తెలంగాణ నిజానిజాలు గమనిస్తోంది!

18 Sep, 2022 00:50 IST|Sakshi

ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ తెగదెంపుల సంగ్రామంలో తెగించి స్థిర పడిన తెలంగాణ తనను తాను చూసుకుంటోంది. రేపటి భవిష్యత్తుపై గంపెడు ఆశలతో కలలు కంటోంది. మార్పును ప్రతినిత్యం కోరుకునే తెలంగాణ ఊహించని మార్పులతో ఊహకందనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. విషాదాల కొలిమి, విప్లవాల పొలి కేకలు, ఫెళఫెళ కూలిపడ్డ ఆధిపత్య అహంకారాలు... పాఠ్యాంశాలుగా మారిన తెలంగాణ ఇప్పుడు నిజానిజాల నిగ్గు తేల్చు కుంటోంది. ఎవరిది విద్రోహమో, ఏది విలీనమో, ఏది బల ప్రయోగమో, గాయాలు ఎక్కడ తగిలాయో, గేయాలై ఎక్కడ పలికాయో, సున్నితపు ఐకమత్యపు తెలంగాణ తీగలను ఎవరు తెంచ చూశారో... మళ్లీ అన్నింటినీ కలిపి జాతీయ ఐకమత్య మహానదిగా మన తెలంగాణను ఎవరు మారుస్తున్నారో... అంతా తెలంగాణ బిడ్డలకు తెలుసు. దయచేసి మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాత గాయాల కట్లు విప్పి కారం చల్లే పనులు ఎవరూ చేయకండి. తరతరాల సామాజిక తాత్విక సహజత్వ జీవ జలపాతం తెలంగాణతనం. అబ్బురపరిచిన ఆశ్చర్యాల నుంచీ, నిప్పుల వర్షాల నుంచీ... సకల జనుల ప్రశాంత వెండి వెన్నెల సిరుల పందిరిగా మారిన తెలంగాణను సంరక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. 

మానవీయ సంస్కృతికి పట్టుగొమ్మయిన తెలంగాణ అత్యున్నత మానవ సమాజ నిర్మాణం వైపు పయనించమంటోంది. ఈ కుళ్ళు కులసంకెళ్లను తెంచమంటోంది. కమ్ముకొస్తున్న మత మబ్బుల్ని చెదరగొట్టమంటోంది. ఒకనాడు భూమి, భుక్తి, విముక్తి అంటూ నినదించి ముందుకు సాగిన తెలంగాణ ఇప్పుడు ప్రతి మనిషినీ సంపదగా మార్చి ప్రపంచానికి ఒక నూతన సందేశం ఇవ్వమంటోంది. అన్నార్తులు, అనాథలు కానరాని సమాజ నిర్మాణం చేయమంటోంది. గంగా జమున తెహజీబ్‌ సంస్కృతిని విత్తనాలుగా చల్లి మహోన్నత మానవీయ పాఠంగా దేశాన్నే తీర్చిదిద్దుకుందాం అంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవ మహాసందేశంగా జాతిగీతమై మోగ మంటుంది. తరతరాల వారసత్వ చరిత్రకు ఎవరు పేటెంట్‌ దారులు కాదని తెలంగాణ పదేపదే చెబుతోంది. 

ప్రపంచానికి పిడికెడు అన్నం పెడుతున్న రైతు భారతానికి పట్టాభిషేకం చేయమంటోంది తెలంగాణ. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి, పండించిన పంటలకు రైతు కూలీలనే అత్యా ధునిక వ్యవసాయ పరిశ్రమల యజమానులను చేయమంటోంది. సాటి మనుషుల్ని కుల మతాల పేరుతో వెంటాడుతున్న ఆటవిక సంస్కృతిని దరిదాపుల్లోకి రానీయకుండా మానవీయ మహా కోటను నిర్మించుకుంది తెలంగాణ. ఆధిపత్య కుల అహంకార పదఘట్టనల కింద పశువుగా ప్రవర్తించే దుర్మార్గ సంస్కృతిని దరిదాపులకు రాకుండా సరిహద్దు సైనికునిగా పహారా కాస్తోంది తెలంగాణ. 

ఆదివాసీ గిరిజన వికాసంలో భాగంగా ‘మా గూడెంలో మా రాజ్యం’, ‘మా తండాలో మా రాజ్యం’ అన్న కలలను నిజం చేస్తోంది తెలంగాణ. పేదలైన ముస్లింలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.  మైనారిటీ పిల్లలకు ఒక్క తెలంగాణ లోనే 1160 గురుకులాలను పెట్టి కార్పొరేట్‌ స్థాయి చదువు అందిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వేలాది గురుకులాలు రావాలని తలుస్తోంది తెలంగాణ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరును నూతన సచివాలయానికి పెట్టి ఎద ఎదలో రాజ్యాంగ రక్షణ స్ఫూర్తిని చాటింది. దేశ పార్ల మెంటుకు అంబేడ్కర్‌ పేరు పెట్టమని నినదిస్తున్న ఆచరణవాది తెలంగాణ. సస్యశ్యామల దేశంలో క్షామాలు, నిరుద్యోగ రక్కసులు, రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని నడుంబిగించింది తెలంగాణ. నెర్రెలు బాసిన కరువు భూముల్లోకి గంగమ్మను రప్పించేందుకు కాళేశ్వరాన్ని కట్టుకొని జలకళతో నిండింది తెలంగాణ. ఇంటింటికీ ‘మిషన్‌ భగీరథ’నిచ్చి గొంతు తడిపిన తెలంగాణ... దేశానికి ఆ పథకాన్ని ఎందుకు అందించలేమని పయనమవుతోంది. 

దేశంలో జరగాల్సింది జాతీయ సమైక్యతా ఉత్సవాలు కానీ విద్వేష ఉత్సవాలు కాదని గొంతెత్తి పిలుస్తోంది తెలంగాణ. పగలు సెగలులేని, పరమత ద్వేషాలు లేని దేశమే సకల సంపదలతో తులతూగుతుందని ఆచరణాత్మకంగా తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దళితుల ఆత్మగౌరవ జెండాగా నిలిచిన ‘దళిత బంధు’ పథకాన్ని పెట్టి వాళ్లను ఉత్పత్తి శక్తులుగా తీర్చి దిద్దుతున్న తెలంగాణ దేశంలో దళితులంతా ఇట్లనే వర్ధిల్లాలని తలంచుతోంది. బహుజనులకు ఆత్మగౌరవ భవనాలనిచ్చి ఆయా కులాల సామాజిక ఎదుగుదలకు ఇంతగా కృషిచేసిన రాష్ట్రం దేశంలో మరోటి లేదంటోంది తెలంగాణ. ఇప్పుడు అన్ని రంగా లలో పురోభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణను చూస్తున్నాం. వర్ధిల్లు వీర తెలంగాణ ! వర్ధిల్లు సామరస్య తెలంగాణ!

జూలూరీ గౌరిశంకర్‌ (ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి)

మరిన్ని వార్తలు