అటవీ పరిరక్షణపై రాజీపడొద్దు!

23 Oct, 2021 00:55 IST|Sakshi

చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటిని నిరంతరాయంగా ఇస్తూ అడవులు లక్షలాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. అయితే అటవీశాఖ అనుమతులను సాధించాల్సిన అవసరం లేకుండానే అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మినహాయింపులు కలిగించే వాతావరణం దేశంలో పెరుగుతోంది.

అటవీ పరిరక్షణ చట్టానికి తాజాగా ప్రతిపాదించిన సవరణలు చట్టరూపం దాల్చితే, దేశంలోని అటవీ భూములను భారీ స్థాయిలో ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి మార్గం ఏర్పడినట్లే. కొత్త విద్యుత్‌ కర్మాగారాలు, హైవేలు, బుల్లెట్‌ ట్రెయిన్‌ కారిడార్లను ఏర్పాటుచేయడానికి అడవులను అడ్డంకిగా భావించకుండా– వాటిని మనం కాపాడుకోవాల్సిన ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా పరిగణించాలి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం విధానాలను మార్చుకోవడం ప్రమాదకరం.

అనేక సందర్భాల్లో అటవీశాఖ అనుమతులను సాధించాల్సిన అవసరం లేకుండానే అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు మినహాయింపులు కలిగించే వాతావరణం దేశంలో పెరుగుతోంది. 1980లో అటవీ పరిరక్షణ చట్టం ఉనికిలోకి రాకముందు సేకరించిన భూమిని వివిధ ప్రాజెక్టులకు మళ్లించడం జరుగుతున్నా, దానిలో చాలా భాగాన్ని ఇప్పటికీ వినియోగించడం లేదు.

గత సంవత్సరం పర్యావరణ ప్రభావిత అంచనా (ఇఐఏ) చట్టాల్లో మౌలిక మార్పులను ప్రారంభించడం ద్వారా దేశ పర్యావరణ పరిరక్షణ చట్టాలపై బహుముఖ దాడికి రంగం సిద్ధమైంది. 1980 అటవీ పరిరక్షణ చట్టం స్వయంగా ఈ దాడిలో బాధితురాలు కాబోతోంది. ఆనాటి చట్టం భారత పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 1980 అటవీ పరిరక్షణ చట్టంలో తీవ్రమార్పులను ప్రతిపాదించింది. 

కేంద్ర మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ మార్పులను ఇటీవలే ప్రజా పరిశీలన నిమిత్తం బహిరంగపర్చారు. సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రభావితం చేసేలా అటవీ పరిరక్షణ చట్టానికి విస్తృతమైన భాష్యాన్ని బలహీన పర్చేలా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ప్రతిపాదించిన సవరణలు చట్టంలో భాగంగా మారితే, దేశంలోని అటవీ భూములును భారీ స్థాయిలో ఇతర ఉపయోగాలకు వాడుకోవడానికి మార్గం ఏర్పడినట్లే.

భారతదేశంలో పర్యావరణ వ్యవస్థ అంత పాతదేమీ కాదు. ఆర్థిక పురోగతిలో పర్యావరణ అంశాలను మేళవించడం అనే భావన తొలిసారిగా నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో (1969–1974) తీసుకొచ్చారు. ఆనాటివరకు రాజకుటుంబాలు, విదేశీ పర్యాటకులు సఫారీ పేరుతో జంతువుల వేటను తీవ్రస్థాయిలో కొనసాగించేవారు. అప్పట్లో వన్యప్రాణుల విభాగం వ్యవసాయ మంత్రిత్వ కార్యాలయానికి అనుసంధానమై ఉండేది. ఇది వలసపాలనా కాలం నాటి చట్టాలతోటే నడిచేది. 

1973లో ప్రారంభించిన టైగర్‌ ప్రాజెక్టు దేశంలో ప్రప్రథమ వన్యప్రాణి పరిరక్షణ ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది. తదనంతరం మంత్రిత్వ శాఖగా మారిన పర్యావరణ విభాగం 1980లో ఉనికిలోకి వచ్చింది. అదే సమయంలో రిజర్వ్‌ చేసిన అడవులను రిజర్వ్‌డ్‌ పరిధిలోంచి తీసివేయాలన్నా, అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నా కేంద్రప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని నాటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 

అలాంటి అనుమతుల విషయంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ఒక సంప్రదింపుల కమిటీని కూడా నెలకొల్పారు. దీంతో చట్టబద్ధమైన ఆదేశంతో అటవీ పరిరక్షణ విధానానికి నాంది పలికినట్లయింది. అలాగే అటవీ భూములను మరే ఇతర ప్రాజెక్టుకోసమైనా మళ్లించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు.

ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ చట్రం క్రమానుగతంగా రూపొందుతూ వచ్చింది కానీ అది ఎల్లప్పుడూ పర్యావరణ మెరుగుదలకు తోడ్పడలేదు. పర్యావరణ పరిరక్షణ అనే భావనను అవసరమైన దుష్టురాలిగా ప్రభుత్వాలు చూడసాగాయి. ఫలితంగా అటవీ పరిరక్షణ చట్టం 1980ల నుంచి అనేక మార్పులకు గురవుతూ వచ్చింది. పైగా అనేక వివాదాలకు, లావాదేవీలకు ఇది కేంద్రబిందువైంది. 1996 డిసెంబరులో సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు ఈ చట్టం పరిధిని విస్తృతం చేసింది. యాజమాన్యం, గుర్తింపు, వర్గీకరణలతో పనిలేకుండా ప్రభుత్వ రికార్డులో ’అడవి’గా నమోదైన అన్ని ప్రాంతాలకు ఇది వర్తిస్తుందని ఈ తీర్పు వ్యాఖ్యానించింది. 

ఈ అంశానికి కట్టుబడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత అటవీ చట్టం, 1927, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల కింద గుర్తించిన ప్రాంతాలను మాత్రమే అడవులుగా అన్వయిస్తూ వచ్చాయి. అయితే అడవులు అంటే నిఘంటువుల్లో ఉన్న అర్థాన్ని నిర్దారించే ప్రాంతాలను కూడా అటవీ పరిరక్షణ చట్టం కిందికి తీసుకురావాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ అనేక ఉదంతాల్లో అటవీ శాఖ ఆమోదం పొందనవసరం లేనివిధంగా ప్రాజెక్టు ప్రతిపాదనలకు మినహాయింపు నిచ్చేలా పలు లొసుగులను సృష్టిం చాలని ఇప్పుడు ప్రయతిస్తూ ఉండటం గమనార్హం. 

అయితే 1980లో అటవీ పరిరక్షణ చట్టం ఏర్పడక ముందు సేకరించిన భూమి అటవీ భూమి అయినప్పటికీ దానికి, 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎలాంటి అనుమతులూ పొందనవసరం లేదు. లేదా దీన్ని రక్షిత అటవీప్రాతంగా దీన్ని గుర్తించాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే విధంగా 1996 సుప్రీం తీర్పుకు ముందు రెవిన్యూ రికార్డుల్లో అడవిగా వర్గీకరించిన భూమిని అటవీ పరిరక్షణ చట్టం పరిధికి ఆవల ఉంచేయడం జరిగింది. అడవుల పెంపకం ఫలితంగా పెరిగిన కొత్త అడవులను వాస్తవానికి అడవులుగా గుర్తించ కూడదని కేంద్ర మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

మరొక మినహాయింపు ఏమిటంటే, అటవీ భూమిని వ్యూహా త్మక, రక్షణ ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలకు నేరుగా అనుమతి నివ్వడం. అలాంటి ప్రాజెక్టుల గురించి సరైన నిర్వచనం ఇవ్వని నేపథ్యంలో అటవీ భూములను కొత్త ప్రాజెక్టులకు ఉపయోగించుకోవడానికి అడ్డదారులకు భారీగా అవకాశం ఇచ్చేశారు.

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ గణాం కాల ప్రకారం– అటవీ నిర్మూలనను అరికట్టడంలో అటవీ పరిరక్షణ చట్టం(ఎఫ్‌సీఏ) గొప్ప పాత్ర పోషించింది. 1951 నుంచి 1976 మధ్య ప్రతి సంవత్సరం 1.6 లక్షల హెక్టార్ల అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించడం జరిగేది. కానీ అటవీ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంతో 1980 నుంచి 2011 మధ్య ఈ సంఖ్య ఏటా 32,000 హెక్టార్లకు తగ్గిపోయింది. కాబట్టి ఈ చట్టాన్ని నీరుగార్చే ఏ చర్య అయినా నిర్వనీకరణకు కారణం అవుతుంది.

చిన్న అవసరాలు తీర్చడం నుంచి, ఆహారం, పశుగ్రాసం, వైద్యానికి పనికొచ్చే మొక్కలు, వంటచెరుకు లాంటివాటిని నిరంతరాయంగా ఇస్తూ అడవులు లక్షలాది మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. కార్బన్‌ గ్రాహకాలుగా పనిచేస్తున్నాయి. అటవీ నిర్మూలన, అడవుల్లో జీవవైవిధ్యాన్ని దిగజార్చే ఏ చర్య అయినా కార్బన్‌ ఉద్గారాలకు కారణం అవుతుంది. వాతావరణ మార్పును నిరోధించాలంటే, అడవులను కాపాడుకోవడం, మరిన్ని అదనపు అడవులను సృష్టిం చడం తప్పనిసరి. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి విధానపరమైన సదస్సుకు అనుగుణంగా చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం కూడా ఇండియా దానికి కట్టుబడి ఉండాలి.

కొత్త విద్యుత్‌ కర్మాగారాలు, హైవేలు, బుల్లెట్‌ ట్రెయిన్‌ కారిడార్లను ఏర్పాటుచేయడానికి అడవులను అడ్డంకిగా భావించకుండా– వాటిని  కాపాడుకోవాల్సిన, విస్తరించాల్సిన ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా పరిగణించాలి. సహజ వనరుల నియంత్రణ కోసం ముక్కలు ముక్కల ధోరణి కాకుండా అవిభాజ్యమైన కొనసాగింపు విధానం ఉండాలి.

భారతదేశంలో అటవీ, వృక్ష ఆచ్ఛాదన ప్రస్తుతం ఒక భౌగోళిక ప్రాంతంలో ఉండాల్సిన 33 శాతం కాకుండా 25 శాతం కంటే తక్కువగా ఉంది. చెప్పాలంటే, అటవీ ఆచ్ఛాదనకు సంబంధించిన శాస్త్రీయమైన ఆడిట్‌ కూడా జరగాలి. చట్టంలో మార్పులకు సంబంధించి స్థానిక సమాజాలు, పౌర సమాజం, రాష్ట్రాలు, ఇతర పక్షాలతో కూడిన విస్తృతమైన ప్రజాబాహుళ్యంలో చర్చ జరగాలి. స్వల్పకాలిక లక్ష్యాలకు సరిపడేలా విధానాలను మార్చుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం.
– దినేష్‌ శర్మ
వ్యాసకర్త సైన్స్‌ వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు