ఓటమి నేర్పిన పాఠాలు

28 Oct, 2022 00:30 IST|Sakshi
1962 చైనా యుద్ధానికి 60 ఏళ్లు

సందర్భం

భారత్‌–చైనా యుద్ధానికి 60 ఏళ్లు! నాయకత్వ వైఫల్యాలు, సన్నద్ధంగా లేని సైన్యం కారణంగా భారత్‌ అందులో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిక ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామనే చెప్పాలి. అయితే ఆ పాఠాలు చొరబాట్లను ఎదుర్కోడానికి మాత్రమే పనికొచ్చేవి. సరిహద్దు సమస్యల్ని పరిష్కారించుకోడానికైతే మిగిలి ఉన్న మార్గం ఒక్కటే. 1959–60 ప్రతిపాదనల ప్రకారం... ఇరుదేశాలు ‘ఇచ్చిపుచ్చుకునే’ ధోరణిలో ముందుకు వెళ్లడం! అక్సాయ్‌ చిన్‌ను చైనాకు వదిలేసి, అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ ఉంచుకోవడం. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం!

సరైన ఆయుధాలు, దుర్భేద్యమైన సైనిక దుస్తులు లేకుండా ఈశాన్య సరిహద్దు ప్రాంతం (నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజెన్సీ – ఎన్‌.ఇ.ఎఫ్‌.ఎ.)లో గస్తీ కాస్తున్న భారత దళాలు ఒక హఠాత్పరిణామంగా 1962 అక్టోబర్‌ రాత్రి 19–20 తేదీల మధ్య చైనా జరిపిన చొరబాటు దాడులతో అనేక ప్రాధాన్య స్థావరాలను కోల్పోయాయి. ఆశ్చర్యకరంగా, చైనా సైని కుల్ని వెనక్కి తరిమికొట్టే బాధ్యత... దానికి ఎంతమాత్రమూ తగని ‘గజరాజ్‌ కోర్‌’ సేనాని, నెహ్రూ మనిషిగా పరిగణన పొందిన లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ బి.ఎం.కౌల్‌పై పడింది! ఆ అయోమయంలో ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లిపోయారు.

ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో వ్యూహమంటూ లేని మన గందరగోళం గురించి ఢిల్లీలోని రాజకీయ దిగ్గజాలకు నివేదించడం ఆయన ఉద్దేశం. ఈశాన్య భారతదేశానికి, టిబెట్‌కు మధ్య ఉన్న మక్‌మహన్‌ సరిహద్దు రేఖ వెంబడే చైనా మూకల చొరబాట్లు కొనసాగుతూ ఉండటంతో ఢిల్లీ వెళ్లిన కౌల్‌ మళ్లీ తిరిగిరాలేదు. సైనిక దళాల మోహరింపు, యుద్ధ ప్రణాళికలకు వ్యూహరచన జరుగుతుండే ఢిల్లీలోనూ అయోమయం నెలకొంది. చైనా వెన్నుపోటు పొడిచిందని నెహ్రూ, ఆయన అనుచరులు ఆ తర్వాత వాదిస్తూ వచ్చారు కానీ, మావో నేతృత్వంలోని కమ్యూనిస్టు నాయకత్వం ఏం చేయనుందో 1950ల చివరి నుంచీ చాలినన్ని హెచ్చరికలు కనిపిస్తూనే ఉన్నాయి. 

చైనాను బుజ్జగించడానికి టిబెట్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడం మానేస్తామని భారత్‌ ఇచ్చిన హామీపై 1954లో ‘పంచశీల’ ఒప్పందానికి చైనా అంగీకారం తెలిపింది. అయినప్పటికీ అక్సాయ్‌ చిన్‌లోగానీ, తవాంగ్‌లో మక్‌మహన్‌ నియంత్రణ రేఖను మీరిన భాగాన్ని కూడా తనదేనన్న వాదననుగానీ చైనా వదులుకోలేదు. 1959లో లోంగ్జులో జరిగిన వాగ్వివాదాలను భారత్‌ తేలిగ్గా తీసుకుంది. లోంగ్జులో వందలాది భారత సైనిక దళాలు తమ భూభాగం లోకి ప్రవేశించాయంటూ చైనాలోని భారత రాయబార కార్యాలయా నికి చైనా నిరసన పత్రం పంపినప్పుడు భారత్‌ ఏమాత్రం దీటైన జవాబు ఇవ్వలేకపోయింది.

మావో, కృశ్చేవ్‌ల మధ్య కుదిరిన ఒప్పం దాన్ని అనుసరించి సోవియట్‌ వైమానిక, భూ ఉపరితల సేనల సహ కారంతో టిబెట్‌ భూభాగంపై చైనా తన సైనిక బలగాలను స్థిరంగా పెంచు కుంటూ పోయింది. ఆ పరిణామాన్ని కూడా భారత్‌ పట్టించు కోలేదు. 1959లో అమెరికా సాయంతో టిబెట్‌ నుంచి భారత్‌కు తప్పించుకున్న దలైలామా, ఆయన అనుచరులు భారత్‌లో ఆశ్రయం పొందడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. నిజానికి ముందుగా అనుకున్నది వారు అమెరికా వెళ్తారని. అన్నిటినీ మించి చైనా కోపానికి కారణమైన అంశం... అమెరికా కార్యకలాపాలకు భారత్‌ ఒక ప్రధాన కేంద్రం అవడం.

సీఐఏ శిక్షణ పొందిన సాయుధ టిబెటన్‌ తిరుగు బాటు దళాల్ని టిబెట్‌లోకి పంపించేందుకు భారత్‌ను అమెరికా ఒక ‘లాంచ్‌ ప్యాడ్‌’గా ఉపయోగించుకుంది. ఇక స్వదేశంలో ఒత్తిళ్లకు లోనైన నెహ్రూ భారత భూభాగాలలోంచి చైనీయులను విసిరి బయట పడేయమని భారత సైన్యాన్ని ఆదేశించారు. ఆ దూకుడులో ఆయన చైనా ప్రధాని చౌ ఎన్‌–లై 1960లో ఇండియా పర్యటించినప్పుడు చేసిన ప్రతిపాదనలను సైతం విస్మరించారు. అక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని చైనాకు ఉంచి, మక్‌మహన్‌ రేఖకు దక్షిణ వైపున ఉన్న ప్రాంతాన్ని భారత్‌ తీసుకోవడం ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే ఆ ప్రతిపాదన. 

నిజానికి 1962 భారత్‌–చైనా యుద్ధంలో మన సేనలు మెరుగైన ప్రతిఘటననే ఇచ్చాయి. సరిహద్దు వెంబడి ప్రాధాన్య స్థావరాలపై తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు వీరోచితంగా పోరాడాయి. మన సేనాపతులు తమ సైనికులపై ఎన్ని నెపాలు మోపినా గానీ, ఆ సైనికుల అసమాన శౌర్య పరాక్రమాలకు ఎన్నో నిదర్శనాలు కనిపి స్తాయి. అలాగైతే ఎందుకు ఓడిపోయాం? చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ థాపర్, జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ (ఈస్ట్రన్‌ కమాండ్‌) లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎల్‌.పి.సేన్‌ల నిస్పృహ కలిగించే పాత్రతో పాటుగా, నెహ్రూ నిర్ణయం కూడా మన పరాజయానికి కారణమైంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బి.ఎన్‌.మాలిక్‌ సలహాపై భారత వైమానిక దళాలను రంగంలోకి దింపేందుకు నెహ్రూ అనుమతించలేదు. అలా చేస్తే చైనాను మరింతగా రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ భావించారు! అదొక పెద్ద తప్పిదంగా చరిత్రలో నిలిచిపోయింది.

భారత్‌–చైనా యుద్ధం జరిగి 60 ఏళ్లయింది. ఇప్పుడిక అసలు ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏవైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామని చెప్పడమే న్యాయంగా ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలను చూపవచ్చు. ముఖ్యంగా, 1967లోనే చైనా నాథు లా పాస్, చో లా పాస్‌ మార్గాలు వెళ్లే హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కండలు తిప్పడం మొదలు పెట్టీ పెట్టగానే అక్కడి జననల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ సగత్‌ సింగ్‌ తన అధీనంలోని కంచె లోపలి భాగంలోకి ఎలాంటి విదేశీ చొరబాట్లను అనుమతించబోనని తన పై అధికారులకు ముందస్తు సమాచారం పంపించారు. అంటే తనిక ఎలాంటి ఆదేశాల కోసమూ ఎదురు చూడబోయేది లేదని. 

20 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిన చైనా 1986–87లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సోమ్‌డోరోంగ్‌ లోయలోకి చొరబడింది. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సుందర్జీ మెరుపు వేగంతో ప్రతిస్పందించి భారత సేనల్ని గగనతలం గుండా సోమ్‌డోరోంగ్‌పై దింపారు. మన సైన్యం చైనా సేనల్ని చుట్టుముట్టింది. ప్రత్యర్థి మూకలు మారు మాట్లాడకుండా వెన కడుగు వేశాయి. ఆ ఘటన ప్రధాని రాజీవ్‌ గాంధీ రక్తాన్ని ఉత్తేజంతో ఉరకలెత్తించింది.

అనంతర పరిణామంగా 1988లో జరిగిన రాజీవ్‌ చైనా పర్యటన, ఆ సందర్భంగా రెండు దేశాల మధ్య వరుసగా కుది రిన అనేక ఒప్పందాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇటీవల 2020లో గల్వాన్‌ లోయలో చైనా చొరబాట్లకు కూడా భారత్‌ మునుప టంత వేగంగానే స్పందించింది. చైనా మితిమీరి, పరిస్థితి ముదిరితే కనుక గల్వాన్‌లో మన సైనికులు దెబ్బకు దెబ్బ తీసిన విధంగానే వాణిజ్య పరమైన ఆంక్షలను విధించేందుకు కూడా భారత్‌ సిద్ధమైంది. గగనతలం నుంచి పోరుకు సైతం సన్నద్ధం అయింది. 

గతం నుంచి మనం ఇంకా నేర్చుకోవలసింది ఏమైనా ఉందీ అంటే అది చైనా ఉద్దేశాలను మరింతగా అర్థం చేసుకోగలగడం. అక్సాయ్‌ చిన్‌పై చైనా తన నియంత్రణను వదులుకునేలా చేయడానికి బీజింగ్‌తో భారత్‌ దౌత్యపరమైన సంభాషణలు జరపడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అక్సాయ్‌ చిన్‌ వ్యూహాత్మకంగా చైనాకు ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్య నదులు, యురేనియం నిక్షేపాలు ఉన్న ప్రాంతం అది. అక్కడి నుంచే జి 219 హైవే వెళుతుంది. చైనాలోని రెండు కీలక ప్రాంతాలైన షిన్‌జాంగ్, టిబెట్‌లను ఆ దారి కలుపుతుంది. మరైతే అక్సాయ్‌ చిన్‌ సమస్యకు పరిష్కారం ఏమిటి? ముందుకు వెళ్లే దారేది?

ఒక మార్గం అయితే ఉంది. 1959–60 ప్రతిపాదనల ప్రకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లడం. అప్పుడిక అక్సాయ్‌ చిన్‌ చైనాకు, అరుణాచల్‌ ప్రదేశ్‌ భౌగోళిక ప్రాంతాలు భారత్‌ భూభాగానికి వస్తాయి. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం. ప్రస్తుతం రెండు దేశాలకు శక్తిమంతమైన నాయకులే ఉన్నారు కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని, రాజకీ యంగా సరళమైన మనుగడ సాగించవచ్చు. అయితే వారు అలా చేయ డానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే ప్రశ్న.


మరూఫ్‌ రజా 
వ్యాసకర్త వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు 
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు