Praja Sangrama Yatra: ప్రజల గోస అరుసుకోవాలనే!

29 Nov, 2022 13:01 IST|Sakshi

సందర్భం 

తెలంగాణలో మెజారిటీ వర్గాల ప్రయోజనాల కోసం ‘బీసీ బంధు’, అణగారిన ఎస్టీ బిడ్డల కోసం ‘గిరిజన బంధు’ను తీసు కురావడమే లక్ష్యంగా, సకల జనులు కలలుగన్న తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌ తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఐదో విడత నవంబర్‌ 28న ప్రారంభమయ్యింది.

భావి సామాజిక తెలంగాణ కోసం బండి సంజయ్‌ ఇప్పటికే నాలుగు విడతల్లో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన్రు. గతేడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రకు, టీఆర్‌ఎస్‌ప్రభుత్వం అడుగడు గున అడ్డంకులు సృష్టించింది. అయినా వెనకడుగు వెయ్య కుండా, వెన్ను చూపకుండా ఇప్పటి వరకు విడతలుగా 21 జిల్లాల్లో 1,178 కిలోమీటర్లు నడిచి బండి సంజయ్‌ తెలంగాణ ప్రజల మనసులు గెలుచు కున్నారు. 

నవంబర్‌ 28న నిర్మల్‌లోని ఆడెల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఆశేష జనవాహిని మధ్య ముధోల్‌ నుంచి పాదయాత్ర ప్రారం భమయింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల సహా... ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో 225 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాద యాత్ర డిసెంబర్‌ 17న, కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తది.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తొమ్మిదేండ్ల ఏలుబడిలో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలే. మన పొలాలకు నీళ్లు రాలే. మన డబ్బా ఇండ్లు డబుల్‌ బెడ్రూం కాలే. మన ఊరికి నిధులు రాలే. మన రైతుల అప్పులు తీరలే.  తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడలే. 

తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి అనీ, దళితులకు మూడెకరాల భూమి ఇస్తమనీ దళితులను మోసం చేసిన్రు. కేజీ టు పీజీ ఉచిత విద్య మాటలకే పరిమితమైంది. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువుల హామీలు అమలుకే నోచుకోలే. బీసీ రుణాలను మూలకు పడేసి ఐదేండ్లు కావొస్తున్నది.

పోడు భూముల్లో మొక్కలు నాటాలని ఒక వైపు అధికారులకు ఆదేశాలు ఇచ్చేదీ ప్రభుత్వమే. ఇంకోవైపు పోడు భూములకు పట్టాలిస్తామని ఆశ పెట్టేదీ ముఖ్యమంత్రే. ఈ రెండు నాలుకల నిర్వాకం వల్ల అధికారులు, పోడు రైతుల మధ్య గొడవలయ్యి, అమాయకుల ప్రాణాలు పోతున్నయ్‌. (చదవండి: ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి)

భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని, మౌలిక లక్ష్యాలైన జాతీయవాదం, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్యం, సామాజిక ఆర్థిక వ్యవస్థకు గాంధేయ విధానాలను అన్వ యించడం విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తం. దోపిడీ నుంచి విముక్తి, సమానతపై ఆధారపడ్డ సమాజం (‘సమతా యుక్త్, శాసన్‌ ముక్త్‌’)తో పాటు, విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేస్తం.

తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పార్టీగా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ బిల్లుకు సహకరించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీజేపీకి తెలంగాణ ఆకాంక్షలపై స్పష్ట మైన అవగాహనతో పాటు, అవసరమైన ప్రణాళికలు ఉన్నయ్‌. ప్రజారంజక పాలన తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొనాలని స్వాగతిస్తున్నం. (చదవండి: ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?)


- డాక్టర్‌ గంగిడి మనోహర్‌ రెడ్డి
ఉపాధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ
(‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ 5వ విడత సందర్భంగా)

మరిన్ని వార్తలు