వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఢీకొట్టే ధైర్యం లేదా?

10 May, 2022 12:08 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సందర్భం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఈ నెలాఖరుకు మూడేళ్లు నిండుతాయి. గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెల్చుకుని చరిత్ర సృష్టించడంతో పాటు ఆ తరువాత జరి గిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలోనూ అఖండ విజయాలు సాధించి... ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, అసెంబ్లీలో చోటు దక్కించుకోని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల వెన్నులో వణుకు పుట్టించింది. చివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాకాలోని తెలుగుదేశం కంచు కోట కుప్పం మునిసిపాలిటీని సైతం కొల్లగొట్టి ఆ పార్టీ అభిమా నులనూ, నాయకులనూ నిశ్చేష్టులను చేసింది.

పాలనాపరంగా చూస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రెండేళ్లు కరోనా కష్టాలతోనే గడిచిపోయింది. కరోనా క్లిష్టపరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు ప్రశంసాపాత్రమైంది. వాలంటీర్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించుకుని లబ్ధిదారులకు అన్ని రకాల సంక్షేమ పథకాలనూ అందించగలిగింది. ఈ విషయంలో జగన్‌ సర్కార్‌ ప్రజల జేజేలు అందుకుంది అనడంలో సందేహం లేదు. అయితే దేశమంతటా అలుముకున్న బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్‌ కూడా తాత్కాలిక కరెంట్‌ కష్టాలను ఎదుర్కోక తప్పలేదు. 

ప్రతిపక్షాల విషయానికి వస్తే గత ఆరు నెలలుగా చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఎక్కడ మరణవార్త దొరికితే అక్కడికి పరిగెత్తి శవ రాజకీయాలు చెయ్యడంలో దిట్ట అనిపించుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ మహిళల మీద జరిగిన దాడులను తన మీడియా ద్వారా గోరంతలు కొండంతలు చేయిస్తూ ప్రభుతం పట్ల ప్రజల్లో ద్వేషాన్ని నింపాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి దుస్సంఘటనలు సంభవించినపుడు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పచ్చ మీడియా వాటిని కప్పిపుచ్చి ప్రభుత్వం మీద విషం చిమ్మడానికే ప్రాధాన్యం ఇస్తోంది. వాటి దుర్మార్గం ఎంతవరకూ వెళ్లిందంటే ఎంతో సహనంతో మాట్లాడే జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ‘దుష్టచతు ష్టయం’ అనే పదప్రయోగం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. సమతూకంగా వార్తలు అందించాల్సిన మీడియా ప్రతిపక్షాల కన్నా రెచ్చిపోవడం, ప్రభుత్వం మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చెయ్యడం చూస్తుంటే వైసీపీ బలం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
 
వైసీపీకి పదిహేను స్థానాలు కూడా రావు... జగన్‌మోహన్‌రెడ్డికి ఇదే చివరి అవకాశం.. అంటూ ఊదరగొడుతున్న విపక్షాలు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం, పొత్తులు పెట్టుకుందాం అని పిలుపులు ఇచ్చు కోవడం ఏమిటో అర్థం కాదు. నిజంగా వైసీపీ మీద అంతటి వ్యతిరేకతే ఉంటే ప్రజలే ఓడిస్తారు కదా! చంద్రబాబైతే మరీ ఆత్ర పడుతూ త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపు ఇస్తున్నారు! ఎవరు త్యాగాలు చెయ్యాలి? ఎవరి కోసం త్యాగం చెయ్యాలి? ‘మీరందరూ త్యాగం చెయ్యండి, నాయకత్వ బాధ్యతను నాకు వదిలేయండి’ అని బహి రంగంగానే పిలుపునిస్తున్నారు. (చదవండి: రామోజీ స్కూల్‌ నుంచి లాజిక్‌ లేని పాఠాలు)

అంటే తనను ముఖ్యమంత్రిని చెయ్యడమే త్యాగాల పరమార్థం అన్నమాట. మరి అందుకు బీజేపీ, జనసేన సిద్ధం అవుతాయా? ముఖ్యమంత్రి కావాలనే జనసైనికుల ఆకాంక్షను జనసేనాధిపతి చంద్రబాబు కోసం త్యాగం చేస్తారా? మొన్నటిదాకా మోదీని తీవ్రాతి తీవ్రంగా దుమ్మెత్తి పోసిన చంద్రబాబు కోసం రాష్ట్ర బీజేపీ ఏ మేరకు త్యాగాలు చేస్తుంది? సామాన్యుడికి అర్థం కాని విషయం ఏమిటంటే, వైసీపీ పట్ల విపక్షాలు ఊహిస్తున్నంత వ్యతిరేకత జనంలో ఉంటే ఇంత మంది కట్టగట్టుకుని త్యాగాలు చెయ్యాలా? వైఎస్‌ జగన్‌ మీద అంత వ్యతిరేకత ఉంటే ఏ ఒక్క పార్టీకైనా ఒంటరిగా వెళ్లి జగన్‌ను ఢీకొట్టే ధైర్యం లేదా? ఏమిటో అంతా గమ్మత్తు!

- ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు

మరిన్ని వార్తలు