ఒకే ఒక్కడు

26 Sep, 2020 03:07 IST|Sakshi

సందర్భం

ఎవరండీ ఈ బాల సుబ్రహ్మణ్యం? ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కళ్ళ రిజర్వాయర్లకు రెప్పల గేట్లు ఎత్తించేసి కన్నీటి ప్రవాహాలను దూకిస్తున్న ఆ మనిషి ఎవరండీ?
కొన్ని కోట్ల గొంతుకల్లో గుండెల్ని అడ్డం పడేసి గుండెకీ, గొంతుకకీ మధ్య కొట్లాట పెడుతున్న ఆ మహానుభావుడెవరండీ? ఇంట్లో కన్నతండ్రో, బాబాయో, అన్నయ్యో దాదాపు రెండు నెలలుగా ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ, అలుపెరగని రీతిలో మృత్యువుతో పోరాడుతుంటే, ఇంట్లోవారు ఎంత తల్లడిల్లిపోతారో, ఎలా బిక్క చచ్చిపోతారో.. అలా ప్రతి ఇంటింటా ఒక ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టించిన ఆ జీవన్మరణ పోరాట యోధుడెవరండీ? 

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ.. అన్ని భాషల వారినీ కామన్‌ గా మూగభాషలో ఏడిపిస్తున్న ఆ సకల భాషా పారంగతుడెవరండీ? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్‌.. ఇలా అన్ని మతాల వారికి సమ్మతమై, తన ఆరోగ్యం కోసం సతమతమవుతూ సర్వమత  ప్రార్థనలు చేయిస్తున్న ఆ సకల మానస చోరుడెవరండీ? 
ఇంతకీ ఎవరండీ ఈ బాల సుబ్రమణ్యం? లక్షలాదిమందిని ఏకతాటి మీద నడిస్తున్న జాతీయ నాయకుడా? కాదు... లక్షలాది గొంతుల్లో తన గానాన్ని పలికిస్తున్న జాతి గాయకుడు. లక్షలాది గుండెల్లోకి చొరబడి అరవై ఏళ్లుగా ఇంకెవరూ కబ్జా చెయ్యలేని గూడు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ చొరబాటుదారుడు ఇంకెవరూ?
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనే గానగంధర్వుడు. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు ఈ గంధర్వుడు గొంతులో అమృత భాండాన్ని దాచుకుని అవతరించాడు. పేరెంత  పొడుగ్గా ఉన్నా ‘బాలు’ అనే రెండక్షరాల ముద్దు పేరుతో మన ఇంటి బాలుడైపోయాడు. దశాబ్దాలుగా తరగని తన గానామృతాన్ని పంచిపెడుతూనే వచ్చాడు. విభిన్న కథానాయకులకు వారి కంఠస్వరంతో ఒదిగిపోతూ తన పాటల్ని పొదిగాడు. కేవలం హీరోలకు మాత్రమే కాదు, హాస్య నటులకు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు కూడా పాటలు పాడి తన ప్రతి భని నిరూపించుకున్నాడు. ఎన్నో పాత్రలకి గాత్రదానం చేసి డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా రాణించాడు.  

‘‘పాటలు పాడటమే కాదు, పాటలకి బాణీలు కట్టడం కూడా నాకు వచ్చు సుమా’’ అంటూ మన బాలు కొన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా చేసి తెలుగు ప్రజానీకానికి సూపర్‌ హిట్‌ గీతాలు అందించాడు. బాలు సంగీతంలో సవ్యసాచి మాత్రమే కాదు, త్రివిక్రముడిలా నటనా రంగంలో కూడా కాలు మోపి, తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించాడు. సకల కళా వల్లభుడిని అని నిరూపించుకున్నాడు. అమృతం తీపిగా ఉంటుందంటారు. బాలు గానం అమృతమైతే, వినయ విధేయతలతో కూడిన ఆయన వ్యక్తిత్వం తేనెలాంటిది. ఈ రెండూ మేళవిస్తే అదెంత మధురంగా ఉంటుందో బుల్లితెర మీద ఆయన కార్యక్రమాలు లోకానికి చాటి చెప్పాయి. 

మెడికల్‌ కాలేజీలు డాక్టర్లని తయారు చేస్తాయి. ఇంజనీరింగు కళాశాలలు ఇంజనీర్లని అందిస్తాయి. కానీ, మన బాలు అనే ఒక సంగీత విశ్వ విద్యాలయం కొన్ని వందల పసి గాత్రాలను లోకానికి పరిచయం చేసి భావి గాయకులుగా తీర్చిదిద్దింది. అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని అక్షరాలు దిద్దిన పసికూనలకి సంగీతంలో ఘ అంటే ఘంటసాల అనీ, సు అంటే సుశీల అనీ, జ అంటే జానకి అని కూడా నేర్పింది. త్యాగయ్య, అన్నమయ్య వంటి వాగ్గేయకారుల గీతాలపై మక్కువ పెంచి వాటి సారాన్ని తెలుసుకునేలా బోధించింది. తన పాటలతో మన మనసులను దోచుకున్న బాలు ఇలాంటి బుల్లితెర కార్యక్రమాలతో అమాంతం మన డ్రాయింగ్‌ రూములో తిష్ట వేసుకుని మన కుటుంబ సభ్యుడై పోయాడు. 

యువతరానికి అలనాటి కవుల సాహిత్యం గురించీ, అలనాటి మధుర గీతాల గురించీ ఒక ఉపాధ్యాయుడిలా బోధించిన బాలూకి రెండు చేతులూ ఎత్తి మొక్కడం తప్ప ఇంకేం చెయ్యగలం? మనం బాలు పాటలంటే చెవి కోసుకుంటాం. కానీ బాలు తెలుగు భాష అంటే రెండు చెవులూ కోసుకుంటాడు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలో, ఏ పదాన్ని ఎక్కడ విరవాలో, ఎక్కడ ఒత్తులు పెట్టాలో ఆయనకి తెలిసినట్టు మరే గాయకుడికీ తెలియదంటే అతి శయోక్తి కాదు.

మాతృభాష తెలుగు సరే, పొరుగు భాషలైన తమిళం, కన్నడం కూడా బాలుకి కరతలామలకం. తెలుగులో పోతన, వేమన పద్యాలూ, సుమతి శతకం కవుల నుంచి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, జాషువా, వేటూరి, సిరివెన్నెల.. ఒకరా, ఇద్దరా, కొన్ని డజన్లమంది కవులు, రచయితల సాహిత్యం ఆయనకి  కంఠోపాఠం. అలాగే, తమిళంలో సుబ్రహ్మణ్య భారతి, కన్నదాసన్, వైరముత్తుల సాహిత్యం కూడా ఆయన నాలుక చివరి మీదే ఉంటుంది. సందర్భాన్నిబట్టి  ప్రతి కవి గురించీ, వారి సాహిత్య మధురిమల గురించీ ఆయన విశ్లేషించి చెబుతుంటే చప్పట్లు కొట్టనివారెవరు? 

కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు, కొన్ని వేల ప్రైవేటు లలిత గీతాలు, భక్తి పాటలు కూడా బాలు ఆలాపించి రికార్డు సృష్టించాడు. వివిధ మతాలకు సంబంధించి బాలు పాడిన భక్తి గీతాలు కాలాతీతంగా నిలిచిపోతాయి. వైష్ణవాలయాలలో విష్ణు సహస్ర నామాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి ఎలాగో శివాలయాల్లో లింగాష్టకానికి బాలు తప్ప మరో చాయిస్‌ లేదు. ఇక బాలు పాడిన ఏసయ్య గీతాలు లేకుండా ఏ సువార్త కూటమి సభలూ జరగవు. ఆ విధంగా బాలు గళం అజరామరం. బాలు అంటే ఒక పరవశం. బాలు అంటే ఒక మంత్రజాలం. బాలు అంటే ఒక అద్భుతం. త్యాగరాజు ‘ఎందరో మహానుభావులు’ అంటూ కీర్తించాడు. కానీ, సంగీతాభిమానులు మాత్రం ‘ఒక్కడే మహానుభావుడు’ అని ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటారు.
 వ్యాసకర్త: మంగు రాజగోపాల్‌,సీనియర్‌ జర్నలిస్టు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా