కలలో కూడా ఊహించని మహర్దశ

30 Apr, 2022 14:01 IST|Sakshi

మానవ మనుగడలో సామాజిక, ఆర్థికాభివృద్ధిలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ కారణంగానే 2002వ సంవత్సరంలో ఆరు సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు 86 రాజ్యాంగ సవరణ ద్వారా నిర్బంధ విద్యను అమలు పరచాలని కేంద్రం చట్టం చేసింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్యా వ్యవస్థ గత మాడు దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అస్తవ్యస్తం అయ్యింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఆంగ్ల విద్యతో పట్టణాలతో పాటూ గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించాయి. మారిన పరిణామాల దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తుకు ఆంగ్ల విద్య తప్పనిసరి అయ్యింది. డబ్బున్నవారు తమ పిల్లల చదువు కోసం పట్టణాలకు వెళ్లిపోతుంటే... పేదవారు మాత్రం వసతులూ, సిబ్బంది లేమితో కునారిల్లిపోతున్న ప్రభుత్వ పాఠశాలలకే పిల్లల్ని పంపుతున్నారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర సమయంలో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయ్యిందో ప్రత్యక్షంగా చూశారు. అందుకే 2019 ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో విద్యపై దృష్టి సారించారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు ‘నాడు–నేడు’లాంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశ శాతం రోజు రోజుకూ క్షీణించడం జగన్‌ గ్రహించారు. దీనిని అరికట్టేందుకు కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ‘నాడు–నేడు’ పథకానికి రూప కల్పన చేసి 2019, నవంబర్‌ 14న ప్రారంభించారు. 

ఈ పథకం ద్వారా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను పునర్నిర్మాణం చేయడం, క్షీణ దశకు చేరుకున్న ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్‌ లాంటి అన్ని రకాల డ్యామేజ్‌లను బాగుచేయడం; టాయ్‌లెట్లు, కాంపౌండ్‌ వాల్‌లను నిర్మించడం, బెంచీలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రీన్‌ బోర్డ్‌లు, వాటర్‌ ప్లాంట్‌లు, పటిష్టమైన తలుపులు ఏర్పాటు చేయడం; పాఠశాలకు ఆకర్షణీయమైన రంగులు వేయించడం లాంటి అనేక పనులు పూర్తి చేశారు. మొదటి దశలో రూ. 3,585 కోట్ల ఖర్చుతో 15,715 ప్రభుత్వ పాఠశాలలనూ, రెండో దశలో రూ. 4,732 కోట్ల ఖర్చుతో 14,584 ప్రభుత్వ పాఠశాలలనూ ఆధునికీకరించారు. అదే విధంగా 3వ దశలో రూ. 2,969 కోట్లు ఖర్చు చేసి 16,489 ప్రభుత్వ పాఠశాలలను సుందరీకరించే పని ప్రభుత్వం చేపట్టింది. అదే సమయంలో విద్యార్థుల ప్రవేశ శాతం పెంచేందుకు, తల్లిదండ్రులకు పిల్లల విద్య ఏమాత్రం భారం కాకుండా చూసేందుకు ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాదీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చి అమలు చేస్తున్నది.

దేశ రాజకీయాలలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా కేవలం ఈ రెండు సంవత్సరాల పదినెలల కాలంలో ఒక్క విద్య పైనే 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విశేషం. దీని వలన కోటీ ఇరవై లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ పరిణామంతో ఇప్పటి వరకూ ఏడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా అడ్మిషన్లు పొందారు. కొన్ని పాఠశాలల్లో ‘సీట్లు లేవు’ అనే బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. సీట్ల కొరకు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులను సిఫార్సు చేయమని అడుగుతున్నారు. ఈ స్థాయికి మన ప్రభుత్వ పాఠ శాలలు చేరతాయని మూడేళ్ల క్రితం కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. (క్లిక్‌: అనితర సాధ్య సామాజిక నమూనా!)

- కైలసాని శివప్రసాద్‌ 
 సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు