ఈ బేలతనం ఎందుకు బాబూ?

9 Dec, 2020 06:52 IST|Sakshi

ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో అరుదైన సందర్భాలు రెండు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ప్రభుత్వం అమలు చేస్తూ వస్తున్న పథకాల గురించి అత్యంత ఉత్సాహంతో, విషయ పరిజ్ఞానంతో సభలో వివరించగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు పూర్తిగా ప్రతికూల దృష్టితో ప్రభుత్వాన్ని దుయ్యబట్టడంతోనే సరిపెట్టారు. పైగా ఎన్నడూ లేనిది ఏ ప్రతిపక్ష నేతా చేయని విధంగా సభలో కింద కూర్చుని బేలతనం ప్రదర్శించడం అనూహ్యం. తన ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ చర్యల వివరణతో ప్రభుత్వాధినేత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తే.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తెచ్చిపెట్టుకున్న ఆవేశం లేదా నిస్సహాయతతో కూడిన బేలతనాన్ని ప్రదర్శించడం గమనార్హం. అసెంబ్లీలోనూ, తర్వాత జూమ్‌ ప్రసంగంలోనూ చంద్రబాబు పూర్తిగా సంయమనం కోల్పోవడం బాధాకరం.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలలో తమ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి అధికారపక్షం కృషి చేస్తే, ఏదో ఒకటి చేసి ప్రజల సానుభూతి పొందాలన్న వ్యూహంతో ప్రతిపక్షం వ్యవహరించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ సమావేశాలలో మరింత ఆత్మ విశ్వాసంతో కనిపిస్తే, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తెచ్చిపెట్టుకున్న ఆవేశం ప్రదర్శించే యత్నం చేశారు కానీ ఎక్కువ సందర్భాలలో ఆయన బేలగా కనిపించారు. చరిత్ర అనేక అనుభవాలను నమోదు చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న దీనావస్థను కూడా చరిత్ర నమోదు చేసింది. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు స్వయంగా తానే వచ్చి స్పీకర్‌ పోడియంలో కింద కూర్చున్నారు. గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించలేదు.

నిజానికి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఏ సభ్యుడైనా పోడియంలోకి వచ్చి నిరసన తెలిపితే ఆటోమేటిక్‌గా సస్పెండ్‌ అవుతారని తీర్మానించారు. అప్పట్లో యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉండేవారు. కానీ టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ విషయాన్ని మరచిపోయింది. అంతేకాదు.. తాము కోరినప్పుడల్లా మైక్‌ రావాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ప్రతిపక్ష నేతగా జగన్‌ ఉన్నప్పుడు ఆయన అరచి గీపెట్టినా అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మైక్‌ ఇచ్చేవారు కాదు. ఓటుకు నోటు కేసు అన్న పదాలు వాడితే వెంటనే మైక్‌ కట్‌ అయిపోయేది. పలుమార్లు కోడెల ప్రతిపక్షంపైన, జగన్‌ పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీ మీడియా తెగరాసింది.

మరో విషయం చెప్పాలి. ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని కూల్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశ్వాస తీర్మానం పెట్టారు. ఆ సందర్భంలో ఎన్‌.టి.ఆర్‌. తన వాదన వినిపించే ప్రయత్నం చేసినప్పుడల్లా, చంద్రబాబు పేరు ప్రస్తావన తేగానే స్పీకర్‌ యనమల మైక్‌ కట్‌ చేసి అవమానించారు. దానిని భరించలేక ఎన్‌.టి.ఆర్‌. సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎన్‌.టి. రామారావు కష్టంతో పదవులు పొందిన వీరంతా ఆయనను అవమానించడానికి వెనుకాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు అలా వ్యవహరించిన టీటీపీ ఇప్పుడు సుద్దులు చెబుతోంది. ఈ శాసనసభ సమావేశాలలో ప్రతి రోజు ఏదో ఒక వివాదమో, గొడవో సృష్టించి స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేసి టీడీపీ సభ్యులు సభ జరిగిన ఐదు రోజులూ సస్పెండ్‌ అయ్యారు. తాను అసెంబ్లీలో నేలమీద కూర్చోవడం ద్వారా, ఎమ్మెల్యేలను  సస్పెండ్‌ చేయించుకోవడం ద్వారా ప్రజల సానుభూతి పొందాలన్నది చంద్రబాబు లక్ష్యంగా కనిపించింది.

అలాగే అధికార పక్షం చేసే వాదనలు, ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చే సమాధానాలు, వీడియో సహితంగా ఆయన చూపించే సాక్ష్యాలు.. వీటన్నిటినీ ఎదుర్కోవడం కష్టం కనుక టీడీపీ అలా ప్రవర్తించిందని అనుకోవచ్చు. అంతేకాదు. ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పినా, దానిలోని నిజానిజాలతో పని లేకుండా తమ విమర్శలు కొనసాగించడానికి టీడీపీ చేసిన యత్నాన్ని ముఖ్యమంత్రి జగన్‌ అడ్డుకున్నారు. ఒక సందర్భంలో అయితే ప్రభుత్వం ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా, టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు అసత్యాలు చెబుతున్నారని ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని జగన్‌ ప్రతిపాదించారు. చంద్రబాబు అసత్యాలకు ప్రాధాన్యత ఇస్తారన్నది అందరికి తెలిసిన సత్యమే. అదే బాటలో రామానాయుడు వంటివారు కూడా ప్రయాణించి పాపులర్‌ కావాలని తాపత్రయపడుతున్నారు. ప్రభుత్వంలోని లోటుపాట్లు, ఆయా స్కీమ్‌లలో మంచి చెడులను చర్చించకుండా తమ హయాంలో అలా జరిగింది.. ఇలా జరిగింది అని గొప్పలు చెప్పుకోవడానికి, ప్రస్తుత ప్రభుత్వం అన్నిటా విఫలం చెందిందని ప్రచారం చేసుకోవడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. 

చంద్రబాబు ప్రత్యేకత ఏమిటంటే అసెంబ్లీలో మాట్లాడింది తక్కువ.. ఆ తర్వాత మీడియా సమావేశం పేరుతో జూమ్‌లో మాట్లాడింది ఎక్కువగా కనిపిస్తుంది. సంక్షేమరంగం, పోలవరం, ఆరోగ్యశ్రీ, కరోనా, వరదబారిన రైతుల కష్టనష్టాలు, మహిళలకు చేయూతలో భాగంగా అమూల్‌ సంస్థను ఏపీకి తీసుకురావడం మొదలైన అంశాలపై సభలో చర్చలు జరిగాయి. వీటిలో ఏ ఒక్కదానిలో కూడా టీడీపీ సభ్యులు పూర్తి స్థాయిలో పాల్గొనలేదనే చెప్పాలి. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అంతిమంగా సీఎం జగన్‌ తాము చెప్పదలచిన విషయాలను స్పష్టంగా ప్రజలకు తెలియచేయడానికి కృషి చేశారు.

సంక్షేమ రంగంపై జరిగిన చర్చలో మంత్రులు, ముఖ్యమంత్రి టీడీపీ హయాంలో ఎంత ఖర్చు చేసిందీ, తదుపరి తమ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందీ వివరించినా పేదలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఏడాదికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం నలభై వేల కోట్లు ఖర్చు చేసిందని జగన్‌ సోదాహరణంగా వివరించారు. పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటర్‌ కూడా తగ్గించడం జరగదని మంత్రి అనిల్‌ యాదవ్, సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పినా, 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని వివరించినా, టీడీపీ సభ్యులు ఎప్పుడు పోలవరం పూర్తి చేస్తారని ప్రశ్నిం చడం, ఏవేవో విమర్శలు చేయడం మామూలు అయిపోయింది. 

అమూల్‌ సంస్థను ఏపీలోకి తీసుకు వచ్చిన సందర్భంగా మంత్రి అప్పలరాజు గతంలో చంద్రబాబు పాలనలో  సహకార చట్టాన్ని నిర్వీర్యం చేసి మాక్స్‌ చట్టాన్ని తెచ్చి కొన్ని సహకార డెయిరీలను మూసి వేయడం, మరికొన్నింటిని కొందరి సొంత సంస్థలుగా మార్చడం వంటి విషయాలను సభకు వివరించారు. చంద్రబాబు సభ వెలుపల ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ప్రతి రోజూ ఆయా అంశాలపై చివరలో సవివరంగా మాట్లాడటం ద్వారా తనకు అన్ని సబ్జెక్టుల మీద ఎంత పట్టు ఉంది తెలియచేయగలిగారు. వృద్ధాప్య పెన్షన్‌ను మూడువేలు చేస్తానని జగన్‌ మాట తప్పారని టీడీపీ చేసిన విమర్శకు బదులు ఇస్తూ  తాను ఏమి హామీ ఇచ్చింది మ్యానిఫెస్టో కాపీని చదివి వినిపించడమే కాకుండా, తన పాదయాత్రలో ఏమి చెప్పింది వీడియో వేసి చూపించారు. నలభై ఐదేళ్లకు పెన్షన్‌ ఇవ్వడానికి వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చిందని, టీడీపీ చేసిన ఆరోపణను కూడా తిప్పికొట్టి వీడియో వేసి చూపించారు.

చంద్రబాబు కానీ, టీడీపీ సభ్యులు కాని నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, వాటిని టీడీపీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియాలు ప్రచారం చేస్తున్నాయని జగన్‌ విమర్శించారు. నిజంగానే ఈనాడు వంటి పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తున్న వార్తలు కానీ, టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేలా ఇస్తున్న కథనాలు కాని జర్నలిజం విలువలకు ఏ మాత్రం కట్టుబడి ఉండడం లేదని పదేపదే రుజువు చేసుకుంటోంది. ఉదాహరణకు పెన్షన్‌ టెన్షన్‌ అంటూ పెట్టిన హెడ్డింగ్, పోలవరం రణం అని హెడ్డింగ్‌లు పెట్టడం ఆశ్చర్యంగా ఉంటుంది. వృద్ధులకు వారి ఇళ్లకే వెళ్లి ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్న విషయాన్ని విస్మరించి టీడీపీ విమర్శలకే ఆ మీడియా ప్రాధాన్యం ఇస్తోంది. పోలవరంపై చాలా స్పష్టంగా చెప్పినా, అసెంబ్లీలో ఏదో రణం జరిగినట్లు చిత్రించే యత్నం చేశారు. కాగా అమూల్‌ సంస్థను తీసుకురావడం వల్ల లక్షలాది మంది మహిళలకు ఎలా ఉపయోగపడేది వైఎస్‌ జగన్‌ వివరిస్తూ, హెరిటేజ్‌కు పోటీగా అమూల్‌ని తీసుకు రాలేదని స్పష్టం చేశారు.

అంతిమంగా సభలో ఒక హాస్య సన్నివేశం బాగా పేలింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను పోలవరం ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లి జయము, జయము చంద్రన్న, నీకు తిరుగు ఎవరూ లేరయో అంటూ కొందరు మహిళలతో భజన మాదిరి పాడిన పాటను వినిపించినప్పుడు సీఎం జగన్‌తో సహా అంతా పడిపడీ నవ్వారు. దీనికి చంద్రబాబు 83 కోట్లు వ్యయం చేశారని ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. ఈ విమర్శకు  చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా? ఇవ్వలేరు. అందుకే సభలో ఏదో గొడవ చేసి బయటకు వెళ్లి, అదేదో తనకు అవమానం జరిగిందని చెప్పి ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారు.

అదేసమయంలో ప్రతిపక్షం సహజంగానే చికాకు పెట్టి కవ్వించాలని చూస్తుంది. దానిని గమనించి వ్యూహాత్మకంగా తిప్పి కొట్టాలి కాని అధికారపక్షం కూడా అసహనానికి గురి కాకూడదు. ఏది ఏమైనా ఈ ఐదు రోజులలో 19 బిల్లులను ఆమోదించడంతో పాటు కరోనా కారణంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం సరి కాదని అసెంబ్లీ తీర్మానించడం విశేషం. మొత్తం మీద జగన్‌ ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ ఎన్ని ప్లాన్‌లు వేసుకున్నా, వాటన్నిటిని తిప్పికొట్టి తన ఎజెండా ప్రకారం శాసనసభలో ముందుకు వెళ్లగలిగింది.
విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు   

మరిన్ని వార్తలు