Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్‌

18 Apr, 2021 01:39 IST|Sakshi

నేడు (ఏప్రిల్ 18‌) ఐన్‌స్టీన్‌ జయంతి సందర్భంగా

‘కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన గట్టు పడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’ అని జాషువా చెప్పినట్లుగా ఐన్‌స్టీన్‌ కూడా స్వయంగా ఎన్నోసార్లు ‘నేను ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జాతికో, ఒక మిత్ర బృందానికో, చివరికి ఒక కుటుంబానికో చెందినవాడను కాను. నేను ఈ ప్రపంచానికంతటికీ చెందినవాడను’ అని అన్నాడు.

‘టైమ్స్‌’ పత్రిక ఐన్‌స్టీన్‌ను శతాబ్దపు మహావ్యక్తిగానూ, గాంధీని రెండవ మహావ్యక్తిగానూ ప్రకటించినప్పుడు ఐన్‌స్టీన్‌ సంతోషపడకుండా ‘గాంధీయే నాకంటే గొప్పవాడు, మొదటి స్థానంలో గాంధీయే ఉండాలి’ అని అన్నాడంటే ఐన్‌స్టీన్‌ వ్యక్తిత్వం ఎంతటి విశిష్టమైనదో మనం ఊహించుకోవచ్చు. తను ఎప్పుడూ కలవని, తన జాతి, దేశ, మతానికి చెందని, తన ఖండానికే చెందిన మరొక శక్తివంతమైన దేశంతో (ఇంగ్లాడు) పోరాటం చేస్తున్న ఒక బక్క చిక్కిన వ్యక్తి గురించి ఆయన రాసిన మాటలు ఈ రోజు ప్రతి భారతీయుడు కంఠస్థం చేయవలసినవి: ‘మనలాగే రక్తమాంసాలతో కూడిన ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే భావితరాలు నమ్మలేకపోవచ్చు’ అని అంటూనే ఈ శతాబ్దపు మహామనిషి గాంధీజీ అని కొనియాడారు. ఒక విదేశస్తుడు, అందులోనూ ఒక ఐరోపా ఖండవాసి భారతదేశాన్ని, భారతీయులను సమర్థించడమే ఒక గొప్ప సాహసం అనుకునే ఆ రోజులలో ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత అయిన ఐన్‌స్టీన్‌ గాంధీజీని ఒక అవతార పురుషుడిలా వర్ణించాడంటే ఆయన ఎటువంటి స్వేచ్ఛాజీవినో అర్థం చేసుకోవచ్చు.

నిరాడంబరుడు 
తన జీవితమంతా కూడా అధికారాలు, ఆడంబరాలకు దూరంగానే ఉన్నాడు. కారులో వెళ్ళడంకంటే సైకిలు ప్రయాణమే ఇష్టపడేవాడు. ఆయన ధరించే దుస్తులు చూచి చాలామంది ఆయనను లోభి అని, మరి కొంతమంది శుభ్రతకు ప్రాధాన్యమివ్వడని అనుకొనేవారు. కాని ఆయనకు తన పరిశోధనలపైనే తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. తన పనికి ఎవ్వరూ, ఏదీ ఆటంకంగా ఉండకుంటే చాలు అనుకునే మనస్తత్వం. తన 50వ జన్మదినం రోజున పాఠశాల పిల్లలు మెడకు కట్టుకునే ‘టై’ ని, పాదాలకు వేసుకునే సాక్సులను బహుమతిగా ఇచ్చారు. ఎందుకు వాటిని బహుమతిగా ఇచ్చారని పిల్లలను అడిగితే ఐన్‌స్టీన్‌ ఎప్పుడూ ఎక్కువగా ఇవి వాడరు కనుక ఈ రెండూ వీరి దగ్గర లేవేమోనని ఇచ్చాము అన్నారంటే ఐన్‌స్టీన్‌ దుస్తుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉండేవారో అర్థమవుతుంది.

1933 సంవత్సరంలో అమెరికాలోని ప్రిన్స్‌ టన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరినప్పుడు జీతం ఎంత కావాలో తననే నిర్ణయించుకోమంటే సంవత్సరానికి మూడు వేల డాలర్లు నాకు, నా కుటుంబ ఖర్చులకు సరిపోతుంది, అంతే ఇవ్వండి అని చెప్పగా వారు ఆశ్చర్యపోయి వెంటనే ఐన్‌స్టీన్‌ సహచరి అయిన ఎల్సాతో మాట్లాడి సంవత్సరానికి 16,000 డాలర్లుగా నిర్ణయించారంటే ఆయన నిరాడంబర త్వం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

మోక్షగామి
మానవ మేధస్సుకు అందని కొన్ని అతీతమైన శక్తులు ఉన్నాయని ఆయన బలంగా నమ్మేవారు. వీటి కారణంగానే విశ్వగమనం ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా ఉంటుందని విశ్వసించేవారు. ఈ నమ్మకంతోనే తను అయార్టిక్‌ ఎన్యూరిజమ్‌ వ్యాధిగ్రస్తుడైనప్పుడు శస్త్రచికిత్స చేస్తే వ్యాధి తగ్గుతుందని వైద్యులు చెప్పినప్పుడు సున్నితంగా ఆయన తిరస్కరించారు. ‘కృత్రిమంగా జీవితాన్ని పొడిగించి రుచిలేని జీవి తాన్ని గడపడం నాకు ఇష్టం లేదు. నేను చేయవలసిన విధులన్నీ నిర్వర్తించాను. నేను అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరాయి. మరణ కాలం ఆసన్నమైంది. కావున ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదని చెప్పి మరణాన్ని కూడా ఆహ్వానించిన మోక్షగామి అతడు.

అందరూ నమ్మే దేవునికి, ఆయన నమ్మే ఆధ్యాత్మిక శక్తులకు చాలా వ్యత్యాసం ఉండేది. మనకు వచ్చే ప్రతి ఫలితానికి దేవుడే కారణమనుకోవడాన్ని, అదృష్ట దురదృష్టాలను, విధిరాతలను ఆయన నమ్మేవారు కాదు. విశ్వానికి సంబంధించిన మానవాతీతమైన సూర్య, చంద్ర, గ్రహాలు మొదలగు వాటి విషయాలలోను, వాటి అప్రకటిత, అనిర్దేశిత, నియమబద్ధ గమన సంబంధిత విషయాలలోనూ అతీతమైన శక్తుల పాత్ర ఉంది అని నమ్మేవాడు. అటువంటి విశ్వసూత్రాల అస్తిత్వం మానవ మేధస్సుకు అతీతమైనదిగా భావించే వారు ఆయన. 

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన అభ్యాసము, పరిశీలన, పరిశోధనలు మాత్రం సాగుతూనే ఉండేవి. తన శాస్త్ర పరిశోధనా విజయ కేతనాన్ని ప్రపంచ పరిశోధనా గగనంలో ఉవ్వెత్తున ఎగురవేసిన విశ్వనరుడు ఐన్‌స్టీన్‌. 


వ్యాసకర్త: ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు
మాజీ ఉపకులపతి,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు