రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?

15 Nov, 2022 03:36 IST|Sakshi

రెండో మాట 

సొంతంగా ఎదిగేందుకే రాష్ట్రాలు ప్రయత్నించాలి గానీ కేంద్రం వైపు ఎదురుచూడరాదని ప్రకటించారు ప్రధాని. దానర్థం రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి ఇవ్వలేమని చెప్పడమా? ఆధునిక సవాళ్లకు గాంధీ భావాలే మంచి విరుగుడని భావించే కేంద్ర పాలకులు... ఆచరణలో మాత్రం స్వపరిపాలనను నినాదప్రాయంగా మార్చారు. ‘ఆత్మ నిర్భర భారత్‌’ సాకారం చేయలేదు. ఫెడరల్‌ వ్యవస్థలో రాజ్యాంగ నిర్దేశాలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ప్రజలను అప్రమత్తుల్ని చేయడానికి భారత లా కమిషన్‌ మాజీ అధ్యక్షుడైన ఎ.పి. షా ఇలా హెచ్చరించారు: ‘‘నిరంకుశంగా వ్యవహరించే పాలక వ్యవస్థలో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు దేశ రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత ఉంది.’’

‘చల్లకొచ్చి, ముంత దాచాడన్న’ తెలుగు వాళ్ల సామెత ఎంత నిజమో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తలపెట్టిన వ్యూహాత్మక రాజకీయ యాత్రలు నిరూపించాయి. ఇందులో కీలక మైన అంశం చాలాకాలంగా ‘చిలవలు–పలవలు’గా పెరుగుతూ వస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు... ‘జనసేన’ పేరు చాటున ఎలాంటి విధాన స్పష్టత లేని సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ల మధ్య సంబం ధాలు. రెండు చేతులతో ‘ఏటీఎం’ల నుంచి ఇష్ట మొచ్చినట్టుగా డబ్బు దోచుకుని లబ్ధి పొందాడని బాబును గతంలో విమర్శించారు మోదీ. అలాంటిది బాబును కూడా కలుపుకొని పోదామని గనక ఈ ‘సత్తరకాయ’ పవన్‌ అని ఉంటే, దానికి మోదీ అంగీకరిస్తారా? అయితే, ఏపీలో పాగా వేయాలన్న బీజేపీ వ్యూహానికి అనుగుణంగా మోదీ మనసులో ఏముంది? అది ఆయన మన ఊహలకే వదిలేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి పరోక్షంగానూ, ప్రత్య క్షంగానూ గతించిన పార్లమెంట్‌లో బీజేపీ నాయకత్వం కూడా సారథ్యం వహించింది. విభజించే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పించి దాని పురోభివృద్ధికి దోహదపడే చర్యలను మాత్రం  తీసుకోలేదు. ‘ప్రత్యేక హోదా’ ఊసే ఎత్తడం మానుకున్నారు. ఈ విషాదకర అనుభవం చంద్రబాబు కాంగ్రెస్‌–బీజేపీ నాయకత్వాలతో మిలాఖత్‌ కావడం వల్ల నూతన ఆంధ్రప్రదేశ్‌ అనుభవించాల్సి వచ్చింది. తిరిగి ఈ పరిస్థితుల మధ్యనే సరికొత్త విద్రోహానికి పవన్‌ ద్వారా బీజేపీ నాయకత్వం గజ్జె కట్టింది. స్థూలంగా, మోదీ–పవన్‌ల భేటీ ఫలితం ఇదే కాబోతోంది. అందుకనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఈ క్షణానికీ మోదీ ముందుకు రాలేదు. రాక పోగా, సరికొత్త ‘బండరాయి’ని మోదీ వదిలివెళ్లారు. ‘సొంతంగా ఎది గేందుకే రాష్ట్రాలు ప్రయత్నించాలి గానీ కేంద్రం వైపు ఎదురు చూడరాద’ని ప్రకటించారు. 

కేంద్ర పాలకుల ప్రవర్తన, వారు ఫెడరల్‌ వ్యవస్థలో రాజ్యాంగ నిర్దేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ఏనాడో పసిగట్టి ప్రజ లను అప్రమత్తుల్ని చేయడానికి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి, భారత లా కమిషన్‌ మాజీ అధ్యక్షుడైన ఎ.పి. షా ఇలా హెచ్చ రించారు: ‘నిరంకుశంగా వ్యవహరించే పాలక వ్యవస్థలో దేశ అత్యు న్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు బాధ్యతలతో కూడిన దేశ రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత ఉంది.’ (20 సెప్టెంబర్‌ 2022). ఇదే సందర్భంగా జస్టిస్‌ షా, 2014–2022 దాకా గడిచిన ఎని మిదేళ్లలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జస్టిస్‌ ఆర్‌.ఎం. లోధా నుంచి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దాకా ఎనిమిదిమంది సుప్రీం ప్రధాన న్యాయమూర్తులుగా ఉండి ఉన్నత న్యాయస్థానం పురోగతికి దోహదం చేశారని చెబుతూ... ఆనాటి బీజేపీ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్న మాటల్ని గుర్తు చేశారు: రిటైర్‌ అవుతున్న న్యాయ మూర్తులకే ఉద్యోగాలిస్తే కోర్టులను ప్రభావితం చేసి ప్రభుత్వాలకి తోడ్పడతారని జైట్లీ బాహాటంగా ప్రకటించారు.

న్యాయమూర్తులుగా పనిచేసినవారు రాష్ట్రాల గవర్నర్‌ పదవుల కోసం ‘అర్రులు’ చాచ డాన్ని జస్టిస్‌ షా నిరసిస్తూ వచ్చారని మరవరాదు. గవర్నర్‌గా నియ మితులైన ఓ న్యాయమూర్తి అనంతరం సుప్రీం ప్రధాన న్యాయ మూర్తిగా వచ్చిన జస్టిస్‌ ఆర్‌.ఎం. లోథా ధైర్యంగా, సాహసవంతమైన నిర్ణయాలు చేయగలిగారు. మళ్లీ మరో ప్రధాన న్యాయమూర్తి వివా దాల్లో నిలిచారు. దానికితోడు రహస్యంగా కవర్‌లో పెట్టి అందజేసే ‘సీల్డ్‌ కవర్‌’ ఆనవాయితీని ప్రవేశపెట్టారు. అయితే ఆ సంప్రదాయం మీద ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ అసహనం వ్యక్తం చేశారు. 

అందరిలోకీ న్యాయవ్యవస్థ మనుగడకు తలమానికంగా నిలిచిన న్యాయమూర్తి జస్టిస్‌ ఖన్నా. ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ‘అత్యవసర పరిస్థితుల’ పేరిట పౌరులపై రుద్దిన నిర్బంధ చట్టాన్ని ధిక్కరించి రాజకీయ ఖైదీల విడుదలను సుసాధ్యం చేసినవారు ఖన్నా. తనకు సిద్ధంగా ఉన్న ప్రధాన న్యాయమూర్తి పదవిని కూడా కాలదన్నిన గొప్ప న్యాయమూర్తి ఖన్నా. ఆయన త్యాగానికి అమెరికాలో అయినా బ్రహ్మరథం పట్టి హారతులు ఇచ్చారుగానీ, ఎమర్జెన్సీ కాలంలో ఆయన చూపిన త్యాగాన్ని మరచిపోయినవాళ్ళం మన భారతీయు లేనని మరచిపోరాదు. అలాగే జస్టిస్‌ రమణ సుప్రీం ప్రధాన న్యాయ మూర్తి హోదాలో సుప్రీంకోర్టు గౌరవాన్ని పునఃప్రతిష్ఠించారని కూడా లా కమిషన్‌ మాజీ అధ్యక్షుడు జస్టిస్‌ షా అభిభాషణ. 

అయితే ప్రధాని మోదీ హయాంలో నిర్ణయాలను గమనిస్తు న్నప్పుడు – రానున్న దశాబ్దాలలో పాలకుల నుంచి అనేక అంశాలలో సుప్రీంకోర్టు సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుందనీ, వీటిని ప్రతి ఘటించేందుకు దేశ సెక్యులర్‌ రాజ్యాంగమే శ్రీరామరక్ష అనీ జస్టిస్‌ ఎ.పి. షా నిశ్చితాభిప్రాయం. బహుశా జస్టిస్‌ షా మాదిరిగానే... జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ చలమేశ్వర్‌లు తమ తమ స్థాయుల్లో సుప్రీం కోర్టు నిర్వహణలో అనేక వివాదాస్పద సమస్యల మధ్య మంచి సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. వీరికి అనుగుణంగానే ఆధునిక సంస్కరణ భావాలు మూర్తీభవించిన జస్టిస్‌ చంద్రచూడ్‌... ‘‘న్యాయ పాలనలోకి మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు పెద్ద సంఖ్యలో ప్రవేశించవలసిన అవసరం ఉంది.

ఇందుకు గానూ మొత్తం న్యాయవ్యవస్థనే మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభావంతంగా మార్చవలసిన అవసరం ఉంది. చట్టాలు అణచి వేతలకు సాధనంగా కాక, న్యాయం అందించే సాధనంగా ఉండాలి. ఆ బాధ్యతను గుర్తించి పాలకులు నడుచుకోవలసిన అవసరం ఉంది’’ అని స్పష్టం చేశారు. ఇది పాలకులకు, న్యాయ వ్యవస్థకు గొప్ప పాఠంగా మనం భావించాలి. అంతేగాదు, ‘‘దీర్ఘ కాలంలో న్యాయ వ్యవస్థను సజీవ శక్తిగా నిలబెట్టేవి... దయా గుణం, సహా నుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి, చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా సమతుల్యం చేయగలిగిన నాడే – న్యాయమూర్తి తన బాధ్యతలను నిర్వహించినట్టు’’ అన్నది చంద్ర చూడ్‌ వేదన.

గుజరాత్‌ నుంచి వయా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆపైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల దాకా అధికారిక కుట్రలు, కుహకాలూ పాకిం చుతున్న కాషాయ నాయకులు... నేటి ‘సవాళ్లకు గాంధీ భావాలే మంచి విరుగుడ’ని భావిస్తున్నారు. కానీ స్వపరిపాలన మన ధ్యేయంగా, ఆచరణగా ఉండాలని చెప్పిన గాంధీజీ బోధనను నినాదప్రాయంగా మార్చారు. ‘ఆత్మ నిర్భర భారత్‌’ సాకారం కాలేదు. దేశీయ పరిశ్రమలను స్వదేశీ–విదేశీ గుత్త వర్గాలకు ధారాదత్తం చేశారు. వారు నిర్ణయించిన ధరలపై కోట్లాది ప్రజలను బతికేటట్టు చేసిన పాలనా విధానాలు దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి? డాలర్లపై ఆధారపడిన దేశీయ ఆర్థిక విధానం వల్ల రూపాయి విలువ అధఃపాతాళానికి వెళ్లిన సమయంలో – పాలకులు ‘ప్రజలను దోచు కునేవాళ్లను వదిలిపెట్టేది లేద’ని ప్రకటనలు చేస్తుంటే వినేవాళ్ల చెవుల్లో సీసం పోసినట్టుగా ఉంది. 

స్వయంపోషక ఆర్థికాభ్యున్నతిని సాధించగోరే ఫెడరల్‌ వ్యవస్థ లోని రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాల పర్యటన మధ్యనే ప్రధాని మోదీ బండ సత్యాన్ని ప్రకటించారు: ‘‘ఏ రాష్ట్రానికా రాష్ట్రం స్వయంగా ఎది గేందుకు ప్రయత్నించాలి.’’ అంటే పాలకుల అపరాధం ఫలితంగా అర్ధంతరంగా ఏర్పర్చిన ఆంధ్రప్రదేశ్‌ లాంటి అనాధ శరణాలయాలు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోరడం చెల్లదని మోదీ తన తాజా పర్య టనలో చెప్పినట్టా? ఇందుకు పవన్‌ కల్యాణ్‌ను పావుగా వినియోగిం చుకుని, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా ప్రతిపత్తిని కోరుతున్న వారి నోళ్లను నొక్కేయడమే బీజేపీ పాలకుల ధ్యేయమా?

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

మరిన్ని వార్తలు