ఈ మానవతావాదం ‘సంపూర్ణ’మేనా?

6 Nov, 2021 01:01 IST|Sakshi
దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ (1916–1968)

విశ్లేషణ

దీన్‌దయాళ్‌ ప్రతిపాదించినట్లు చెబుతున్న సంపూర్ణ మానవతావాద సిద్ధాంతం తమ అధికారిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే కీలకమైన తత్వశాస్త్రమని ఆరెస్సెస్, బీజేపీ మేధావులు చెబుతున్నారు. మన దేశంలోని మైనారిటీలు మాత్రమే కాకుండా శూద్ర, దళిత, ఆదివాసులు కూడా ఈ సిద్ధాంతాన్ని పరిశీలించడం ముఖ్యం. ఎందుకంటే హిందుత్వ వర్ణధర్మ పరంపరలో చెప్పిన కనీస సమానత్వ ప్రతిపత్తిని కూడా శూద్ర, దళిత, ఆదివాసులకు కల్పించలేదు. సంపూర్ణ మానవతావాదం... హిందుత్వ బ్రాహ్మణిజంతో పోలిస్తే ఎలా భిన్నమైంది అని దేశానికి తెలపాల్సి ఉంది. మానవ, లింగ సమానత్వాన్ని, కులనిర్మూలనను, అస్పృశ్యత రద్దును ప్రతిపాదించని, ఆచరించని సిద్ధాంతం సంపూర్ణ మానవతావాదం ఎలా అవుతుందో వీరు స్పష్టం చేయవలసి ఉంది.

ఆరెస్సెస్, బీజేపీకి చెందిన మేథావులు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ (1916–1968) ప్రతిపాదించినట్లు చెబుతున్న సంపూర్ణ మానవతావాదం సిద్ధాంతాన్ని ముందుపీఠికి తీసుకొస్తున్నారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే, కార్యదర్శి రామ్‌ మాధవ్‌ పదేపదే ఉపాధ్యాయ సూత్రీకరించిన సంపూర్ణ మానవతావాదం గురించి మాట్లాడుతున్నారు. తమ అధికారిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే కీలకమైన తత్వశాస్త్రంగా వీరు ఈ సిద్ధాంతాన్ని భావిస్తున్నారు. ఈ తాత్వికతే తన ప్రభుత్వాన్ని నడిపించే దీపస్తంభమని ప్రధాని నరేంద్రమోదీ తరచుగా చెబుతూ వస్తున్నారు. రామ్‌ మాధవ్‌ తాజా పుస్తకం ‘ది హిందుత్వ పారడైమ్‌: ఇంటెగ్రల్‌ హ్యూమనిజం అండ్‌ క్వెస్ట్‌ ఫర్‌ ఎ నాన్‌–వెస్టర్న్‌ వరల్డ్‌ వ్యూ’ ఆవిష్కరణ సందర్భంగా హొసబలె ఈ సిద్ధాంతాన్ని వివరిస్తూ ‘హిందూత్వ అనేది వామపక్షమూ కాదు, మితవాద పక్షమూ కాదు.. సంపూర్ణ మానవతావాదమే దాని సారాంశం’ అని పేర్కొన్నారు.

సంపూర్ణ మానవతావాదం అనేది ఆరెస్సెస్‌ తొలి ప్రబోధకులైన సావర్కర్, హెగ్డేవార్, గోల్వాల్కర్‌ల ప్రతిపాదనలకు అంత భిన్నమైనదా అనేదే అసలు ప్రశ్న. మన దేశంలోని మైనారిటీలు మాత్రమే కాకుండా శూద్ర, దళిత, ఆదివాసుల కోణంలో కూడా ఈ సిద్ధాంతాన్ని పరిశీలించడం ముఖ్యం. ఎందుకంటే హిందుత్వ తత్వవేత్తలు వర్ణధర్మ పరంపరలో చెప్పిన కనీస సమానత్వ ప్రతిపత్తిని కూడా శూద్ర, దళిత, ఆదివాసులకు కల్పించకపోగా, మైనారిటీలకు వ్యతిరేకంగా వారిని బలమైన శక్తిగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఒక ఆరెస్సెస్‌ కార్యకర్తగా పనిచేస్తూ తన జీవితకాలంలోనే ఆ సంస్థ రాజకీయ విభాగమైన భారతీయ జనసంఘ్‌ రెండో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈయన మోహన్‌ భగవత్, దత్తాత్రేయ హొసబలె, రామ్‌ మాధవ్‌ లాగే ఒకేరకమైన బాల్య వాతావరణంలో పెరిగారు. వివిధ రాష్ట్రాలకు చెందినప్పటికీ వీరందరూ ఒకే కులనేపథ్యం కలిగినవారు. ప్రారంభంలోని వీరి సైద్ధాంతిక రచనల్లో, ప్రత్యేకించి గోల్వాల్కర్‌ రచనల్లో హిందుత్వ పరంపరాగత వ్యవస్థను విస్తృతంగా వివరిస్తూ వచ్చారు. వీరు మాత్రమే కాదు.. హిందూయిజాన్ని ఒక మిలిటెంట్‌ రాజకీయ శక్తిగా మార్చాలని సూత్రీకరించిన ఆరెస్సెస్‌ తొలి సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్‌ కూడా బ్రాహ్మణుడే. ఇప్పుడు సంపూర్ణ మానవతావాదం అని పిలుస్తున్న గొప్ప మూల సిద్ధాంత నిర్మాణ కర్తగా దీన్‌దయాళ్‌ని ముందుకు తీసుకువస్తున్నారు.

ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్తల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా శూద్ర, దళిత, ఆదివాసీల నుంచి పుట్టుకురాలేదు. చివరకు రిజర్వేషన్‌లకు వెలుపల ఉండిపోయిన జాట్లు, మరాఠాలు, పటేల్స్, కమ్మ, రెడ్డి, లింగాయత్, ఒక్కళిగ, నాయికర్లు, మహిస్యాలు వంటి శూద్ర వ్యవసాయ కులాలు మొత్తంగా ఆరెస్సెస్‌ మద్దతుదారులుగా, కార్యకర్తలుగా చాలాకాలంగా పనిచేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఇంతకాలంగా ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్తగా గానీ, దాని అధినేతగా గానీ కాలేకపోయారు. హిందుత్వ చారిత్రక వికాస దశలో కూడా శూద్ర, దళిత, ఆదివాసీలకు చెందినవారు ఒక్కరు కూడా చింతనాపరులుగా రూపొందలేకపోయారు. ఇప్పుడు అసలు ప్రశ్న. బ్రాహ్మణులు మాత్రమే ఆరెస్సెస్‌ అధినేతలవుతూ అప్పుడూ, ఇప్పుడూ సంపూర్ణ మానవతావాద సిద్ధాంతాలను ఎలా వల్లించగలుగుతున్నారు? హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలో శూద్ర, దళిత, ఆదివాసులు భాగమై ఉంటున్నప్పటికీ వీరిలో ఒక్కరు కూడా ఒక పూజారిగా, సిద్ధాంతవేత్తగా కాకతాళీయంగా కూడా ఎందుకు కాలేకపోయారు? 

దేశంలో మతపరమైన సాంస్కృతిక నిర్మాణం కొనసాగుతున్నం దున, కుల సాంస్కృతిక అభివృద్ధి కూడా బాల్యం నుంచే కొనసాగుతూ వస్తోంది. ఈ కులపరమైన సాంస్కృతిక పెంపకం ఇతర కులాలతో కలిసి జీవించే ఎలాంటి సమగ్ర అస్తిత్వాన్ని పెంచి పోషించలేదు. అందుకే భారత్‌ని వ్యక్తిగతంగా అందరూ సమానంగా ఉండే సాంస్కృతిక దేశంగా రూపొందించే లక్ష్యాన్ని ఈ సంపూర్ణ మానవతావాదం కలిగిలేదని చెప్పాలి. కాబట్టి హిందూయిజాన్ని ఆధ్యాత్మిక ప్రజాస్వామిక మతంగా మార్చే ఎలాంటి గొప్ప నిర్మాణం కూడా ఉనికిలో లేదు.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రాన్ని పరిమితంగా సమర్థిస్తూనే.. పెట్టుబడిదారీ వ్యక్తివాదం, మార్క్సిస్ట్‌ సోషలిజం రెండింటినీ వ్యతిరేకించారు. అయితే పాశ్చాత్య, ప్రాచ్య విజ్ఞాన శాస్త్రాలు ఏవైనా సరే.. వ్యవసాయ ఉత్పాదక, చేతివృత్తులకు సంబంధించిన పనుల్లో పవిత్రత, మాలిన్యం సూత్రాలను ప్రతిపాదించకుండానే, శ్రమను గౌరవించే పునాదులను కలిగి ఉంటూ వచ్చాయి. శ్రామికులు ఉత్పత్తిచేసే సరకులు, వస్తువుల విషయంలో ఇవి ఎలాంటి భేదభావాన్ని ప్రకటించలేదు. కానీ ఒక సంస్థగా బ్రాహ్మణిజం పునాదులపై నిలిచిన ఆరెస్సెస్‌... పవిత్రత, అపవిత్రత, కులాలు, జెండర్‌ వారీగా అసమానత్వం, మానవ అస్పృశ్యతను ప్రతిపాదించే బ్రాహ్మణవాద విలువల చుట్టూ ఏర్పడిన భారతీయ పరంపరతో కొనసాగుతోంది. ఈ దేశంలోని బ్రాహ్మణ మార్క్సిస్టులు, ఉదారవాద మేధావులు తీసుకొచ్చినట్లుగా కులాన్ని ఒక సమస్యాత్మక అంశంగా కూడా దీన్‌దయాళ్‌ ఎన్నడూ ప్రతిపాదించలేదు. అలాగే మహాత్మా పూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలు సూత్రీకరించిన కుల సంస్కృతిపై సమకాలీన ఆరెస్సెస్‌/బీజేపీ మేధావులు ఎవరూ వ్యాఖ్యానించిందీ లేదు. మానవ అస్పృశ్యత, కుల నిర్మూలన అనేవి మానవ జీవితంలోని అన్ని అంశాల్లో కీలక సూత్రంగా ఉండాలని పూలే, అంబేడ్కర్‌ చేసిన ప్రతిపాదనలను వీరు కనీసంగా కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో మానవ అస్పృశ్యత మినహా హిందూ వర్ణ ధర్మాన్ని బలపర్చిన మహాత్మాగాంధీ సర్వోదయ, గ్రామ్‌ స్వరాజ్‌లను మిళితం చేయడానికి దీన్‌దయాళ్‌ ప్రయత్నించారు. 

హిందూ పురాణాలు, దేవుళ్లు కూడా తొలినుంచి మైనారిటీలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడాన్నే ప్రబోధిస్తూ వచ్చాయన్నది అందరికీ తెలిసి విషయమే. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఆరెస్సెస్, బీజేపీ మేధావులు ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరిస్తారు? హిందూ దేవతలు కులపరమైన ఆధ్యాత్మిక మూలాలను ప్రోత్సహిస్తూ, సంస్థాగతీకరిస్తున్నప్పుడు వీరు ముందుకు తీసుకొస్తున్న సంపూర్ణ మానవతావాద భావం ఎలా సాధ్యమవుతుంది? దేవుడొక్కడే, మనుషులందరినీ దేవుడు సమానులుగా సృష్టించాడు అనే సూత్రం ఉనికిలో ఉన్నప్పుడే ఏకాత్మవాద భావన సాధ్యమవుతుంది. అందుకే హిందుత్వ ప్రాపంచిక దృక్పథంలో పనిచేస్తున్న శూద్ర, దళిత, ఆదివాసీల ముందు ఇప్పుడున్న పెను సవాలు ఏమిటి? అంటే ఈ సంపూర్ణ మానవతావాద సిద్ధాంతం ప్రతిపాదిస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక జాతీయవాదంలో తమ స్థానం ఎక్కడ అనేది వీరు ప్రశ్నించుకోవాలి. ఆరెస్సెస్, బీజేపీ మేధావులు ప్రచారం చేస్తున్న సంపూర్ణ మానవతవాద తాత్వికతలో కుల నిర్మూలన, లైంగిక సమానత్వం, అస్పృశ్యత రద్దు అనే కీలకమైన అంశాలకు చోటే లేదు. అందుకే హిందుత్వ సంస్థల్లో కూడా శూద్రులు, దళితులు, ఆదివాసీల అసమాన స్థితి కొనసాగుతూనే ఉంది. శూద్ర, దళిత, ఆదివాసీ మేధావుల స్వీయప్రతిపత్తిని హిందుత్వ సంస్థల నిర్మాణాలు ఇప్పటికీ అనుమతించలేదు. మోహన్‌ భగవత్, దత్తాత్రేయ హొసబలె, రామ్‌ మాధవ్‌ వంటివారు ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న సంపూర్ణ మానవతావాదం అనేది హిందుత్వ బ్రాహ్మణిజంతో పోలిస్తే ఎలా భిన్నమైంది అని దేశానికి తెలియజెప్పాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కీలక సమస్యలుగా ఉన్నవాటిని ఈ కొత్త సిద్ధాంతం ఎలా పరిష్కరిస్తుంది అని వీరు వివరించాలి. అప్పుడు మాత్రమే జాతి వీరికి ధన్యవాదాలు చెబుతుంది.

వ్యాసకర్త: ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్‌
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు