అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత అనిశెట్టి

23 Oct, 2020 00:58 IST|Sakshi

సందర్భం

అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినీ రచయితగా, పత్రికా సంపాదకుడిగా విశిష్టత సంతరించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనిశెట్టి సుబ్బారావు. 1922 అక్టోబర్‌ 23న నరసరావుపేటలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, కోట్లింగం. నరసరావుపేట మున్సిపల్‌ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఉన్నత పాఠశాలలో కుందుర్తి ఆంజనేయులు, రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు, మాచిరాజు దేవీ ప్రసాదులు ఆయన ççసహాధ్యాయులు. అనిశెట్టి 1941లో గుంటూరు ఏసీ కళాశాల నుండి బీఏ పట్టభద్రుడయ్యాడు. జాతీయోద్యమ స్ఫూర్తి, గాంధీజీ పట్ల అభిమానంతో 1942లో క్విట్టిండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్టయ్యాడు. సన్నిహిత మిత్రులైన ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండ రాందాసులు శ్లిష్టా, శ్రీశ్రీ, నారాయణబాబుల ప్రభావంతో అభ్యుదయ దృక్పథం వైపు మళ్లారు. నరసరావుపేట కేంద్రంగా 1942లో ఏర్పడిన నవ్యకళాపరిషత్‌కు అనిశెట్టి ప్రధాన కార్యదర్శి. అనిశెట్టి మద్రాసులో లా చదివే రోజుల్లో బెంగాలీ విప్లవకారుడు రతన్కుమార్‌ ఛటర్జీకి అశ్రయమిచ్చాడు. ఆయన విప్లవ కరపత్రాలు బయటపడి పోలీసులు అనిశెట్టిని అరెస్టుచేసి రాయవెల్లూరు జైలుకు పంపిం చారు. ప్రభుత్వ అధికారులు జైలు శిక్ష తగ్గిస్తామని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ప్రలోభపెట్టినా రాజీ పడలేదు. 

అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి, ఆరుద్రలు‘అఆ’లని శ్రీశ్రీ ప్రశంసించాడు. అనిశెట్టి 1943లో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన ఆరంభమైన అరసం తొలి మహాసభల నుండి 1947లో పి.వి. రాజమన్నార్‌ గారి అధ్యక్షతన జరి గిన నాలుగో మహాసభల వరకు కార్యవర్గ సభ్యులుగా చురుగ్గా పాల్గొన్నాడు. 1950లో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించటంతో అభ్యుదయ రచయితలైన శ్రీశ్రీ, అనిశెట్టి, ఆరుద్ర వంటి వారు సినీరంగానికి వెళ్లారు. 1941 నుండి 1947 వరకు భారతి, కృష్ణాపత్రిక, తెలుగుతల్లి, అభ్యుదయ వంటి పత్రికల్లో ప్రచురించిన తన కవితలను అనిశెట్టి ‘అగ్నివీణ’ కవితా సంపుటిగా ప్రచురిం చాడు. అభ్యుదయ కవితా ఉద్యమంలో కె.వి. రమణారెడ్డి భవనఘోష, రెంటాల సర్పయాగం, గంగి నేని ఉదయిని కవితా సంపుటాలు ప్రసిద్ధాలు.

అనిశెట్టి కవిగా కన్నా నాటకకర్తగా ప్రసిద్ధుడు. 1950లో గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ఫ్రాయిడ్‌ మనో విశ్లేషణాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ప్రేక్షకుల నుండి పాత్రలను ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని ఆత్రేయతో సహా చాలా మంది రచయితలు అనుసరించారు. ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోశనపట్టిన అని శెట్టి 1951లో తొలిసారిగా తెలుగులో (ఫాంటోమైమ్‌) శాంతి ముకాభినయాన్ని రాశాడు. శాంతి కాముకతో అనిశెట్టి రాసిన ఈ మూకాభినయం 1952లో ఏలూరు సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్ర«థమ బహుమతి బంగారుపతకాన్ని పొందింది. తమిళం, మలయాళం, కన్నడ వంటి అనేక ప్రాంతీయ భాషల్లోకి, ఇంగ్లిష్, రష్యా, చైనా వంటి అంతర్జాతీయ భాషల్లోకి అనువదించబడి అనిశెట్టికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. 

సినీ రచయితగా 1952 నుండి 1979 వరకు సంతానం, రక్త సంబంధం వంటి 50 సినిమాలకు మంచి పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. వంద సినిమాలకు సంభాషణలు రాశాడు. దాదాపు 300 తమిళ డబ్బింగ్‌ సినిమాలకు సంభాషణల రచయితగా ప్రసిద్ధి పొందాడు. ప్రతిభ, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడుగా విలక్షణమైన శీర్షికలు నిర్వహించాడు. 1979 డిసెంబర్లో మరణించిన అనిశెట్టి సుబ్బారావు అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినిమా రచయితగా, పత్రికా సంపాదక వర్గ సభ్యుడుగా సాహితీ ప్రియుల హృదయాల్లో చిరస్మరణీయుడు.
(నేడు అనిశెట్టి సుబ్బారావు 98వ జయంతి)


డాక్టర్‌ పీవీ సుబ్బారావు

వ్యాసకర్త సాహితీ విమర్శకులు, అనిశెట్టి సాహిత్య పరిశోధకులు ‘ 98491 77594

మరిన్ని వార్తలు