బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు

9 Sep, 2022 10:47 IST|Sakshi
కాళోజీ నారాయణరావు 

సందర్భం

అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు / సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!?
అన్ని భాషలు నేర్చుకో. కానీ నీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకోమని చెప్పిన కాళోజీ నారా యణరావు  తెలుగు వారికి ఎన్నో విధాల ఆదర్శనీయుడు. కాళోజీ రంగా రావు, రమాబాయమ్మల రెండవ కుమారుడైన ఆయన అసలు పేరు ‘రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీ కాంత్‌ శ్రీనివాస రామరాజ్‌.’ కర్ణాటక రాష్ట్రంలోని ‘రట్టహళ్లి’ గ్రామంలో 9 సెప్టెంబర్‌ 1914న జన్మించారు. ‘కాళన్న’గా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాళోజీ రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. తెలంగాణ జీవిత చలనశీలి. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి. స్వాతంత్య్ర సమరయోధుడు. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. జీవితమంతా పోరాటాల్లో మమేకమైన కాళోజీ ‘కాళన్న’గా పరిణామం చెందడం ఒక చారిత్రక ఘట్టం.

కాళోజీ తెలంగాణ భాష, యాసలను తరతరాలకు తెలిసే విధంగా రచనలు చేశారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో దిట్ట. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి, ప్రజాకవిగా నిలిచారు. కవిత్వంతో ప్రజలను నిద్రలేపారు. మనిషితనం పట్ల ప్రేమ కలిగిన కాళోజీకి తెలంగాణ యాసపై విపరీతమైన అభిమానం. ఆయన ధిక్కార కవిత్వమంతా తెలంగాణ మాండలికంలోనే సాగింది.

కాళోజీ తన భాషాసోయిని తెలుగు ప్రాంతాలన్నింటికి కూడా వ్యాపింపజేసిన వ్యవహారదక్షుడు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష గావాలె’ అని వ్యావహారిక భాషను అందలమెక్కించిన భాషావాది. శతాబ్దపు జీవన ప్రయా ణంలో ప్రతి నిమిషం పోరాటాన్ని శ్వాసించి, కవిత్వీ కరించిన వ్యక్తి. ‘నేను ప్రస్తుతాన్ని/ నిన్నటి స్వప్నాన్ని/ రేపటి జ్ఞాపకాన్ని’ అని చెప్తూ... ఒక్కమాటలో తన వస్తుతత్వాన్ని చెప్తాడు. అలాగే ‘నవ యుగంబున నాజీ నగ్న నృత్య మింకెన్నాళ్ళు... / హింస పాపమని ఎంచు దేశమున హిట్లరిత్వ మింకెన్నాళ్లు...’ అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన యోధుడు.

‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి చావులు ఒకచోట’ అంటూ బడుగు బలహీన వర్గాలకు బాసటగా... భూస్వామ్య వాదాన్ని తిరస్కరించిన ప్రజావాది. వ్యక్తిత్వం, కవిత్వం వేర్వేరు కాని మనీషి కాళోజీ. సాహిత్య ప్రవేశానికి ముందు కాళోజీ గొప్ప కథకుడు కావాలనో, కవిని అనిపించుకోవాలనో అనుకోలేదు. కాళోజీ కవిత కాలం ప్రవహిస్తున్న వ్యథ. ఒక్క మాటలో చెప్పాలంటే కాళోజీది కమ్యూనికేటివ్‌ కవిత్వం. తన గొడవ తెలంగాణ గొడవ. మౌలికంగా మనిషి గొడవ. జీవితం, కవిత్వం, రాజకీయాలు అన్నింటిలోనూ కాళోజీ ప్రజాస్వామికవాది. ఇంకా చెప్పాలంటే తీవ్ర ప్రజాస్వామిక వాది. కేవలం పౌర హక్కులకే కాదు, సమాజంలో ఏ దారుణం జరిగినా ఖండించటంలో ఆయన ముందుండేవారు.
‘దోపిడీ చేసే ప్రాంతేతరులను / దూరందాకా తన్ని తరుముతం / ప్రాంతం వారే దోపిడీ చేస్తే / ప్రాణంతోనే పాతర వేస్తం’ అని దళారుల అణచివేత, దోపిడీలను, వాళ్ళతో మిలాఖతయిన ప్రాంతం వారిని నిర్ద్వంద్వంగా ఖండించారు.

కలం సిరాను ‘న భూతో న భవిష్యతి’గా వర్ణించిన విశిష్ట కవి కాళోజీ నారాయణరావుకు శత సహస్ర వందన చందన ములతో తెలంగాణ సాహిత్య కళాపీఠం ‘కాళన్న యాదిలో...’ కవితా సంకలనాన్ని 226 మంది కవులతో పుస్తకం తెచ్చింది.  అనేక దేశాల్లో వివిధ రంగాలలో...  కృషి చేస్తున్న 12 మంది ప్రముఖులైన తెలుగు వారిని గుర్తించి ‘ప్రజాకవి కాళోజీ జాతీయ పురస్కారాలు అందించింది. నేడు ఆ మహాను భావుని జయంతి సందర్భంగా ఘనమైన నివాళి.


దాసరి (జంగిటి) శాంతకుమారి
వ్యాసకర్త వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య కళాపీఠం ‘ మొబైల్‌: 96524 83644
(నేడు కాళోజీ జయంతి)

మరిన్ని వార్తలు