విధ్వంసానికే కాదు, శాస్త్రీయ విజయగాథకూ 2020 ప్రతీక

23 Dec, 2020 00:03 IST|Sakshi

సందర్భం

2020 పేరు చెబితే మానవాళికి గుర్తొచ్చేది, ప్రాణాంతకమైన వైరస్‌ విజృంభణ. అది సృష్టించిన కల్లోలం కారణంగా ప్రపంచం ఛిన్నాభిన్నమై సుమారు 15 లక్షల మంది మృత్యు వాత పడ్డారు. ప్రపంచం యావత్తూ కనీవినీ ఎరుగని ఆర్థిక వినాశనాన్ని చవిచూసింది. దాన్ని అదుపులోకి తేవడం, మానవాళిని కాపాడటం లక్ష్యంగా సైన్స్‌ ఎలా పరుగులు తీసిందో, పరిశోధన, అభివృద్ధికి ప్రపంచ భాగస్వామ్యాలు ఏవిధంగా దోహదపడ్డాయో మానవాళి గుర్తుంచుకుంటుంది.

ఈ నేపథ్యంలో 2020ని సైన్స్‌ సంవత్సరంగా అభివర్ణించాలి. కోవిడ్‌–19 కారణంగా మానవాళి అత్యుత్తమ సామర్థ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి వ్యాపిస్తున్న కొద్దీ దాని ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశోధన ప్రయత్నాలు వేగం అందుకున్నాయి. మానవాళి భద్రతతో ఎలాంటి రాజీ పడకుండానే ఆ మహ మ్మారిని నిలువరించే చికిత్సలు, వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్స్‌ అభివృద్ధి చేయడంలో  ప్రపంచస్థాయి భాగస్వామ్యాలు ఏర్పాటైనాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, దాతృత్వ సంస్థలు చేయి కలిపి ఈ ప్రయత్నం అంతటికీ అవసరం అయిన వనరులు కూడగట్టడం ప్రారంభించాయి. అందుకే ఒక్క సైన్స్‌ మాత్రమే కాదు, అంతర్జాతీయ భాగ స్వామ్యాలు కూడా ఈ ఏడాదిలో చెప్పుకోదగినవని నేనంటాను.

మానవాళి జీవితాలను కాపాడటానికి దోహదపడే విజయాలు సాధించినందుకు మాత్రమే కాదు, కనీవినీ ఎరుగని వేగంతో ప్రయత్నాలు చేసేందుకు అంకితభావం ప్రదర్శించినందుకు కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను అభినందించాలి. శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత పురస్కారా లకన్నా బృందకృషికి పెద్దపీట వేశారు. ఎలాంటి వేగాన్నయినా మనం అందుకోగలమనీ, వేగం వల్ల నాణ్యత దెబ్బ తినదనీ శాస్త్రవేత్తలు నిరూపించారు. శాస్త్ర, ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యాల ఫలాలు అందరికీ సమానంగా అందాలని నేను భావిస్తాను. మనం మరింత సమానత్వం గల ప్రపంచాన్ని సృష్టించుకుని ప్రతీ ఒక్కరికీ ఆ ఫలాలు అందేలా చూడాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్‌ హోదాలో నేను ఈ అంశంపై అన్ని దేశాలు, నిధులు అందిస్తున్న ఏజెన్సీలు, శాస్త్రవేత్తలు, దాతలతో చర్చిస్తున్నాను. ఇది మనందరి నిబద్ధత.

ఈ మహమ్మారి సమయంలో సైన్స్‌ కమ్యూనిటీ యావత్తూ సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా అలుపు లేకుండా స్థిరమైన చర్యలు చేపట్టింది. గత ఆరున్నర సంవత్సరాల కాలంగా మా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో సాధించిన విజయం– శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇన్నోవేటర్ల ప్రయత్నాల ఫలమేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ విజయానికి చిహ్నంగానే 2015 సంవత్సరం నుంచి ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ (ఐఐఎస్‌ఎఫ్‌) నిర్వహిస్తున్నాం.

మన జీవితాల నాణ్యత పెంచడానికి అవసరమైన పరిష్కారాలు అందించే విషయంలో ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రాలు’ (స్టెమ్‌) సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసి వారందరినీ ఇందులో భాగస్వా ములను చేయడం ఐఐఎస్‌ఎఫ్‌ నిర్వహణ లక్ష్యం. సైన్స్‌ అధ్యయనం మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు వీలుగా ప్రజల్లో ఉత్సుకతను పెంచడం కోసం విజ్ఞాన భారతి (విభా) సహకారంతో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎర్త్‌ సైన్సుల మంత్రిత్వ శాఖలు ఈ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశాయి. శాస్త్రీయ స్ఫూర్తిని ప్రజ్వరిల్లచేసేందుకు ప్రత్యేకంగా విద్యార్థి సమాజానికి చేరువ కావడం ఈ ఉత్సవం లక్ష్యం. ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు విద్యార్థులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మీడియా, సాధారణ ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, అందరూ ఎదురుచూసే ఒక వార్షిక శాస్త్రీయ సమ్మేళనంగా పరిణతి చెందింది. విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలందరూ వచ్చి జీవశాస్త్రాల విభాగంలో జరుగుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, వస్తున్న ఆవిష్కరణలపై ప్రత్యక్ష అనుభవం పొందేలా చేస్తున్న బహిరంగ ప్రజావేదిక ఇది.

ప్రతీ సంవత్సరం ఇది మరింత పెద్దదిగా, మెరుగైనదిగా విస్తరిస్తూ ఉండటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. అందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసే సైన్స్‌ కార్యక్రమంగా ఇది రూపాంతరం చెందింది. ఇందులో జరుగుతున్న శాస్త్రీయ కార్యక్రమాలు ప్రపంచ రికార్డులను ఛేదించి ప్రతిష్టాత్మకమైన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ పేజీల్లో స్థానం సంపాదించాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 22 నుంచి 25 వరకు వర్చువల్‌ విధానంలో జరుగుతోంది. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యం లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఆర్‌–నిస్టాడ్స్‌) ఈ భారీ ఆన్‌లైన్‌ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించి, తద్వారా ప్రపంచ సంక్షేమానికి తోడ్పాటు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘స్వయంసమృద్ధ భారత్, ప్రపంచ సంక్షేమం కోసం సైన్స్‌’ అనే ప్రధాన థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

మన దేశానికి గల సున్నితమైన శక్తిని ప్రపంచానికి చాటడం కోసమే నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. యువ శాస్త్రవేత్తలను ఆకర్షించేం దుకు స్టెమ్‌ నిర్వహించే వివిధ కోర్సులకు చెందిన 41 విభిన్న కార్యక్రమాలను ఇందులో చేర్చడం జరిగింది. 2020 సంవత్సరం కోవిడ్‌–19 వ్యాక్సిన్ల పరిశోధన సంవత్సరం అయితే, ప్రపంచవ్యాప్తంగా అది అత్యంత అవసరం అయిన ప్రజలు దాన్ని ఏవిధంగా అధిగమించారో తెలియజేసే సంవత్సరం  2021. ఈ ఉత్సవం సందర్భంగా మనం ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు రెట్టింపు చేయడానికీ, జీవితాలను కాపాడే సైన్స్‌లో సహకారాన్ని మరింతగా పెంచడానికీ ప్రతిజ్ఞ చేద్దాం.

2020 సంవత్సరం కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించివుండొచ్చు, అయినా శాస్త్రీయ విజయగాథకు కూడా అది ప్రతీక. మానవాళి ఎదుర్కొనే ముప్పును నిలువరించేందుకు శాస్త్రవేత్తలు ఎంత దీటుగా స్పందించారన్నది ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంది. కోవిడ్‌–19కి సంబంధించిన పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లు అన్నీ అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చేరేలా చూడటమే ఇప్పుడు మన ముందున్న సవాలు. ఈ ఏడాది వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్సలపై శక్తియుక్తులన్నీ ధారపోసి కృషి చేసిన శాస్త్రవేత్తలందరినీ గొంతెత్తి అభినందిస్తున్నాను.
డాక్టర్‌ హర్షవర్ధన్‌
వ్యాసకర్త కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి

>
మరిన్ని వార్తలు