భారత–చైనా బంధంలో కొత్త మలుపు

12 Jul, 2021 00:37 IST|Sakshi

గత ఏడు దశాబ్దాలుగా ‘గొప్ప ముందడుగు’ ‘సాంస్కృతిక విప్లవం’, ‘వినియోగదారీ సంస్కృతి’ అనే దశలగుండా ప్రయాణిస్తూ వచ్చిన చైనా నేడు అత్యంత బలసంపన్నమైన జాతిగా ఆవిర్భవించింది. కానీ దాని అభివృద్ధి వెనుక చీకటి కోణం కూడా ఉంది. స్వేచ్ఛాయుతమైన ఉదారవాద విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేవి ఇవాళ చైనాలో ప్రశ్నార్థకం అవుతున్నాయి. పైగా చైనా విస్తరణ కాంక్షలు పెరుగుతూ ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సైనికంగా, వ్యూహపరంగా లద్ధాఖ్‌ సరిహద్దులో ఆ దేశాన్ని భారత్‌ తిప్పికొట్టింది. సరిహద్దుల్లో మనం సాధించిన సైనిక విజయాన్ని నిలబెట్టుకోవాలి. నేటి భారత్‌ 1960లు 1970ల నాటి భారత్‌గా లేదు. ఈరోజు మనం చైనాకే గుణపాఠం చెప్పగల స్థాయిలో ఉన్నాం. ఇది సరైన అవకాశం... ఇదే సరైన సమయం... నిస్సందేహంగా ఇది భారత యుగం.

సంస్కృతీపరంగా నిరంతరం మార్పు చెందుతూ వస్తున్న ప్రపంచంలోని అతి కొద్ది దేశాల్లో చైనా ఒకటి. అయితే అదే సమయంలో విస్తరణవాద జాతీయవాదాన్ని అది తన పునాదిగా ఉంచుకుంటూ వస్తోంది. గత కొంతకాలంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థికవ్యవస్థల్లో చైనా ఒకటి. దశాబ్దాలుగా, శాస్త్రీయ సోషలిజం, ప్రణాళికాబద్ధమైన ఆర్థికవ్యవస్థ, చైనా కమ్యూనిస్టు పార్టీ ఆచరించే కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేవి ఆ దేశంలో ’ప్రగతి’ని ఒక ప్రోడక్ట్‌గా సృష్టిస్తూ వస్తున్నాయి. ‘గొప్ప ముందడుగు’ (గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌) నుంచి ‘సాంస్కృతిక విప్లవం’ (కల్చరల్‌ రెవల్యూషన్‌) వరకు, అక్కడినుంచి ‘వినియోగదారీ సంస్కృతి’ ఘన విజయం వరకు ప్రయాణిస్తూ వచ్చిన చైనా ఈరోజు అత్యంత స్వీయ కేంద్రకమైన, ఆర్థిక బలసంపన్నమైన, భుజబలాన్ని ప్రదర్శిస్తున్న జాతిగా ఆవిర్భవించింది. కానీ చైనా సాధించిన ఈ అభివృద్ధి వెనుక చీకటి కోణం కూడా ఉంది. స్వేచ్ఛాయుతమైన ఉదారవాద విలువలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేవి ఇవాళ చైనాలో ప్రశ్నార్థకం అవుతున్నాయి. పరస్పర అనుసంధానం శిఖరస్థాయికి చేరుకున్న మన ప్రపంచంలో చైనా నమూనా ఎంతకాలం కొనసాగుతుంది అనేది రాబోయే కొన్ని దశాబ్దాల పాటు తెమలని గూఢప్రశ్నగా ఉంటుంది. 
సోవియట్‌ పాత్ర

చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్‌ స్థాపన జరిగిన వెంటనే అంటే 1949లోనే మావో జెడాంగ్‌ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా మాస్కో వెళ్లి జోసెఫ్‌ స్టాలిన్‌ని కలిశారు. స్నేహం, పొత్తు, పరస్పర సహకారం ప్రాతిపదికన సోవియెట్‌ యూనియన్‌తో కుదిరిన ఒడంబడిక చైనా ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. పైగా రష్యా ఒకప్పుడు ఆక్రమించుకున్న ప్రాంతాలు... ప్రత్యేకించి మంచూరియా, జింజియాంగ్‌లు తిరిగి చైనాలో భాగం కావడానికి ఈ ఒప్పందం వీలు కలిగించింది. టిబెట్‌ని చైనా తనలో కలుపుకున్న ప్పటికీ భారతదేశం మౌనం వహించడంలో ఇండో–సోవియెట్‌ సంబంధాలు ఒక ఉపకరణంగా పనిచేశాయి. పండిట్‌ నెహ్రూ నేతృత్వంలో అలీనోద్యమ నేతగా కొనసాగాలనే మన సొంత ఆకాంక్ష కారణంగానే కావచ్చు.. 1960లలో చైనా విస్తరణ కాంక్షలు శక్తిమంతంగా వ్యక్తమవడం ప్రారంభమైనప్పటికీ ఆశ్చర్యం గొలిపించే ప్రశాంతత మనల్ని ఆవరించింది. కానీ ఆనాటి మన వైఖరి మనకు దారుణ ఫలితాలను అందించిందని ఈరోజు మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం అంతర్జాతీయ అహింసావాణిగా కొనసాగలేకపోయాం, అలాగే మన సరిహద్దులను కూడా కాపాడుకోలేకపోయాం.

(అ)సాంస్కృతిక విప్లవం 
వంద పూలు పుష్పించనీ, వేయి భావాలు వికసించనీ అనే భావనను గొప్పగా ప్రచారంలోకి తీసుకువచ్చిన మావో జెడాంగ్‌ తనకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి అసమ్మతినీ అణిచిపారేయడం ఆశ్చర్యం గొలుపుతుంది. 1958–61 సంవత్సరాల్లో దుర్బిక్షం కారణంగా లక్షలాదిమంది చైనా ప్రజలు మరణించారు. మరోవైపున కమ్యూన్‌లు అని పిలిచే ఉత్పత్తి సమాజాలు ఘోరంగా విఫలమయ్యాయి కానీ తీవ్రమైన అణచివేత కొనసాగింది. రాజకీయ లక్ష్యాల పరిపూర్తికోసం చౌ ఎన్‌ లై, డెంగ్‌ జియావోపింగ్‌ దేశ ఆర్థిక విధానాలను పునర్నిర్వచించడానికి తగు పునాది వేశారు. 

ప్రపంచీకరణ వెలుగులో చైనా వినియోగదారీ తత్వం
1977లో చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్‌ పగ్గాలను డెంగ్‌ జియావోపింగ్‌ చేపట్టారు. చైనాను ప్రపంచ కార్ఖానాగా మార్చాలనే విస్తృత కార్యక్రమాన్ని చేపట్టారు. మావో నాలుగు చెడుల (పాత ఆలోచనలు, సంస్కృతి, ఆచారాలు, అలవాట్లు) నిర్మూలనకు ప్రాధాన్యమిస్తే, డెంగ్‌ నాలుగు అంశాలను (వ్యవసాయం, పరిశ్రమ, రక్షణ, టెక్నాలజీ ఆధునీకరణ) ప్రోత్సహించారు. 1980ల నుంచి వృద్ధిబాటలో నడిచిన చైనా ఆర్థిక వ్యవస్థ త్వరలోనే రెండంకెలను దాటేసింది. చైనాలో రాజకీయ అణచివేత గురించి ప్రపంచం మాట్లాడుతున్నప్పటికీ, ఏ దేశమూ చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోలేదు. ఏ బహుళజాతి సంస్థ కూడా చైనానుంచి వెళ్లిపోలేదు. చైనాతో వ్యాపారం సజావుగా కొనసాగుతూ వచ్చింది. ఎగుమతులు లక్ష్యంగా ఉత్పత్తి చేసే విదేశీ భాగస్వామ్య సంస్థలకు చైనా అనేక రాయితీలు కల్పించి ప్రాధాన్యత నిచ్చింది. దీంతో స్థూలదేశీయోత్పత్తి సంవత్సరానికి 8 శాతం చొప్పున పెరిగి, త్వరలోనే రెండంకెలను దాటేసింది. 1997–98 సంవత్సరంలో చైనా, అమెరికా అధ్యక్షులు జియాంగ్‌ జెమిన్, బిల్‌ క్లింటన్‌ ఇరుదేశాల్లో పర్యటించారు. మూడేళ్ల తర్వాత చైనా ప్రపంచ వాణిజ్యసంస్థలో చేరింది. చౌక శ్రమ, ఎగుమతుల్లో పోటీపడటం అనే రెండు బలాల ప్రాతిపదికన చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రధానంగా ఆఫ్రికా, మధ్య ఆసియా నుంచి ఇంధనం, ముడి సరకులకు వనరుల సాధనలో చైనా గొప్ప విజయం సాధించింది.

భారత్‌ బలాలు, ముందంజ
బ్రిటిష్‌ వారిని 13వ దలైలామా ఇష్టపడకపోవడంతో తమ మాతృభూమి టిబెట్‌ను చైనాకు అప్పగించాల్సి వచ్చింది. అలాగే భారత్‌ను పాకిస్తాన్‌ ఇష్టపడకపోవడంతో తమ మాతృభూమిని నేడు చైనా హస్తగతం చేయాల్సి వస్తోంది. మన పొరుగుదేశంలో చైనా ఉనికి పెరుగుతోంది. చైనా రుణ ఊబిలో చిక్కుకున్న ఆఫ్రికా దేశాలు తమ వనరులను చైనాకు అప్పగించడమనేది భారత్‌ను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, దాని మానవీయ విలువలు చైనా ఆధిపత్య, విస్తరణవాద నమూనాకు వ్యతిరేకంగా నిలిచి తీరాలి. అలాగే చైనా సరిహద్దులో వ్యూహాత్మకంగా మనం సాధించిన సైనిక విజయాన్ని నిలబెట్టుకోవాలి. 

చైనా కారిడార్‌ అంటున్న బృహత్‌ ప్రాజెక్టుకు లద్ధాఖ్‌ సెక్టార్‌లో భారత సైన్యం ప్రమాదకరంగా మారింది కాబట్టే గల్వాన్‌లో సంఘర్షణ చోటుచేసుకుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌ సరిహద్దులో భారతీయ రోడ్‌ నెట్‌వర్క్‌లు చైనా సరిహద్దు నిర్మాణాలకు ప్రమాదకరంగా మారాయి. అందుకే నేపాల్‌ను రెచ్చగొట్టి భారత్‌ లోని కాలాపానీ సెక్టార్‌ తమ భూభూగమంటూ కృత్రిమంగా ఘర్షణలు సృష్టించడానికి చైనా ప్రయత్నించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌కి చైనా రాజధాని బీజింగ్‌ 2,350 కిలోమీటర్ల వ్యూహాత్మక దూరంలో ఉంది కాబట్టే బారత్‌ ఎదురుదాడికి బీజింగ్‌ నిర్ణయాత్మక దూరంలో ఉన్నట్లే. అందుకే చైనా చీటికీ మాటికీ అరుణాచల్‌ప్రదేశ్‌ సమగ్రత గురించి గగ్గోలు పెడుతుంటుంది. దాంట్లో భాగంగానే సముద్రజలాలపై భారత్‌ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు భారత్‌ శక్తివంతంగా ఉంది. చైనాకు ఆ విషయం తెలుసు. కాబట్టే మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చైనాపై మరింత ఒత్తిడికి గురిచేయాల్సి ఉంది.

భారతీయ వ్యవసాయాన్ని, టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా పునర్నవీకరించడం తక్షణ అవసరం. 2031 నాటికి ముడిపదార్థాల తయారీ కేంద్రంగా భారత్‌ వృద్ధి చెంది మైక్రో–చిప్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో చైనాను అధిగమించాల్సి ఉంది. వ్యవసాయాన్ని సంస్కరించడం నుంచి మేక్‌ ఇన్‌ ఇండియా దాకా; ఆత్మనిర్భర్‌ భారత్‌ నుంచి ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ట్‌ భారత్‌’ దాకా లక్ష్య సాధనలో ప్రధాని నరేంద్రమోదీ మనల్ని సరైన దారిలో నడిపిస్తున్నారు. ఈ గొప్ప దేశానికి చెందిన ప్రజలమైన మనం, రోజువారీ కార్యాచరణలో జాతీయవాద స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మన వంతు దోహదం అందించాలి. నేటి భారత్‌ 1960లు 1970ల నాటి భారత్‌గా లేదు. ఈరోజు మనం చైనాకే గుణపాఠం చెప్పగల స్థాయిలో ఉన్నాం. ఇదే సరైన అవకాశం... నిస్సందేహంగా ఇది భారత యుగం.

బండారు దత్తాత్రేయ 
(వ్యాసకర్త తాజాగా హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు)

మరిన్ని వార్తలు