గిరిసీమ విధ్వంసం రేపుతున్న ప్రశ్నలు

15 Jul, 2023 00:19 IST|Sakshi

ఉత్తరాదిలో కురిసిన వానలకు ముఖ్యంగా పర్వత ప్రాంతాలు జలమయమైనాయి. జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం బాధాకరమే అయినప్పటికీ ఇదేదో ప్రకృతి ప్రకోపమని సర్ది చెప్పుకునేందుకు వీల్లేదు. ఇది ప్రకృతి హెచ్చరికలను పెడచెవిన పెట్టిన మనిషి దురాశ ఫలితమే. పర్వత ప్రాంతాల్లోని నదులు, వంకలు, వాగులు చిన్న వానకే అకస్మాత్తుగా ఉరకలెత్తే అవకాశాలెక్కువ. అయినా ఇళ్ల నిర్మాణాల కోసం డిజైన్‌  కోడ్‌ పాటించకపోవడం; సరైన రీతిలో తయారు చేసిన కాంక్రీట్, తగిన పిల్లర్లు వాడకపోవడం వల్లనే ప్రస్తుత విధ్వంసం జరిగింది. పర్వతాల్లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడు ప్రకృతిని గౌరవించడం అలవర్చుకోవాలి. అవసరమైనంత మాత్రమే కట్టుకోవడం, మిగిలినది ప్రకృతి ఛాయలోనే ఉంచడం మేలు.

వారం అంటే వారం చాలు... ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాల్సిన హాలిడే సీజన్‌  కాస్తా పర్యావరణ విధ్వంసంగా మారిపోయేందుకు! అప్పుడే వేసిన రోడ్లు కొట్టుకుపోవడం, వంతెనలు నదుల్లోకి చేరి ప్రవహించడం, కొండచరియలు విరిగిపడటం, పెద్ద పెద్ద భవంతులు పునాదులు కదిలిపోయి నీళ్లలోకి చేరిపోవడం చూశాం. బహుశా ఇవేవీ కొత్త దృశ్యాలు కాకపోవచ్చు కానీ, ఇరవై ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈమధ్య తరచూ చూడాల్సి వస్తోంది. వార్తాపత్రికల్లోని వార్తలు, సోషల్‌ మీడియా పోస్టులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రకృతి వైపరీత్యాన్ని కళ్లకు కడుతున్నాయి. అనూహ్యమైన వర్షాలు, ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాయి. యాత్రీకులు దిక్కుతోచని విధంగా చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కూడా మరీ కష్టసాధ్యంగా మారాయి.

ఒక ఆర్కిటెక్ట్‌గా ఈ గిరిసీమలో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను. చిన్నప్పుడు భూటాన్‌లో పెరిగినప్పటి నుంచి పర్వతాలతో నాకు అనుబంధం ఉంది. అయితే పర్వత ప్రాంతాల్లోని భవనాల గురించి మొదట తెలిసింది విఖ్యాత అధ్యాపకులు ఎంఆర్‌ అగ్నిహోత్రి వద్ద రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడే. పర్వతారోహకుడు, ఆర్కిటెక్ట్, విద్యావేత్త కూడా అయిన ప్రొఫెసర్‌ అగ్నిహోత్రి లాంటి వ్యక్తి ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 

ఉత్తరకాశీ ప్రాంతంలో నేనూ, ఆయనా కలిసి ఎన్నో చోట్ల పర్యటించాం. 1992 నాటి భయంకరమైన భూకంపం తరువాత పదేళ్లపాటు పునరావాస కార్యక్రమాలను పరిశీలించాం. సమీక్షించాం. ప్రాజెక్టులో నాలుగు నెలలు పనిచేస్తే, సగం క్షేత్రస్థాయిలో మిగిలిన సగం ఆఫీసులో ఉంటూ ‘వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌  డిజాస్టర్‌ మిటిగేషన్‌ ’ కోసం నివేదిక సిద్ధం చేస్తూ గడిపాము. అదో అద్భుతమైన అనుభవం. ఇప్పటికీ నాకు ఎంతో అపురూపమైంది. అనుభవంలో తలపండిన వ్యక్తి ద్వారా పర్వత ప్రాంతాలు ఒక అకెడమిక్‌ కోణంలో పరిచయం కావడం నా అదృష్టం.
 
ఆ ప్రాజెక్టులోనే నాకు ఓ అద్భుతమైన విషయం తెలిసింది. భాగీరథి నదీ తీరం వెంబడి ఉన్న మానేరి గ్రామంలో ఓ చిన్న జలవిద్యుత్‌ కేంద్రం ఉంది. డ్యామ్‌కు రహదారికి మధ్య నదీ తీరంలో ఉంటుంది ఈ గ్రామం. ఆర్‌సీసీ ‘పిల్లర్లు’, ‘లింటార్‌’ నిర్మాణాలతో అన్నీ ‘పక్కా’ ఇళ్లే ఉండేవి అక్కడ. ప్రాజెక్టు నిర్మాణానికి వాడిన ఉక్కు, కాంక్రీట్‌తోనే వీటినీ కట్టారేమో అనుకునే వాడిని. 1992 భూకంపంలో ఈ గ్రామం మొత్తం ధ్వంసమైపోయిందని తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఆ భూకంపంలో మరణించినట్లు తెలిసింది. 

భూకంపం కదా, ప్రాణనష్టం ఉంటుందని అనుకోవచ్చు. ఆర్‌సీసీ స్తంభాలు వాడారని చెప్పుకున్నాం కదా... దాన్ని చాలా సున్నితంగా పరిస్థితులకు తగ్గట్టుగా వాడాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పట్టించుకోకపోయినా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది అదే. సరైన రీతిలో తయారు చేయని ఆర్‌సీసీ, డిజైన్‌ కోడ్‌ పాటించకపోవడం వల్లనే ప్రస్తుత విధ్వంసం జరిగింది. 

స్థానిక కాంట్రాక్టర్‌ మాటల ప్రకారం, అక్కడ ఇళ్ల నిర్మాణానికి ‘3 అడుగులు బై 3 అడుగుల’ కాలమ్స్‌ను ఉపయోగిస్తునారు. భవనం ఎత్తు ఎంత ఉన్నా ఇంతే సైజు స్తంభాలను వాడుతున్నారు. కొందరైతే వీటి మీదే నాలుగైదు అంతస్తుల భవనాలు కట్టారు. ఆ ప్రాంతం బిల్డింగ్‌ కోడ్‌ ప్రకారం రెండు అంతస్తుల కంటే ఎత్తయిన భవనాలు కట్టరాదు. ఎక్కువ అంతస్తులుండటం లాభాలు తెస్తుంది కానీ, ప్రమాదం కూడా చెప్పకుండా వచ్చేస్తుంది. 

అల్మోరా(ఉత్తరాఖండ్‌)లో చాలా ఏళ్ల క్రితం నేను ఓ భవనం కట్టించా. ఆ సందర్భంలో కాంట్రాక్టర్‌ ఆందోళనతో ఫోకస్‌  చేశాడు. భవన నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్స్‌ సరిగానే ఉన్నాయా? అని అడిగాడు. ఎందుకంటే ఆ చిత్రాల్లో స్తంభాల అడుగు భాగాలు (ఫుటింగ్స్‌) భారీ సైజుల్లో ఉన్నాయి. ఆ సైజులో ఫుటింగ్స్‌ ఏర్పాటు చేయడం వల్ల ఖర్చులు ఎక్కువవుతాయన్నది ఆయన ఆందోళన. ఎలాగైనా వీటి సైజులు తగ్గించాలని అభ్యర్థించాడు. అంత మొత్తంలో ఉక్కు కూడా ఎవరూ వాడరని వాదించాడు. 

అయితే నేను వాటిని తగ్గించలేదు. ఎందుకంటే భూకంపం రాగల ప్రమాదమున్న జోన్లలో అత్యంత ప్రమాదకరమైన ఐదవ జోన్‌ లో అంత మొత్తం కాంక్రీట్‌ వాడాల్సిందే. భవనం కట్టిస్తున్న వారితో మాట్లాడి... ఈ విషయాలన్నీ వారికి వివరించి కాంట్రాక్టర్‌కు కొంచెం ఎక్కువ చెల్లించేలా ఒప్పించి మరీ భవన నిర్మాణాన్ని కొనసాగించాము. 

పర్వతాలిప్పుడు భవనాలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. స్థానిక మేస్త్రీలే కాంట్రాక్టర్ల అవతారమెత్తి కట్టేస్తున్నారు. స్థానికులు కూడా చౌకగా అందుబాటులో ఉన్నారని వీరికే పనులప్పగిస్తున్నారు కూడా. ఆధునిక సమాజంలో ఇంజినీరింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాలతో అద్భుతాలు సృష్టించవచ్చునని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ టెక్నాలజీలు, ఆధునిక హంగులకు కొంత ఖర్చూ అవుతుంది. కొన్నిసార్లు ఈ ఖర్చు చాలా ఎక్కువ. సైజు, స్థాయి పెరిగే కొద్దీ ఖర్చు ఇబ్బడిముబ్బడి అవుతూంటుంది. అయితే టెక్నాలజీ వాడకంలో నష్టాలూ లేకపోలేదు. తగిన విధంగా ఉపయోగించకుంటే, నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం అమలు చేయకుంటే దారుణ వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. టీవీల్లో చూపినట్లు భవనాలు, వంతెనలు కుప్పకూలిపోవడం, ప్రవహిస్తూండటం టెక్నాలజీని సక్రమంగా వాడని ఫలితమే. 

మానేరి గ్రామం వద్ద గడిపిన సమయంలో నేను కొన్ని సాధారణ పాఠాలు నేర్చుకోగలిగాను. ఇందులో అతి ముఖ్యమైంది... నీటి ప్రవాహానికి సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు చేపట్టకూడదన్నది! పర్వత ప్రాంతాల్లోని నదులు, వంకలు, వాగులు ఒక్క చిన్న వానకే అకస్మాత్తుగా ఉరకలెత్తే అవకాశాలెక్కువ అన్నది గుర్తించాలి. రెండో పాఠం... పర్వత సానువులను కోయవద్దు. దీనివల్ల పైభాగంలోని చెరియలు విరిగిపడిపోయే అవకాశాలెక్కువ. దురదృష్టవశాత్తూ హైవేల నిర్మాణంలో, వెడల్పు పెంచే సందర్భంలో సానువుల కోత తరచూ జరుగుతోంది. మూడో అంశం... స్థానిక భవన నిర్మాణ శైలిని గౌరవించాలి. వీలైనంత వరకూ భవన నిర్మాణ వ్యవస్థలు స్థానికమైనవిగా ఉండేలా చూసుకోవాలి. నిర్మాణం విషయంలో స్థానికులకు ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. 

చివరగా... పర్వతాల్లో నిర్మాణాలు చేపడుతూంటే ప్రకృతిని గౌరవించడం అలవర్చుకోవాలి. అవసరమైనంత మాత్రమే కట్టుకోవడం... మిగిలినది ప్రకృతి ఛాయలోనే ఉంచడం మేలు. ప్రకృతి నుంచి మనకు కావాల్సింది తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాకూడదు; వీలైనంత వరకూ మొక్కలు, చెట్లు, అడవులు పెంచాలి. పర్వత ప్రాంతాలను దక్షిణ ఢిల్లీ, శిమ్లా నగరాల్లా మార్చవద్దు. 

నిజానికి ఇవేవీ కొత్త విషయాలు కావు. కానీ వీటిని పట్టించుకోకపోవడం మన అజ్ఞానం, అంతే. ప్రస్తుతం శూన్య కర్బన ఉద్గారాలు, సుస్థిరాభివృద్ధి, ప్లాటినమ్‌ రేటింగ్‌ అంటూ చాలా కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సరే కానీ, భవనాలపై కూడా దృష్టి పెట్టాల్సిన తరుణం వచ్చేసింది. పర్వతాల్లో, నదుల్లో, అడవుల్లో వాతావరణ మార్పుల మధ్యన ఉండేవి ఇవే. తరచూ వరదల బారిన పడుతున్నవి కూడా ఇవే. ఈ అంశాలపై కనీసం కొన్ని ఆర్కిటెక్చరల్‌ పాఠశాలల్లోనైనా చర్చ మొదలు కావాలి.

వ్యాసకర్త ఆర్కిటెక్ట్‌
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు