మనం వాడే నూనె మంచిదేనా?

20 Sep, 2021 00:12 IST|Sakshi

పత్తి పంటను పండిస్తున్నది దూది కోసం మాత్రమే కాదు. తరచి చూస్తే ఇది నూనె గింజల పంట కూడా అని అర్థమవుతుంది. ప్రధాన ఉత్పత్తి దూది... ఉప ఉత్పత్తులు నూనె, చెక్క. పత్తి గింజల ఉప ఉత్పత్తులు దేశ విదేశాల్లో అనాదిగా ఉపయోగంలో ఉన్నవే. అయితే, పత్తి విత్తనాల్లో విషతుల్యమైన బీటీ(బాసిల్లస్‌ తురింగీనిసిస్‌ అనే సూక్ష్మజీవి) జన్యువును ‘జన్యుమార్పిడి సాంకేతికత’ ద్వారా చొప్పించి జన్యుమార్పిడి పత్తి విత్తనాలను రూపొందిస్తున్నారు. ఇలా తయారైన బీటీ పత్తి గింజల నుంచి తీసిన నూనెను వంట నూనెల్లో, నూనె తీసిన తర్వాత మిగిలిన చెక్కను పశువుల దాణాలో కలుపుతున్నారు. 20 ఏళ్లుగా మన దేశంలో మన ఆహార చక్రంలో ఇవి కలుస్తున్నాయి. 

జన్యుమార్పిడి సోయా చిక్కుళ్ల చెక్క (జీఎం సోయా మీల్‌) దిగుమతిపై నిషేధాన్ని గత నెలలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి సడలించడంతో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో బీటీ పత్తి గింజల నూనె, చెక్కలో మిగిలి ఉండే బీటీ విష ప్రభావం ప్రజలు, పశువుల ఆరోగ్యంపై ఎలా ఉందనేది ఆసక్తిగొలిపే అంశం. 

వినియోగం భారత్‌లోనే ఎక్కువ
కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సి.ఐ.సి.ఆర్‌.) సమాచారం ప్రకారం– 20వ శతాబ్దం తొలి నాళ్ల నుంచి పత్తి గింజల ఉత్పత్తుల వినియోగం ప్రారంభమైంది. మన దేశంలో దేశీ రకాల పత్తి గింజలను పశువులకు దాణాగా పెట్టేవారు. 1914లో ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ తొలి పత్తి గింజల నూనె మిల్లును ఏర్పాటు చేసింది. మిల్లు ఆడించిన పత్తి గింజల బరువులో 45% పత్తి చెక్క, 16% ముడి నూనె వస్తాయి.

జన్యుమార్పిడి బీటీ పత్తి సాగు మన దేశంలో ప్రారంభమయ్యే నాటికి, 2002లో మన దేశంలో 41.32 లక్షల టన్నుల పత్తి గింజల నుంచి 4.13 లక్షల టన్నుల నూనె ఉత్పత్తి అయ్యింది. ఇందులో దేశవాళీ పత్తి గింజల నుంచి తీసిన నూనె 90% వరకు ఉంటుంది. 2020వ సంవత్సరం నాటికి 90%కి పైగా మన దేశంలో బీటీ పత్తి సాగులోకి వచ్చింది. 13.9 లక్షల టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా బీటీ పత్తి గింజల నూనెను ఉత్పత్తి చేసి, వినియోగించే దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. ఇదే సంవత్సరంలో చైనాలో 13.7 లక్షల టన్నులు, బ్రెజిల్‌లో 6.8 లక్షల టన్నులు, పాకిస్తాన్‌లో 3.2 లక్షల టన్నులు, అమెరికాలో 2.2 లక్షల టన్నుల పత్తి గింజల నూనె ఉత్పత్తయ్యింది. ఆ దేశాలు కూడా 90% పత్తిని జన్యుమార్పిడి వంగడాలతోనే పండిస్తున్నాయి. 

లోతైన పరిశోధనల ఆవశ్యకత
జన్యుమార్పిడి ఆహారతోత్పత్తుల వల్ల మనుషుల్లో ఎలర్జీలు, పశువుల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.  బీటీ పత్తి గింజల్లో ఉండే బీటీ జన్యువులు, బీటీ ప్రొటీన్లు నూనెలో ఎంత మేరకు ఉన్నాయనేది కనుగొనటం సాంకేతికంగా పెద్ద సవాలని సి.ఐ.సి.ఆర్‌. పూర్వ సంచాలకులు, డాక్టర్‌ కేశవ్‌ ఆర్‌.క్రాంతి అంటున్నారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ పత్తి సలహా సంఘం సాంకేతిక సమాచార విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. 

‘‘2000–2002 వరకు నాగపూర్‌లోని సీఐసీఆర్‌ ప్రయోగశాలలో మేం జరిపిన  ప్రయోగాల్లో బీటీ పత్తి గింజల ముడి నూనెలో బీటీ జన్యువు, బీటీ విషం ఆనవాళ్లు కనిపించాయి. అయితే, శుద్ధిచేసిన తర్వాత కనిపించలేదు’’ అని ఆయన అన్నారు. ‘‘అయితే, మేము ఎలీసా, పీసీఆర్‌లతో పరీక్షలు జరిపాం. వీటిని ప్రాథమిక ప్రయోగాలుగా భావించవచ్చు. క్వాంటిటేటివ్‌ పీసీఆర్‌ లేదా ఆర్‌టీ–పీసీఆర్‌ (రియల్‌టైమ్‌ పీసీఆర్‌) పరీక్షలంతటి మెరుగైన ఫలితాలను ఈ పరీక్షలు ఇవ్వలేవు. నూనెను వేడి చేసి వాడతాం కాబట్టి లేశమాత్రంగా ఉన్న బీటీ జన్యువులు, బీటీ ప్రొటీన్ల ద్వారా మనుషులకు హాని జరగడానికి అవకాశాలు లేవు. ఏదేమైనా, ఈ అంశంపై అత్యాధునిక పద్ధతుల్లో లోతైన శాస్త్రీయ అధ్యయనాలు భారత్‌లో జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నది నా దృఢమైన అభిప్రాయం’’ అని వ్యాస రచయితకు ఇచ్చిన ఈ–మెయిల్‌ ఇంటర్వ్యూలో కేశవ్‌ క్రాంతి అభిప్రాయపడ్డారు. 

చెత్తబుట్టలో స్థాయీ సంఘం సిఫారసులు
లక్షల టన్నుల్లో వినియోగంలో ఉన్న బీటీ పత్తి గింజల నూనె, చెక్క వంటి జన్యుమార్పిడి ఆహారోత్పత్తులపై శాస్త్రీయమైన భద్రతా పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ప్రజలకు తెలియజెప్పవలసిన గురుతర బాధ్యత జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ అప్రూవల్‌ కమిటీ, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలపై ఉంది. బీటీ పత్తి సాగుపై నిర్ణయం తీసుకున్నప్పుడే నూనె, చెక్కల ప్రభావం గురించి కూడా నియంత్రణ సంస్థలు పట్టించుకొని ఉండాల్సింది. కలుపు మందును తట్టుకునేలా జన్యుమార్పిడి పత్తి అక్రమంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈ పత్తి గింజల నూనె, చెక్కతో మరింత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం క్షుణ్ణంగా అధ్యయనం చేసి దశాబ్దం క్రితమే ఇచ్చిన సిఫారసులను సైతం వరుస కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా పెడచెవిన పెట్టడం వల్లనే ప్రజారోగ్యం పెనుప్రమాదంలో పడిందని గుర్తించాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో అయినా, బహుళజాతి సంస్థల ఒత్తిళ్లను పక్కన పెట్టి, పాలకులు దృష్టి సారించాల్సిన అతి ముఖ్యమైన అంశాలివి.            

– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు