భారత్‌పై అభియోగాల పత్రం

11 Dec, 2023 00:01 IST|Sakshi
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత సంతతి ఖలిస్తానీ ఉగ్రవాది గురుపథ్‌వంత్‌ సింగ్‌ పన్నూ

కామెంట్‌

విలియం షేక్‌స్పియర్‌ నాటకం ‘ద మర్చెంట్‌ ఆఫ్‌ వెనిస్‌’లో షైలాక్‌ కనికరం లేని వడ్డీ వ్యాపారి. స్నేహితుడి కోసం ‘నాదీ పూచీ’ అంటూ డబ్బు తీసుకుని చివరికి తీర్చలేకపోతాడు ఆంటోనియో. పరిహారంగా ఒక పౌండు ఆంటోనియో మాంసాన్ని అడుగుతాడు షైలాక్‌. భారత్‌పై యూఎస్‌ తాజా అభియోగ పత్రంలోని నేరారోపణలు కొంతవరకు ఆంటోనియోను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. అమెరికన్‌ పౌరుడు గురుపథ్‌వంత్‌ సింగ్‌ పన్నూపై కొద్దిరోజుల క్రితం జరిగిన హత్యాయత్నం వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందన్నది అమెరికా ఆరోపణ. సంబంధాలు ఇరు దేశాలకూ ముఖ్యమే కనుక యూఎస్‌ ఈ విషయంలో మౌనంగా ఉండి, షైలాక్‌లాగా భారత్‌ నుంచి పరిహారంగా ‘ఒక పౌండు మాంసాన్ని’ కోరుతుందా?

చేర్పులు, జోడింపులతో మరింతగా బలప రిచి అమెరికా ప్రభుత్వం తాజాగా బహిర్గత పరచిన పూర్వపు అభియోగ పత్రాన్ని ఒక కల్పిత కథనంగా మీరు విశ్వసిస్తే తప్ప, అందులోని వెల్లడింపుల పట్ల అందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ, విచారణకు వెళ్లనున్న కేసు అది. తేలిగ్గా కొట్టి పడేసి పక్కకు తోసేయవలసినది కాదు. కాబట్టి, సహాయకారిగా ఉంటుందనుకుంటే కనుక మనం దృష్టి సారించవలసిన అంశాలను కొన్ని ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా ఒక జాబితాగా పొందుపరుస్తాను. 

మొదటిది – అమెరికా గడ్డ మీద ఒక అమెరికన్‌ పౌరుడిని (నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ సంస్థ నేత గురుపథ్‌ వంత్‌ సింగ్‌ పన్నూ) హత్య చేయించేందుకు సిసి–1 అనే సంకేత నామధారి పథక రచన చేయడం! యు.ఎస్‌. తిరగ రాసిన అభియోగ పత్రంలోని అరోపణ లను బట్టి– ‘భద్రతా నిర్వహణ’, ‘ఇంటెలిజెన్స్‌’ విభాగాలలో బాధ్య తలు నిర్వర్తిస్తూ తనను తాను ‘సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌’నని చెప్పుకుంటున్న ఆ సంకేత నామధారి భారత ప్రభుత్వ సంస్థలో గుర్తింపు పొందిన ఉద్యోగిగా ఉన్నాడు. గతంలో అతడు సెంట్రల్‌ రిజర్వ్‌›్డ పోలీస్‌ ఫోర్స్‌లో కూడా పని చేశాడు.

మరీ ముఖ్యంగా ఈ సిసి–1 అనే వ్యక్తి ఆ అభియోగ పత్రంలో పేర్కొన్న అన్ని సమయాలలోనూ భారత ప్రభుత్వం నియమించిన విధుల నిర్వహణలో ఉన్నాడు. ఇండి యాలోనే ఉన్నాడు. ఇండియా నుంచే హత్యకు కుట్ర పన్నాడు. ఇదేం సూచిస్తోంది? సిసి–1 వెనుక భారత ప్రభుత్వం ఉందనా? లేక సిసి–1 అనే అతడు ఒక మోసగాడు అయి ఉండవచ్చుననా?

రెండవది – ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మోసగాడు ఎలా ఉండి ఉంటాడు? ఒంటరి తోడేలు మాదిరిగానా? లేక, దేశ అత్యుత్తమ ప్రయో జనాల కోసం పనిచేస్తున్న ఒక చిన్న సమూహంలో భాగంగానా? లేదా అన్ని అధికారిక అనుమతులతో వ్యూహాత్మక టక్కరిగా నటిస్తున్న అత్యున్నతస్థాయి ప్రభుత్వ అధికారి అయివుంటాడా?మూడవది – ఆ సిసి–1 ఎవరైనా గానీ అసమర్థంగా ఈ పనిని నిర్వహించాడా? ‘నిఖిల్‌ గుప్తా అనే ఒకానొక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణా వ్యాపారిని సిసి–1 పనిలోకి దింపాడు.’ తనకు తెలియకుండానే అలా చేశాడా? తెలియకపోతే తెలుసుకోవలసిన పని లేదా? ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే నిఖిల్‌ గుప్తాను ఎంచుకుని ఉంటే అది తెలివైన ఎంపికేనా? 

నాల్గవది – ఇక నిఖిల్‌ గుప్తా ఏం చేశాడంటే ‘డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (డి.ఇ.ఎ.)కు రహస్య సమాచారం అందించే వ్యక్తిగా మారిన ఒక భాగస్వామ్య నేరస్థుడిని సంప్రదించాడు. ఆ వ్యక్తి కిరాయి హంతకుడిగా నటిస్తున్న ఒక రహస్య ప్రభుత్వ అధికారి (అండర్‌ కవర్‌ ఏజెంట్‌) దగ్గరికి గుప్తాను తీసుకెళ్లాడు. దీన్నిబట్టి డి.ఇ.ఎ. గుప్తాను నీడలా వెంటాడుతోందనీ, కాబట్టి గుప్తా గురించి మన వరకు రాని అనేక విషయాలు డి.ఇ.ఎ.కు తెలిసి ఉంటాయనీ అనుకోవచ్చా? మరీ ముఖ్యంగా, ఇదొక దారుణమైన గందరగోళంగా అనిపించడం లేదా? బహుశా దీనికంటే ‘డాడ్స్‌ ఆర్మీ’ (హోంగార్డులు) నయం కదా?

ఐదవది – కెనడాలో జూన్‌ 18న హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, ‘రక్తంతో తడిసిన నిజ్జర్‌ మృతదేహం ఆయన వాహనంపై పడివున్నట్లు చూపించే వీడియో క్లిప్పును గుప్తాకు సిసి–1 పంపించాడు.’ ఈ ఆరోపణ... సిసి–1కి నిజ్జర్‌ హత్యతో నేరుగా సంబంధం ఉందని చెప్పడానికి యు.ఎస్‌. అధి కారులు సాక్ష్యాధారాలను సృష్టించడాన్ని సూచిస్తోందా? అదే నిజమైతే భారత్‌పై జస్టిన్‌ ట్రూడో ఆరోపణలకు ఆ సాక్ష్యాధారాలే బలం చేకూరుస్తున్నాయా?

కలవరపరిచే సమాచార వ్యవస్థ
ఆరవది – ‘హత్య తర్వాత కొన్ని వారాల పాటు గుప్తా... భాగ స్వామ్య నేరస్థునితో, ఆ తర్వాత కిరాయి హంతకుడితో – ఫోన్, వీడియో, టెక్స్‌›్ట మెసేజేస్‌ వంటి వాటి ద్వారా వరుసగా ఎలక్ట్రానిక్, రికార్డెడ్‌ సంభాషణలను జరిపాడు’ అని యు.ఎస్‌. అభియోగ పత్రం చెబుతోంది. ఆ సంభాషణలు సంకేత నిక్షిప్త సందేశాల రూపంలో ఉన్నప్పటికీ వాటిని అడ్డగించి ఉంటారు. అంటే యు.ఎస్‌. అధికారుల వద్ద ఇప్పటికీ బయట పెట్టని సమాచారం గుట్టలు గుట్టలుగా మిగిలి ఉందనేనా? అది కూడా మన సమాచార వ్యవస్థ తాలూకు పటిష్ఠత, భద్రతల గురించి కలవరపరిచే ప్రశ్నలను రేకెత్తిస్తోంది. 

ఏడవది – కనీసం నాలుగు వేర్వేరు చోట్ల హత్యకు వ్యూహం పన్నినట్లు యు.ఎస్‌. అభియోగ పత్రం చెబుతోంది. వాటిల్లో ఒకటి న్యూయార్క్‌లో... బహుశా గురుపథ్‌వంత్‌ సింగ్‌ పన్నూని హత్య చేయడం కోసం... మరొకటి క్యాలిఫోర్నియాలో, మరో రెండు కెనడాలో! నిజానికి ఒక దశలో గుప్తా... ‘‘మేము ప్రతి నెలా 2–3 జాబ్‌ వర్క్‌లు ఇస్తాం’’ అని అన్నట్లు యు.ఎస్‌. ఆరోపణలలో ఉంది. ఇదెలా వినిపిస్తోంది? ఒకే ఒకసారి హత్యలన్నిటికీ లేదా వరుస హత్యల ప్రారంభానికి పథక రచన జరిగిందనే అర్థం ధ్వనించడం లేదా?

చివరిగా – యు.ఎస్‌. ప్రభుత్వ స్పందన. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్‌ ఆగస్టు నెలలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఎదుట అమెరికా స్పందనను ప్రస్తావనకు తెచ్చారు. ఒక వారం తర్వాత సి.ఐ.ఎ. అధినేత విలియమ్‌ బర్న్స్‌ భారత్‌లోని ఆర్‌.అండ్‌ ఎ.డబ్లు్య.(రా) అధినేతతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చారు. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్‌ సెప్టెంబరులో జి–20 సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తారు.

ఆ నెలాఖరున వాషింగ్టన్‌లో మళ్లీ సల్లివాన్, యు.ఎస్‌. విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్‌... విషయాన్ని జైశంకర్‌ దృష్టికి తెచ్చారు. చివరిగా అక్టోబర్‌లో నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ అవ్రిల్‌ హెయిన్స్‌ మరిన్ని అభియోగ వివరాలతో భారతదేశానికి వచ్చారు. దీనర్థం... వైట్‌ హౌస్‌ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోందనే కదా! వాస్తవానికి దోవల్‌తో సల్లివాన్‌ ‘‘ఇలాంటిది మరోసారి జరగదన్న హామీని అమెరికా ప్రభుత్వం కోరుతోంది’’ అని అన్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ నివేదించింది. కఠినమైన భాష కాదా ఇది?

యు.ఎస్‌. అభియోగ పత్రం మొత్తం అంతా కల్పితం అని విశ్వసించినప్పుడు మాత్రమే మనం ఈ ప్రశ్నలన్నిటినీ విస్మరించగలం. కానీ మీరు ఈ ప్రశ్నలను పూర్తి పరిగణనలోకి తీసుకుంటే కనుక మరొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒకవేళ, చివరికి వాషింగ్టన్‌ ఈ వ్యవహారాన్నంతా చూసీ చూడనట్లు ఉండిపోయేందుకు నిర్ణయించుకుంటే – భాగస్వామ్య వ్యూహాత్మక ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి – భారత్‌ నుంచి ఒక ‘మాంస ఖండాన్ని’(పౌండ్‌ ఆఫ్‌ ఫ్లెష్‌) ప్రతి ఫలంగా కోరుతోందా?
అమెరికన్‌ షైలాక్‌ దయతో నేనొక భారతీయ ఆంటోనియోగా ఉండటాన్ని ద్వేషిస్తాను. లేదా మనల్ని కాపాడేందుకు పోర్షియా వంటి కారుణ్యమూర్తి ఎవరైనా రెక్కలు కట్టుకుని ముందుకొస్తుందా?
కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

>
మరిన్ని వార్తలు