ‘పెగసస్‌’తో లోపాయికారీ ఒప్పందం ఏదో ప్రభుత్వానికి ఉందన్న ప్రతిపక్షాలు, పలు ప్రజాసంస్థల ఆరోపణలను ఖండించడానికి రెండు మాసాలకు పైగా కాలక్షేపం చేయవలసిన అవసరం లేదు!

నాటి  ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు గోవిందాచార్య 2019లోనే ‘పెగసస్‌’ సైబర్‌ గూఢచర్య కార్యకలాపాలపైన విచారణ కోరడం, 2021లో దేశంలోని ప్రజాసంస్థలు, పార్లమెంట్‌ సభ్యులు, ప్రతిపక్షాలు అదే విచారణను డిమాండ్‌ చేయవలసి రావడం ప్రహసనంగా మారవలసి వచ్చింది! కానీ దాదాపుగా రెండునెలలు గడిచిపోయిన తరువాత,  దేశం లోని రాజకీయ ప్రత్యర్థులపైన. జర్నలిస్ట్‌లపైన, కొందరు జడ్జీల ఫోన్లపైన ఇజ్రాయెల్‌ సైబర్‌ గూఢచారి సంస్థ ఎన్‌.ఎస్‌.ఓ. రూపొందించిన ‘పెగసస్‌’ సాఫ్ట్‌వేర్‌ని భారత పాలకులు ఉపయోగిస్తున్నారని, అందుకోసమే ఆధునిక టెక్నాలజీకి కూడా దొరకని సాంకేతిక వ్యవస్థని ప్రభుత్వం తరపున కొనుగోలు చేశారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఈ తీవ్ర ఆరోపణను ఖండించడానికి మన పాలకులకు తీరికలేకనో ఏమోగాని, రెండు నెలల కాలయాపన తర్వాత తాపీగా 9–8–2021వ తేదీన అందునా ఏ సమాచార శాఖో, విదేశాంగ వ్యవహా రాల మంత్రిత్వ శాఖో కాకుండా భారత రక్షణ శాఖ... పెగసస్‌కి స్పైవేర్‌ నిర్వాహణా సంస్థ ఎన్‌ఎస్‌ఓతో ఎలాంటి లావాదేవీల్లేవు అని పార్లమెంటులో ప్రకటించాల్సి వచ్చింది! అయితే ఇదే సమయంలో, రాజ్యసభ అధ్యక్షులు, దేశ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు, ‘పార్లమెంటు ఉన్నది సమస్యల్ని చర్చించడానికే గానీ, రాజకీయ కొట్లాటలకు కాదు’ అని ప్రకటించారు తప్పితే, అంతవరకూ ‘పెగసస్‌’ బాగోతం గురించి రెండునెలలుగా ప్రతిపక్షాలు కోరుతూ వచ్చింది, ఆ ‘చర్చ కోసమే’ నన్న వాస్తవాన్ని మరచిపోవటం! ఒకవేళ ‘పెగసస్‌’ గూఢచర్యంతో మనకు రహస్య సంబంధాలు లేవనుకున్నా అనేక మాసాలుగా న్యాయం కోసం జరుగుతున్న వేలాదిమంది రైతుల ఆందోళన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు ఆరు వందలమంది రైతుల కుటుంబాలకు కనీస సానుభూతి కూడా ప్రకటించని పాలక వ్యవస్థ.. ‘పెగసస్‌’ ఆధునిక గూఢచర్యాన్ని బాహాటంగా ఖండిం చకపోవడాన్ని ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు!

ఇది ఇలా ఉండగానే, ఒక వైపునుంచి గౌరవ ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా ‘చాపచుట్టి’ దేశీయ, విదేశీయ ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేస్తున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఒక ప్రకటనలో భారత పారిశ్రామిక వేత్తలు అనుసరిస్తున్న వర్తక, వ్యాపార లావాదేవీలు జాతీయ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, వినియోగదార్ల ప్రయోజనాల రక్షణకు ఉద్దేశించిన నిబంధనలకు (రూల్స్‌) ప్రైవేట్‌ పారి శ్రామికవేత్తలు బాహాటంగా కాలరాస్తున్నారని విమర్శించాల్సి వచ్చింది! దేశంలోకి అనుమతిం చిన కొన్ని విదేశీ గుత్త కంపెనీలకు నేడు మన జాతీయ ప్రయోజనాలకన్నా  వాటి ప్రయోజనాలకే ప్రాధాన్యం పెరిగిపోవడం విచారకరమని కూడా గోయల్‌ ప్రకటించవలసి వచ్చింది. (13–8–2021 ప్రకటన) 

అన్నట్టు ఇంతకూ మనం ‘పెగసస్‌’ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ని కొనుగోలు చేశామా, లేదా? అబద్ధమాడితే గోడను ఎంతగా అడ్డుపెట్టుకున్నా ఎన్నాళ్ళు ఆగుతుంది? అబద్ధం అంటేనే అతుకుల మూట! అబద్ధం చెబితే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లు ఉండాలన్న సామెత ఊరకనే పుట్టలేదు! ఇంతకూ ఏతావాతా ధనికవర్గ పాలనా వ్యవస్థలో దాగిఉన్న అసలు సత్యం ఏమిటో వెనకటికో పెద్దమనిషి బయటపెట్టేశాడు. ధనం మాట్లాడుతూంటే, సత్యం అలా గుడ్లప్పగించి ఊరకుండిపోతుందట!! అయినా గోవిందాచార్య సుప్రీం కోర్టులో 2019లోనే  ‘పెగసస్‌’ బాగోతం నిగ్గుతేల్చాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌ సుప్రీంలో ఇంకా అలాగే ఉండిపోయి ఉసురు నిలుపుకోవడమే అసలుసిసలు కొసమెరుపు!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
 

మరిన్ని వార్తలు