ఇవేం రాతలు, ఇవేం కూతలు?

20 Jul, 2022 00:34 IST|Sakshi

విశ్లేషణ

కాలమూ, విలువలూ మారిపోవడం అంటే ఇదే కావొచ్చు. ఒకప్పుడు మీడియా తన రాతల పట్ల బాధ్యతగా ఉండేది. ఏదైనా తప్పు జరిగితే దానికి సంబంధించిన సవరణ చేయడానికి ప్రయత్నించేది. అప్పుడు కూడా ఆయా రాజకీయ పార్టీలకు కొంత మద్దతిచ్చినా, ప్రస్తుతం టీడీపీ మీడియా వ్యవహరిస్తున్నంత అరాచకంగా అయితే ఉండేది కాదు. తాము మద్దతిస్తున్న టీడీపీని అధికారంలోకి తేవడమే తమ కర్తవ్యం అన్న చందంగా అబద్ధాలు రాయడానికి ఈ వర్గం మీడియా ఏ మాత్రం సిగ్గు పడడం లేదు. అలాగే ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసినా, వాటికి ఆధారాలు ఉన్నవో లేదో చూసుకునేవి. కానీ ఇప్పుడు అసత్యాలు ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, దాని మీడియా విశ్వయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తనకు అండగా ఉండే ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో కూడా అబద్ధాల ప్రచారానికి వెరవడం లేదు. తాము చెప్పే విషయాలు అబద్ధాలు అని తేలితే పరువు పోతుందని కూడా వారు ఫీల్‌ కావడం లేదు. గత మూడేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. ఇటీవలికాలంలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే ఈ విషయాలు బోధపడతాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అక్రమ మైనింగ్‌ చేస్తున్నారనీ, ఒక చోట ఒక గుట్ట మిగిలిందనీ, దానిపైన ఒక బోర్‌ ఉందనీ... దానిని ఎలా వాడుకోవాలీ అంటూ వార్త ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక ఎగ్జిబిషన్‌ పెట్టి ఇలాంటి ఫొటోలను ప్రచారం చేశారు. ఇక ‘ఎల్లో’ పత్రికలు పూనకం వచ్చినట్లు ఆ వార్తను ప్రచురించేశాయి. తీరా చూస్తే ఆ గుట్ట తవ్వకం జరిగింది 2018 లోనే అని తేలింది. మరి ఇప్పుడు తప్పు ఎవరిది? దీనికి టీడీపీ గానీ, ఆ పార్టీకి ప్రచారం చేసే మీడియా గానీ ఏం సమాధానం ఇస్తాయి? 

తెలుగుదేశానికి జనసేన తోడయింది. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపు మేరకు ‘గుడ్‌ మార్నింగ్‌ సీఎం’ అంటూ గోతులు పడిన రోడ్లను పోస్టు చేస్తున్నారు. అవి నిజమైనవే అయితే మంచిదే. ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల రోడ్లను వారే తవ్వి, ఆ రోడ్డు పాడైపోయిందని పోస్టు పెట్టారు. సత్తెనపల్లి వద్ద అలా రోడ్డు తవ్వుతున్న జనసేన కార్యకర్తలను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారట. పవన్‌ సోదరుడు నాగబాబు రోడ్డు లేని చోట ఫొటో దిగి పోస్టు చేశారట. ఇంకో ఆయన ఏకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గోతులు పడిన ఫొటోలను ఆంధ్రప్రదేశ్‌విగా  చూపిం చారట. ఇలాంటివి సినిమాల్లో చేస్తే చెల్లుతుందేమోగానీ, నిజ జీవి తంలో అలా చేస్తే పరువు పోతుందని పవన్‌ కల్యాణ్‌ గ్రహించక పోవడమే ఆశ్చర్యకరం. 

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంను ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా వాడుకోవచ్చు. కానీ అందులో వాస్తవ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేకుంటే వారి విశ్వసనీయతే దెబ్బతింటుందన్న సంగతి గుర్తించాలి. సాధారణంగా కొన్ని వ్యవస్థలు కక్షలు, కోప తాపాలు వంటివాటికి అతీతంగా ఉండాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ. దురదృష్టవశాత్తూ ఈ రెండూ కూడా వీటికి దూరంగా ఉండలేకపోతున్నాయి. న్యాయ వ్యవస్థ అయితే ఎవరైనా విమర్శలు చేస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని ఎలా శిక్షిం చాలా అన్న ఆలోచన చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా కామెంట్లు చేస్తే చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ న్యాయ వ్యవస్థ కక్షతో ఉందనీ, కొందరి పట్ల ఒక రకంగానూ, మరికొందరి పట్ల ఇంకోరకంగానూ ఉందన్న భావన ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. 

ఇక మీడియా అయితే ఎంతో సంయమనంతో ఉండాలి. ఒకవేళ రాజకీయ పార్టీ దేనికైనా మద్దతు ఇవ్వదలిస్తే, ఆ విషయాన్ని ధైర్యంగా ప్రకటించి ఆ పని చేయవచ్చు. అప్పుడు కూడా అబద్ధాలు ప్రచారం చేయకూడదు. కానీ టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా శైలి దారుణంగా ఉంటోది. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా ఏమి రాయాలి? టీవీలలో ఏమి చూపించాలి? అన్న భావనతోనే పని చేస్తున్నాయి. ఏపీలో వరద సహాయక కార్యక్రమాల గురించి ఈనాడు ఎలా మొదటి పేజీలో వార్తలు ఇస్తున్నదో అంతా గమనిస్తున్నారు. అందుకే వైసీపీ నేత కొడాలి నాని రాజకీయ భోజనం లేనిది రామోజీరావుకూ, టీడీపీ ఇతర మీడియా సంస్థలకూ అనీ; పాలు లేనిది రాజకీయాలలో పిల్లలైన లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌లకూ అనీ ఎద్దేవా చేశారు. ఒకవేళ వారు ఇస్తున్న వార్తలలో ఏవైనా నిజాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకున్నా వాటికి అసలు ప్రాధాన్యం ఇవ్వరు. గత ఏడాది వర్షాకాలంలో రోడ్లు దెబ్బతిన్నాయి. దాంతో కొంత ఇబ్బంది ఎదురయ్యే మాట నిజం. ఆ వార్తలు ఇవ్వవచ్చు. కానీ ప్రభుత్వం స్పందించి వందల కోట్లు వెచ్చించి రోడ్లను బాగు చేసినా, వాటిని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో మూల పాడై ఉండే రోడ్డును బ్యానర్‌ కథనంగా ఇచ్చే దుఃస్థితికి ప్రధాన పత్రిక పడిపోతుందని ఊహించలేకపోయాం. జిల్లా పత్రికలు, జోనల్‌ పేజీలలో ఇవ్వవలసిన వార్తలను మొదటి పేజీలో వేస్తున్నారంటే వారి దురుద్దేశం అర్థం చేసుకోవడం కష్టం కాదు. వీటిపై తెలుగుదేశం ఏదో కార్యక్రమం చేపట్టడం, ఆ వెంటనే దానిని జనసేన అందుకోవడం నిత్యకృత్యం అయింది. ఒకరకంగా ప్రభుత్వంపై వీరంతా మూకు మ్మడిగా దాడి చేస్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి ఏడిస్తే వారిని ఓదార్చ వచ్చు. రోజూ రోదించేవారిని ఎవరు ఓదార్చగలరు? ప్రస్తుతం వీరందరి పరిస్థితి అలాగే ఉంది. 

ఇక సోషల్‌ మీడియాలో సాగుతున్న యుద్ధం కూడా చిన్నది కాదు. తమ రాజకీయ అవసరాలకు సోషల్‌ మీడియాను వాడుకో వడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ ఏ పార్టీ అయినా అభ్యంతరకరంగా పోస్టులు  పెట్టరాదు. కానీ ఈ నియమాన్ని ఎవరూ పాటించడం లేదు. సోషల్‌ మీడియా ట్రెండ్‌ దేశ వ్యాప్తంగా ఇలాగే ఉంది. అయితే ఆయా రాష్ట్రాలలో పోలీసులు కేసులు పెడుతున్నారు. అరెస్టు చేస్తున్నారు. ఎక్కడా కోర్టులు కూడా అభ్యంతరం పెట్టడం లేదు. కానీ ఏపీలో మాత్రం ఆయా వ్యక్తులపై చర్యలు తీసుకుంటే వెంటనే సంబంధిత నిందితులకు అడ్వాన్స్‌ బెయిల్‌ వచ్చిన ఘటనలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నేప«థ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని పోటాపోటీ పోస్టులు పెడుతోంది. ఉదాహరణకు రోడ్డు బాగోలేదని ఏదైనా పోస్టు వస్తే, అది వాస్తవం అయితే వెంటనే రిపేరు జరిగేలా చర్య తీసుకోవడం, అవాస్తవం అయితే ఆ విషయాన్ని వెలుగులోకి తేవడం చేస్తోంది. ఈ క్రమంలో పలు సంగతులు కూడా బయటపడుతున్నాయి. 

ఆ మధ్య తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో పాడైన ఒక రోడ్డును ఏపీ బొమ్మగా చూపుతూ ఒక పోస్టును వైరల్‌ చేశారు. అది బోగస్‌ అని రుజువులతో సహా ఏపీ ప్రభుత్వం చూపగలిగింది. అంతేకాదు, గతంలో చంద్రబాబు టైమ్‌లో రోడ్ల దుఃస్థితికి సంబంధించిన ఫొటో లనూ, ఇప్పటి ప్రభుత్వం ఆ రోడ్లను బాగు చేసిన ఫొటోలనూ పోస్టు చేశారు. ఇది రోజూవారి వ్యవహారంగా మారిపోయింది. ఇక సర్వేల పేరుతో తప్పుడు ప్రచారానికి కూడా వెనుకాడడం లేదు. టీడీపీకి వ్యతిరేకంగా ఉండే వార్తలను ఇవ్వకుండా దాచిపెట్టడం అన్నది కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ మంగళగిరి వద్ద నిర్మించిన భవనం తాలూకూ ఇరవై ఒక్క కోట్ల రూపాయలను సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థకు చెల్లించలేదట. ఆ విషయం కోర్టు వరకూ వెళ్లింది. అదే కనుక వైసీపీకి చెందిన కార్యాలయం అయి ఉంటే, టీడీపీ మీడియా రచ్చ రచ్చ చేసి ఉండేది. అంతదాకా ఎందుకు? మైనింగ్‌ అక్రమాలు అంటూ రోజూ ప్రచారం చేస్తున్న వీరు టీడీపీ హయాంలో జరిగిన స్కామ్‌లపై ఒక్క వార్త కూడా ఇవ్వడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత అవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాను మరింత సమర్థంగా వాడుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు.


కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
 
   

మరిన్ని వార్తలు