నాకు తెలిసిన మహనీయుడు

2 Sep, 2020 09:10 IST|Sakshi

‘చాలు.. చాల్లేవయ్యా.. కూర్చోవయ్యా.. కూర్చో.. ఏందయ్యా.. నీకు బుద్ధి, జ్ఞానం ఉందా?’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును సూటిగా, స్పష్టంగా, ఘాటుగా మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటాయి. చంద్రబాబు అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేస్తూ ఆవేశపడిన ప్రతిసారీ వైఎస్సార్‌ తాపీగా చిరునవ్వులు చిందిస్తున్న దశ్యం నా కళ్ల ముందు నేటికీ కనువిందు చేస్తుంటుంది. అసెంబ్లీలో నాడు వైఎస్‌ మాట్లాడిన ప్రతి మాటా తూటాలా పేలేది. నిక్కచ్చిగా ఆయన మాట్లాడే విధానం, ముక్కు సూటితనం, నిజాయితీ.. సభ్యులను ముగ్ధు్దల్ని చేసేది. ఆయనతో కలిసి ఒక దశాబ్ద కాలంపాటు శాసనసభ్యునిగా అసెంబ్లీలో నేను ఉన్న దృశ్యాలు కళ్లలో కదలాడుతూనే ఉంటాయి. 1999లో ప్రతిపక్ష నాయకుడిగా, 2004లో తొలిసారి ముఖ్యమంత్రిగా సభలో అందరినీ ఆకట్టుకునే ఆయన శైలి అనితర సాధ్యం. (చదవండి: ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా?)

1978లో 29 సంవత్సరాల పిన్న వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి మొదటిసారి శాసనసభ్యునిగా గెలిచారు. నాలుగుసార్లు కడప పార్లమెంట్‌ సభ్యునిగా, ఆరుసార్లు పులివెందుల శాసనసభ్యునిగా విజయదుందుభి మోగించి, విజయానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. పీసీసీ రథసారథిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా, పార్లమెంట్‌ సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎంగా ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సమస్తం విభిన్న పార్శ్వాలే కనిపిస్తాయి. పదవి ప్రజల కోసమే అని నిరూపించిన గొప్ప నేత. 

ప్రతిపక్ష నాయకుడిగా 2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్సార్‌ చేసిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆనాడు ఒక చరిత్ర. మండుటెండల్లో సుమారు 1,500 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో మరో సరికొత్త వైఎస్సార్‌ ఆవిష్కృతమయ్యారు. వైఎస్సార్‌ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పాదయాత్రకు ముందు.. పాదయాత్ర తర్వాత అని చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఆనాడు అఖిలాంధ్ర జనం అనుకున్నట్టే 2004లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు. పాదయాత్రలో ప్రతి పేదవాడి కష్టం కళ్లారా చూశారు. వారి వెతలు విన్నారు. రైతును ఎలా ఆదుకోవాలి? మహిళామణులకు ఏం చెయ్యాలి? విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి మేలు చేయాలి? పేదవాడి కన్నీరు ఎలా తుడవాలి? ఇలాంటి నిరంతర ఆలోచనలే ఆయన అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టడానికి దోహదపడ్డాయి. (చదవండి:మహానుభావుడు లేకుంటే బతికేవాణ్ణి కాదు)

రూపాయి డాక్టరుగా పేదల మన్ననలు పొందిన వైఎస్సార్‌ ప్రజల మనిషిగా గొప్ప గుర్తింపు పొందారు. ఎవరు ఎదురుపడినా చిరునవ్వుతో ‘ఏమయ్యా’ అని, ‘సార్‌’ అని ప్రేమతో పేరుపెట్టి ఆప్యాయంగా పిలిస్తే రాజన్న మత్తులో, ఆ మనిషి మాయలో పడినట్టే. ఇక అంతే. జీవితాంతం ఆయన మనిషిగా ఉండిపోతాడు. 2009 ఎన్నికల్లో 33 పార్లమెంట్‌ స్థానాలను గెలిపించిన ఘనత వైఎస్సార్‌కే సొంతం. సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి ఎలా చేర్చాలి అన్నది చేసి చూపించిన ఘనత వైఎస్సార్‌దే. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని నిరూపించిన రైతు జనబాంధవుడు. 

ముఖ్యమంత్రి హోదాలో 2005లో కర్నూలు జిల్లాలోని నా నివాసం అవుకులో ‘అవుకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌’కు శంకుస్థాపన మహోత్సవానికి నా ఆహ్వానం మేరకు వచ్చారు. ఆనాడు అవుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోవెలకుంట్ల శాసనసభ్యునిగా నేను అడిగిన ప్రతి పనీ మంజూరు చేశారు. కర్నూలు జిల్లాలో 50 ఏళ్ల తర్వాత అవుకులో ప్రభుత్వ ఐటీఐ మంజూరు చేశారు. దీంతోపాటు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, 30 పడకల ఆస్పత్రి, మెట్టుపల్లె అడిషనల్‌ స్లూయిస్‌.. ఇలా నేను అడిగినవన్నీ ఇచ్చారు. కోవెలకుంట్ల సమీపంలో కుందూ నదిపై ‘జోళదరాశి ప్రాజెక్టు’కు నాంది పలికింది కూడా ఆయనే. 

ఉచితవిద్యుత్తు, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రెండు రూపాయలకు కిలో బియ్యం, పావలా వడ్డీ, భూపంపిణీ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్, రిమ్స్, ఐఐఐటీ.. వైఎస్సార్‌ సంక్షేమానికి మారుపేర్లయిన పథకాలివి. ఒక వ్యక్తిలో ఇన్ని విశిష్ట లక్షణాలు, భిన్న కోణాలు, ఇంత పోరాట పటిమ, మరే నాయకుడికి లేనంత జనాకర్షణ, అన్నింటికీ మించి పాలనాదక్షత.. వైఎస్సార్‌లోని ఈ గుణాలను తలుచుకున్న ప్రతిసారీ నా కళ్లు చెమర్చుతాయి. వారి సాహచర్యం మరపురానిది, మరువలేనిది. ఆ జ్ఞాపకాలతో ఒక్కోసారి గుండె బరువెక్కుతుంది. గొంతు మూగబోతుంది. వారి మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లినా, ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాత్రం సజీవంగా నిలిచారు.

-చల్లా రామకృష్ణారెడ్డి
వ్యాసకర్త ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్‌

మరిన్ని వార్తలు