ఉత్తమాంధ్రగా నిలుపుతామంటే...

14 Nov, 2022 13:14 IST|Sakshi

సందర్భం

ఉత్తరాంధ్ర అన్ని రంగాలలోనూ వెనకబడి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. పదుల సంఖ్యలో ప్రభుత్వరంగ సంస్థలు, రోడ్డు, రైలు, విమాన, నౌకా రవాణా వ్యవస్థలతో అనుసంధానమైన ప్రాంతం అయినప్పటికీ వెనుకబాటుతనం మాత్రం జనాన్ని వీడలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు, పరిశ్రమలకు స్థానం కల్పించిన నేల ఇది. వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార రంగాలకు ఆయువు పట్టుగా నిలుస్తూ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతున్న ప్రాంతం. సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లిన విజయనగరం, పోరాటాల నేల శ్రీకాకుళం, ఆదివాసీ మన్యం తన సిగలో పెట్టుకున్న విశాఖ... ఈ మూడు జిల్లాల సమాహారమే ఉత్తరాంధ్ర ప్రాంతం.

2019లో ముఖ్యమ్రంతి అయిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎంతో దార్శనికతతో విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా చేయాలని నిర్ణయించారు. ఇది మూడు ప్రాంతాల అభివృద్ధికీ ఉప యుక్తంగా నిలుస్తున్న అంశం. 

రాష్ట్ర సమగ్ర వికాసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి నినాదంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం కొద్దిమంది వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు. అమరావతి నుంచి అరస వల్లి వరకు రైతుల పాదయాత్ర పేరుతో పెట్టుబడిదారులు ఉత్తరాంధ్రపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటి చర్య. ఒకవైపు పెట్టుబడి దారులను ప్రోత్సహిస్తూ, యాత్రను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి ఎల్లో పత్రికలూ, ఛానళ్లూ అదే సమయంలో ఉత్తరాంధ్రపై విషపు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తన పత్రికా ప్రయాణాన్ని ప్రారంభించి నేడు అతిపెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించిన ‘ఈనాడు’ రాతలు మహారోత పుట్టిస్తున్నాయి. కేవలం కొందరి కరపత్రంగా ఇది మారిపోయి ఇష్టారాజ్యంగా వారికి నచ్చినట్లు వండి వడ్డిస్తూ ఉత్రరాంధ్రపై విషం కక్కుతున్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పత్రికలు, సమాచార మాధ్యమాలే అప్రజాస్వామిక విధానాలను అవలంబించడం బహుశోచనీయం. 

ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు, మనో భావాలు, అభివృద్ధి, వికాసం వంటివి ఈ పచ్చపత్రికలు, టీవీ చానళ్లకు, వాటిని నడిపిస్తున్న వారికి పట్టవు. కొందరికి దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రజల ఓట్లు, తద్వారా పదవులు పొందడానికి విశాఖ నగరం కావాలి. ఈ ప్రాంతం, ప్రజలు అభివృద్ధి చెందుతామంటే మాత్రం వీరు ఓర్వలేక పోతున్నారు. నేడు సాంకేతిక విప్లవం పుణ్యాన వీళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు రాష్ట్రంలో ప్రజలంతా చూస్తున్నారు.  

ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడే ప్రతీ వ్యక్తినీ, వ్యవస్థనూ ఉత్తరాంధ్ర ప్రజలు ఊరికే వదలరు. ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం ఆరంభం అయితే దానిని  ఆపడం ఎవ్వరి తరమూ కాదు. పోరాటాల పురిటిగడ్డ శ్రీకాకుళం నుంచి ఉద్యమ స్ఫూర్తినీ, విజయనగరం నుంచి సాంస్కృతిక వారసత్వాన్నీ, విశాఖ నుంచి విజయగీతికనూ అందుకుని ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపి ‘ఉత్తమ ఆంధ్ర’గా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలంతా వెన్నంటి నిలుస్తారు. కేవలం 29 గ్రామాల ప్రజల కోసం 26 జిల్లాలతో కూడిన రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టాలంటే  ప్రజలు సహించరు. 

పరిపాలనా రాజధానిగా విశాఖ కాకుండా అడ్డుకునే ప్రతీ వ్యవస్థకూ, పార్టీకీ ఎదురొడ్డి నిలుస్తూ... అసాంఘిక శక్తులను, విద్వేషాలు రగిలించే వ్యవస్థలను కూకటివేళ్లతో పెకిలిస్తారు ప్రజలు. రాష్ట్ర సమగ్ర వికాసం లక్ష్యంగా, అభివృద్ధి మంత్రంగా... ప్రజలంతా ముందడుగు వేస్తారు. తూర్పు తీరం నవ చరిత్రకు నాందీ వాచకంగా నిలుస్తుంది!


- డాక్టర్‌ టి. షారోన్‌ రాజు
 విభాగాధిపతి, విద్యావిభాగం 
ఆంధ్ర విశ్వవిద్యాలయం

మరిన్ని వార్తలు