అనితర సాధ్య సామాజిక నమూనా!

29 Apr, 2022 14:05 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన నాలుగు రోజులకే అంబేడ్కర్‌ జయంతి రావడంతో, జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం– ‘సామాజిక న్యాయం’ నమూనాను– ‘14 ఏప్రిల్‌’ చట్రంలో ఉంచి పుటం వేయడానికి, ప్రధాన మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గట్టి ప్రయత్నమే జరిగింది. ‘ఏ పదవి లేకుండానే చక్రం తిప్పే వాళ్ళది ఏ కులం?’ అంటూ, అందుకు– కారణం మూడేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వమే అన్నట్టుగా... అందుకు జగన్‌మోహన్‌ రెడ్డిని తప్పుపట్టే ప్రయత్నమే ఇందులో ప్రధానంగా కనిపించింది. ఈ తరహా ధోరణి కొత్తది. గడచిన పదేళ్లుగా తెలుగునాట ఉద్యమాలు– ‘ఆన్‌లైన్‌’లోనే జరగడంతో దానికీ ‘వర్క్‌ ఫ్రం హోం’ సౌలభ్యం వచ్చేసింది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి? అనేది తెలుసుకుని, దాన్ని స్థానిక చూపుతో చూడ్డం, రాయడం, మాట్లాడ్డం, ఎప్పుడా అనేది మాత్రం ఇంకా స్పష్టం కావలసి ఉంది. 

అయినా ఇప్పుడొచ్చిన నష్టం కూడా పెద్దగా ఏమీ లేదు. కొత్త పార్టీ ప్రభుత్వం అన్నప్పుడు, ‘చెడు’ మాట్లాడ్డం మొదలుపెట్టిన తర్వాతే, అక్కడున్న– ‘మంచి’ ఏమిటో ఆలస్యంగా అయినా వెలుగులోకి వస్తుంది. ఈలోగా శిలాసదృశ్యంగా ఉన్న (ఇమేజ్‌) రూపానికి బీటలు ఆపాదించడం తప్పనిసరి అవుతుంది; దాని వెనుకే మంచి–చెడుల మదింపు లేదా సమీక్ష మొదలవుతుంది. భజనతో ప్రయోజనం ఉండదు కానీ సమీక్ష ఎవరికైనా చాలా అవసరం. అలా ఈ ప్రభుత్వం తొలి వైఫల్యంగా చలామణిలో ఉన్నది, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్‌జీవోల– ‘చలో విజయవాడ’ నిరసన ర్యాలీ; దాన్ని ప్రభుత్వం నియంత్రించలేకపోవడం. దీన్ని గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా చూసి ఉంటే– ‘ఉద్యోగులపై పోలీసుల దమనకాండ’, ‘విచక్షణారహితంగా ఉద్యోగులపై పోలీసుల లాఠీచార్జి’ వంటి వార్తలు, లైవ్‌ దృశ్యాలు, జగన్‌ ప్రభుత్వం తొలి– ‘బ్లాక్‌ రిమార్క్‌’గా ఇప్పటికే నమోదు అయ్యేవి. (క్లిక్‌: ‘సోషల్‌ ల్యాబ్‌’ పని మొదలైంది)

మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గం మార్పు తర్వాత కూడా– ‘జగన్‌ మెత్తబడ్డాడు’ అనే వ్యాఖ్యతో అది కూడా మరో వైఫల్యంగా చలామణిలోకి తెచ్చే ప్రయత్నం మొదలయింది. నిజానికి– జిల్లాల జనాభా, వైశాల్యం, వనరులు, ‘డెమోగ్రఫీ’ వంటి ప్రాథమిక అంశాలను బట్టి ముందుగా కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి అయ్యాక, అప్పుడు మంత్రుల మార్పు జరిగింది. అంటే, రెండు దశల్లో పాత సంస్థానాల ప్రభావం తగ్గింపునకు గురైందన్నమాట. కనుక, ఈ మార్పును సరికొత్త– ‘మ్యాపింగ్‌’ దృష్టితో చూస్తే తప్ప దీని వెనుక ఉన్న– ‘లాజిక్‌’ అయినా, అస్సలు అటువంటిది ఎప్పుడు మొదలు అయిందనే దాని గత చరిత్ర అయినా స్పష్టం కాదు. దాన్ని– ‘వైఎస్‌ మ్యాపింగ్‌ ఫార్ములా’ అనొచ్చు. అందులో రెండు అంశాలు ఉండేవి: ‘నియోజక వర్గం ఎక్కడ?’ ‘కమ్యూనిటీ ఏది?’ (క్లిక్‌: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?)

అమలులో అది ఇలా ఉండేది: 2009 ఎన్నికల ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాక, కొత్తగా నియోజకవర్గం అయిన విజయవాడ శివారులోని పెనమలూరుకు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా కె.పార్థసారథి (యాదవ్‌) ఎన్నికయ్యాక, రాజశేఖరరెడ్డి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటికి రెండవసారి గెలిచినవారిలో బందరు నుంచి పేర్ని నాని కూడా ఉన్నారు. అయినా– ‘జాగ్రఫీ’ ఇక్కడ కీలకం కావడంతో, కృష్ణా జిల్లాకు పార్థసారథి ఏకైక మంత్రి అయ్యారు. రెండవది– అదే 2009 ఎన్నికల్లో వరంగల్‌ (తూర్పు) కొత్తగా నియోజకవర్గం అయింది. బసవరాజు సారయ్య (రజక) మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్‌ తాను పాటించిన– ‘ఫస్ట్‌ టైం ఎంఎల్‌ఏ’కి మంత్రి పదవి లేదు, అనే నిబంధన పక్కన పెట్టి మరీ వైఎస్‌ ఆయన్ని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక్కడ– ‘కులం’ ప్రాతిపదిక అయింది. అలా సారయ్య భారత దేశంలో రజక కులం నుంచి రాష్ట్ర మంత్రి అయిన రెండవ వ్యక్తి అయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి మొదటివారు. ఇటువంటి– ‘మ్యాపింగ్‌’ లోకి వచ్చేదే ఉత్తర, పశ్చిమ, తూర్పు భారత రాష్ట్రాలను దక్షణాదితో కలిపే– ‘వై’ జంక్షన్‌గా ప్రసిద్ధమైన విజయవాడను కొత్తగా జిల్లా చేసి, దానికి ‘ఎన్టీఆర్‌’ పేరు పెట్టడం! నిజానికి ఈ చర్య, ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం కంటే, ఒక ప్రధానమైన– ‘కమ్యూనిటీ’కి ఈ ప్రాంత చరిత్రలో ఇచ్చిన సముచితమైన గౌరవం అవుతుంది. 
 
విశ్లేషకులు– ‘ఏ పదవి లేకుండానే చక్రం తిప్పేవాళ్ళది ఏ కులం?’ అంటూ అడగడం, ఇప్పటి సామాజిక మాధ్యమాలు తప్ప గత చరిత్ర తెలియనివారి వరకు వినడానికి బాగుండొచ్చు. కానీ, ఆ ప్రశ్నతో మళ్ళీ పాత తరానికి మర్చిపోయిన విషయాలు గుర్తుచేయడం అవుతుందేమో? ఎందుకంటే– ‘ఏ పదవి లేకుండానే చక్రంతిప్పే వాళ్ళది ఏ కులం?’ అని ఇప్పుడు అంటే– ‘వాళ్ళు గతంలో ఏ పార్టీల్లో ఉంటూ ఏ ప్రాంతాలకు ప్రజాప్రతినిధులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాల్లో ఉన్నారు? అనే ప్రశ్నకు కూడా ఇక్కడ మనం జవాబు వెతకాలి. (క్లిక్‌: అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్‌ వ్యతిరేకత)

సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు ‘ఐపాక్‌’ ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి పనిచేయాలా, వద్దా? అని ఢిల్లీలో సోనియా ఇంట జరిగిన చర్చల ప్రక్రియలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ నాయకులు ఒక్కరూ ఎందుకు లేరు? వైఎస్‌ ఇక్కడ 2004లోనే గుర్తించి అమలు చేసిన– ‘మ్యాపింగ్‌’ కాంగ్రెస్‌ పార్టీని ఘనవిజయం దరి చేర్చినప్పుడు, 2024లో కూడా అది వారికి ఎందుకు అలిమి కావడం లేదు? ఎందుకంటే, ఒకప్పటి ‘వైఎస్‌ ఫార్ములా’ను ఇరవై ఏళ్ల తర్వాత, జగన్‌ ఇప్పుడు– ‘కటింగ్‌ ఎడ్జ్‌’ (అంచు మిగలని దశ)కు తీసుకు వెళ్ళారు కనుక! 

- జాన్‌సన్‌ చోరగుడి 
 అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు