ఆక్సిజన్‌ కొరత ప్లానింగ్‌ లోపమే!

2 May, 2021 00:36 IST|Sakshi

భారతదేశం ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రుల్లో కోవిడ్‌ రోగులకు తగినంత ఆక్సిజన్‌ అందేలా చూడటంలో దేశం మొత్తం విఫలమవుతోంది. ఆక్సిజన్‌ లేమి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే రెండు ఆసుపత్రులు సకాలంలో ఆక్సిజన్‌ అందక యాభైమంది మరణించినట్లు ప్రకటించాయి. ఆసుపత్రుల బయట రోగుల క్యూలు, ఆక్సిజన్‌ సిలిండర్లతో పడుకుని ఉన్న రోగుల వీడియోలు టీవీ చానళ్లలో కనిపిస్తూంటే గుండె బరువెక్కిపోతోంది. సామాన్యుడిలో భయం మరింత పెరుగుతోంది. ఇవే వీడియోలు ప్రపంచం మొత్తం ప్రత్యక్షమవుతూండగా.. చాలామంది కోవిడ్‌ నిర్వహణలో భారత్‌ విఫలమైందని ఆరోపణలూ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాకుండా వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఉదాహరణకు... అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను తీసుకుందాం. అన్నీ సవ్యంగానే ఉన్నాయని సీఎం స్వయంగా ప్రకటించారు. కానీ టీవీ చానళ్లలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలా ఎంతకాలమని వాస్తవానికి దూరంగా రాజకీయాలు చేస్తూంటాం?

ముందు చూపు లేకపోవడమే...
దేశంలో ప్రస్తుత పరిస్థితికి ముందుచూపు లేకపోవడమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేయడం, పర్యవేక్షించడం వంటి వాటిల్లో దారుణంగా విఫలమయ్యాము. తప్పులను మాత్రమే ఎత్తి చూపుకుంటూ రాజకీయాలు నడుపుతున్నాం. నైతికంగా ఈ పరిస్థితికి ఎవరూ బాధ్యత కూడా వహించడం లేదు. భారత్‌లో ఇలాంటిది కొత్త కాకపోయినా పరిస్థితిని చక్కదిద్దేందుకు కనీసం కొందరిపై వేటు పడాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్న నేతలు ఒకరిద్దరైనా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే.

దేశం మొత్తమ్మీద ఆక్సిజన్‌ ఉత్పత్తికి పెద్దగా సమస్యల్లేకపోయినా.. ఢిల్లీ వంటి నగరాల్లో అకస్మాత్తుగా పెరిగిన కేసులకు తగ్గట్టుగా సరఫరా లేదన్నది మాత్రం కఠిన వాస్తవం. సమస్య రవాణాకు సంబంధించింది. ద్రవ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఎక్కువగా పశ్చిమబెంగాల్, ఒడిశా, కొన్ని పశ్చిమ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయాలంటే రోజుల సమయం పడుతుంది. ద్రవ ఆక్సిజన్‌ను వాయుమార్గంలో తీసుకొచ్చే అవకాశం లేదు. మరోవైపు రోడ్డుపై ఆక్సిజన్‌ను రవాణా చేసేందుకు తగినన్ని క్రయోజెనిక్‌ ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడం ఇంకో సమస్య. ఇవన్నీ పరిశీలిస్తే.. తొలి దఫా కోవిడ్‌ కేసుల తరువాత ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక ఏమీ చేయలేదా? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతున్న ప్రాంతాలకూ అవసరమైన ప్రాంతాలకూ మధ్య అంతరం చాలా ఉందన్నది కూడా వాస్తవం. భారత్‌లో ఉన్నతాధికారుల బృందం ఒకటి ఏడాది క్రితమే ఈ సమస్యలన్నింటినీ ఊహించి తగిన సిఫారసులు చేసిన మాట నిజమే. అందుకు తగ్గట్టుగా 150 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు జారీ చేసింది కూడా. వీటి ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ ఇప్పటివరకూ కేవలం 33 ప్లాంట్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఢిల్లీలో ఒకే ఒక్క ప్లాంట్‌ సిద్ధమైంది. 

పర్యవేక్షణ కొరవడింది ఎందుకు? 
ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ను కేటాయించినప్పుడు దాన్ని అందుకుని సమర్థంగా పంపిణీ చేసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఢిల్లీలో ఒక్క క్రయోజెనిక్‌ ట్యాంక్‌ కూడా లేదు. ఎందుకు? కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారు కానీ.. సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేయలేదు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంతే. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం రెండూ అవసరమైన వాటిని దిగుమతి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాయి. ఫలితంగా పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈ మధ్యకాలంలో బ్లాక్‌మార్కెటీర్లు ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివిర్‌ మందులను అక్రమంగా నిల్వ చేసుకుని డబ్బులు దండుకోవడం మొదలు పెట్టారు.

సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు ఇప్పుడు ఆక్సిజన్‌ కొరత నివారణకు ఏం చేస్తున్నారని ప్రభుత్వాలను ప్రశ్నించడం మొదలుపెట్టాయి. ఏ చర్య అయినా కానీ దేశంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో సొంతంగా ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగున ఉండే చిన్న ఆసుపత్రులకు ఈ ఆసుపత్రుల నుంచే ఆక్సిజన్‌ సరఫరా జరగాలి. దీనికి అదనంగా దేశం మొత్తమ్మీద అన్ని ప్రాంతాల్లోనూ ద్రవ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో తగినన్ని క్రయోజెనిక్‌ ట్యాంకర్లు ఉండాలి. వీటితోపాటు ప్రధాన నగరాల్లో ఊపిరితిత్తులను దెబ్బతీసే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరగాలి. ఆసుపత్రుల్లో బెడ్లు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కొరత నివారణకు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. నిపుణులు సూచించిన వినూత్నమైన ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత కాలావధిలో ఈ పనులను చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఆ సందర్భంలో వైద్య వ్యవస్థ కుప్పకూలకుండా ఇప్పటినుంచే చర్యలు మొదలుపెట్టాలి. 

బి.ఎల్‌. వోరా, మాజీ ఐపీఎస్‌ అధికారి 

మరిన్ని వార్తలు