ప్రభుత్వ పాలనకు విశిష్ట నమూనా ఏపీ

21 May, 2021 09:32 IST|Sakshi

విశ్లేషణ

గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు, రేషన్‌ కార్డులు, నగదు బదలాయింపు, ఆర్‌ఓఆర్‌ 1బీ, అడంగల్, వీధి దీపాలు, పబ్లిక్‌ కుళాయి వంటి సేవలను 24 గంటల్లోపు అందించడం ద్వారా సేవల సరఫరాలో కీలక మలుపును సాధించింది ఏపీ ప్రభుత్వం. కోవిడ్‌ కష్టకాలంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడికి చేస్తున్న సేవలు విశిష్టమైనవి. లబ్ధిదారులను గుర్తించడంలో స్థానిక నేతల జోక్యం లేనే లేదు. ప్రతిదీ పారదర్శకంగానే జరుగుతోంది. ముఖ్యంగా వలంటీర్ల సేవలు ఎంతో విశిష్టమైనవి. కేరళలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉనికిలో లేదు. అయితే సచివాలయాలు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. లోపాలను సవరించుకుని, పాలనాపరమైన మార్పులు చేసుకుపోతే ప్రభుత్వ పాలనకు ఆంధ్రప్రదేశ్‌ విశిష్ట నమూనాగా నిలబడుతుంది.

దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో 500 రకాల సేవలను అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రభుత్వ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. వీరిలో 1.26 లక్షలమంది నూతన ప్రభుత్వ ఉద్యోగులు. వీరు పాలన, రెవెన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం, పోలీసు వగైరా విధులను చేపడుతున్నారు. మిగిలినవారు గౌరవ వేతనంతో పనిచేస్తున్న వలంటీర్లు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని నియమించడం అనేది దేశచరిత్రలోనే తొలిసారిగా ప్రజల ముంగిటకే పాలనను తీసుకుపోయే విశిష్టమైన నమూనాగా నిలిచిపోయింది.

ఏపీలో 11,152 గ్రామ సచివాలయాలు, 3,913 వార్డ్‌ సచివాలయాలు ఉన్నాయి. అలాగే గ్రామాల్లో ప్రతి 2 వేలమంది జనాభాను, పట్టణాల్లో ప్రతి 4 వేలమందిని సేవించడానికి ఒక సెక్రటేరియట్‌ ఉంటున్నాయి. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 12 మంది ప్రభుత్వోద్యోగులు.. వలం టీర్లు నిర్వర్తిస్తున్న వివిధ విభాగాల  విధులను పర్యవేక్షిస్తూ పనిచేస్తున్నారు. వలంటీర్లు తాము నిర్వర్తిస్తున్న సేవల్లో అవినీతిని తొలగించి పారదర్శకంగా సకాలంలో సేవలను అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కీలక విధానమైన నవరత్నాల భావన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఈ చర్యలు తోడ్పడతాయి. 

సచివాలయ వ్యవస్థను ఏపీలో 2020 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర పథకాలను నాడు–నేడు భావన కింద గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయో చిత్రాల ప్రాతినిధ్యం ద్వారా చూపిస్తున్నారు. అలాగే కోవిడ్‌ సంబంధిత కార్యకలాపాల్లో కూడా సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ సందర్భంగా కేరళలోని స్థానిక పాలనను కూడా పేర్కొనడం సముచితంగా ఉంటుంది. కేరళలో, ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీల అధిపతికి కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. పలువిభాగాలకు చెందిన సీనియర్‌ అధికారులు ఈ విభాగాల సిబ్బందికి ఉద్యోగరీత్యా సెక్రటరీలుగా ఉంటారు. దీన్ని ప్రత్యేకించి చెప్పాలంటే, ఆరోగ్య శాఖలో వైద్య కళాశాలలు, ప్రాంతీయ స్పెషాలిటీ ఆసుపత్రులు మినహా ఇతర అన్ని వైద్య సంస్థలూ స్థానిక ప్రభుత్వాల నియంత్రణలో ఉంటాయి. ఉన్నత పాఠశాలలు, ఎగువ ప్రాథమిక పాఠశాలలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంటాయి. కేంద్ర ప్రాయోజిత దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు, పారిశుధ్యం, గ్రామీణ నీటి సరఫరా ప్రణాళిక, అమలుతో సహా దారిద్య్ర నిర్మూలన పూర్తిగా స్థానిక సంస్థల బాధ్యతగానే ఉంటుంది.

ఇకపోతే పెన్షన్లు, ఐసీడీఎస్, బాల న్యాయం వంటి శాసన సంబంధ విధులన్నింటినీ స్థానిక సంస్థలు నిర్వహిస్తాయి. ఉత్పాదకత పెంపుదల కోసం వ్యవసాయ విస్తరణకు మద్దతు, వాటర్‌ షెడ్‌ నిర్వహణ, మైనర్‌ ఇరిగేషన్, క్షీర అభివృద్ధి, పశువుల సంరక్షణ, ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ వంటివి పంచాయతీల పరిధిలో ఉంటాయి. కార్యాచరణ శిక్షణతో సహా విధులకు సంబంధించిన అంశాలపై రిఫ్రెషర్‌ శిక్షణల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు, సిబ్బంది అందరికీ నిర్దిష్టంగా శిక్షణ ఇస్తారు. ఒక స్థానిక సంస్థ తన సైజును బట్టి 15 లేక 22 మంది శాశ్వత సిబ్బందిని కలిగి ఉంటుంది. అలాగే వృత్తిపన్ను, ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతి ఫీజులు, వినోదపన్ను, సేవా పన్ను, యూజర్‌ ఫీ వంటి వాటిపై గ్రామ పంచాయతీలు సొంతంగా పన్ను విధించే అధికారాన్ని కలిగి ఉంటాయి. సగటున ప్రతి గ్రామపంచాయతీకి ఏటా నాలుగు కోట్ల బడ్జెట్‌ ఉంటుంది. దేశంలోనే అత్యంత ఆధునికమైన, వికేంద్రీకృతమైన పాలనకు కేరళ మారుపేరుగా నిలుస్తోంది.

ఆంధ్రలో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు..
కేరళలో అమలవుతున్న స్థానిక పాలనా స్థాయిని ఏపీలో అతి తక్కువకాలంలోనే ఆశించడం సబబు కాదు. ఎందుకంటే ఏపీలో స్థానిక పాలన అనేది ప్రాథమిక స్థాయిలో ఉంది. పైగా అక్షరాస్యతా రేటు, ప్రజా ప్రాతినిధ్య సంస్థలు కేరళలో చాలా బలంగా ఉన్నాయి. ఏపీ సచివాలయాల్లోని కొందరు ప్రభుత్వ సిబ్బందిని కలిసి మాట్లాడినప్పుడు, వారిలో ఆరుమందికి మాత్రమే పూర్తిస్థాయి పని ఉంటున్నట్లు చెప్పారు. పోతే, ప్లానింగ్, మహిళా పోలీసు, వసతులు సదుపాయాలు, ఎనర్జీ వంటి విధుల్లో ఉంటున్న వారికి తక్కువ పని భారం ఉంటున్నట్లు తెలింది. అయితే ఈ సచివాలయాల నుంచి మనం అనేక సానుకూల అంశాలను కూడా చూడవచ్చు. ఏపీలో సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు, రేషన్‌ కార్డులు, నగదు బదలాయింపు, ఆర్‌ఓఆర్‌ 1బీ, అడంగల్, వీధి దీపాలు, పబ్లిక్‌ కుళాయి వంటి సేవలను 24 గంటల్లోపు అందించడం ద్వారా సేవల సరఫరాలో కీలక మలుపును సాధించింది ఏపీ ప్రభుత్వం. గతంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లి తమకు అవసరమైన సేవలను పొందడానికి రోజుల తరబడి తిరగాల్సివచ్చేది. సేవలకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది.

ఇప్పుడేం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజలు తమ సమయాన్ని, డబ్బును ఉత్పాదక అవసరాలకు వెచ్చిస్తున్నారు. కోవిడ్‌ కష్టకాలంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడికి చేస్తున్న సేవలు విశిష్టమైనవి. లబ్ధిదారులను గుర్తించడంలో స్థానిక నేతల జోక్యం లేనే లేదు. ప్రతిదీ పారదర్శకంగానే జరుగుతోంది. ముఖ్యంగా వలంటీర్ల సేవలు ఎంతో విశిష్టమైనవి. కేరళలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉనికిలో లేదు. అయితే సచివాలయాలు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వివిధ విభాగాధిపతుల నియంత్రణలో నేరుగా పనిచేస్తున్నందువల్ల సచివాలయ సిబ్బంది మధ్య సమన్వయం ఉండటం లేదు.

వివిధ పథకాలకు సంబంధించి తగిన శిక్షణ కొరవడింది. శిక్షణపై స్పష్టమైన ప్రొటోకాల్స్‌ వంటివాటికి బదులుగా సిబ్బందికి వారి పైఅధికారులు వాట్సాప్‌ ద్వారా లేక మౌఖిక ఆదేశాల ద్వారా సందేశాలు పంపుతున్నారు. మరోవైపున గ్రామ సిబ్బంది ఉద్యోగాలు తాత్కాలికమేనని బెదిరిస్తూ వారి పై అధికారులు వివిధ విధుల పరిపూర్తికోసం అశాస్త్రీయమైన గడువు పెడుతూ అలవిమాలిన భారం మోపుతున్నారు. తగిన పర్యవేక్షణ లేకుండానే టెక్నికల్‌ టీమ్‌ను యాప్స్‌ని, సాఫ్ట్‌వేర్‌ని పంపించడం వల్ల పనిలో ఆలస్యం జరుగుతోంది. గ్రామ సచివాలయ కార్యదర్శుల ప్రశ్నలకు వారి పైఅధికారులు నిర్ణీత సమయంలో స్పందించకపోవడం వల్ల ప్రజలకు నచ్చచెప్పడం సమస్య అవుతోంది.

ముందడుగు ఇలా..
కేరళలోలాగే ప్రొటోకాల్స్‌ని కచ్చితంగా పాటించడం ద్వారా సచివాలయ సిబ్బందికి, పీఆర్‌ఐ సభ్యులకు నిరంతరాయంగా శిక్షణను అందించాల్సిన అవసరం ఉంది. మండల కార్యాలయాలను సందర్శించడం ప్రజలు ఆపివేశారు కాబట్టి మండల స్థాయిలో రెండు పోస్టులు ఉండాల్సిన అవసరం లేదు. తగిన హోదాతో వీరిని ఇతర విభాగాల్లో కలపాలి. లేదా పాత తహసీల్, సమితులకు మార్చాల్సి ఉంది. పాలనలో సరైన పంథాను అవలంబించడం, ప్రభుత్వ డబ్బును ఆదా చేయడం దీనివల్ల సాధ్యపడుతుంది. జవాబుదారీ తనం కోసం, సరైన సమన్వయం కోసం గ్రామ సచివాలయ సిబ్బంది ఒకే అధికారి కింద పనిచేయాలి. సమయాన్ని, డబ్బును వృ«థా చేయకుండా ఉండేందుకు టెక్నికల్‌ టీమ్‌ అభివృద్ధి చేసే ప్రతి యాప్‌ని లేదా సాఫ్ట్‌ వేర్‌ని అమలు చేయడానికి ముందస్తుగానే చెక్‌ చేసి జాగ్రత్తలు చేపట్టాలి. వలంటీర్ల పనిని క్రమానుగతంగా మదింపు చేయాలి. అవసరమైతే వారిని మార్చాలి. కేరళలో లాగే గ్రామ స్థాయిలో చాలా సేవలను అందించడానికి సచివాలయాల్లోని వివిధ విభాగాల కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడానికి ఒక నిర్దిష్ట వ్యూహాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-పృథ్వీకర్‌ రెడ్డి 
వ్యాసకర్త ఆర్థికవేత్త
ఈ–మెయిల్‌: prudhvikar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు