Sakshi News home page

Kanker: అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే!

Published Fri, Dec 1 2023 7:44 AM

Women Workers Will Count Votes in Kanker Assembly - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా 81 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అత్యధిక ఓటింగ్‌కు కారణంగా నిలిచారు. మహిళల  ఉత్సాహాన్ని చూసిన ఎన్నికల అధికారులు  ఈసారి ఓట్ల లెక్కింపును కూడా మహిళలకే అప్పగిస్తున్నారు. 

కంకేర్ జిల్లాలో జరిగే ఈ ఓట్ల లెక్కింపులో సూపర్‌వైజర్‌ నుంచి సర్వెంట్‌ వరకు అన్ని విధులను మహిళలే నిర్వర్తించనున్నారని అధికారులు తెలిపారు. డిసెంబరు 3న జరిగే ఓట్ల లెక్కింపునకు మొత్తం 196 మంది మహిళలను విధుల్లోకి తీసుకున్నారు. 

జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3వ తేదీ ఉదయం ప్రారంభంకానుంది. ఈవీఎం లెక్కింపునకు 48 మంది మహిళా గెజిటెడ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 12 మంది.. మొత్తం 60 మంది మహిళా గెజిటెడ్ అధికారులను డ్యూటీ సూపర్‌వైజర్లుగా నియమించారు. 

కౌంటింగ్ అసిస్టెంట్లుగా 72 మంది మహిళా అసిస్టెంట్ టీచర్లు, క్లర్క్‌లను నియమించారు. దీంతో పాటు కౌంటింగ్ టేబుళ్ల వద్దకు ఈవీఎం యంత్రాలను తరలించేందుకు 62 మంది మహిళా సేవకులను విధుల్లోకి తీసుకున్నారు. ఫలితాలను ప్రకటించేందుకు ఇద్దరు మహిళా అధికారులకు అనౌన్సర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఈ విధంగా మొత్తం 196 మంది మహిళా ఉద్యోగులు ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు.

కాంకేర్ కలెక్టర్ ప్రియాంక శుక్లా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు పలు ప్రయోగాలు చేశామన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రెయిన్ బో పోలింగ్ బూత్ నిర్మించామని, ఇక్కడ మోహరించిన భద్రతా బలగాలు కూడా థర్డ్ జెండర్ వారేనని తెలిపారు.
ఇది కూడా చదవండి: ట్రైన్‌ ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్‌!

Advertisement

What’s your opinion

Advertisement