ఉపాధి, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

29 Jan, 2021 03:30 IST|Sakshi

‘‘వ్యాపారి లాభార్జనపై ఆధార పడి బతుకుతాడనేది అందరికీ తెలిసిందే. అంటువ్యాధుల సమయంలో శవాలను దహనం, ఖననం చేసే వాడు ఆ సమయంలోనే డబ్బు సంపాదించాలని చూస్తాడు. వ్యాపారి కూడా అంటువ్యాధులతో సహా ఏ సందర్భమైనా ధనార్జనే ధ్యేయంగా జీవించడానికి వెనుకా డడు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంటుంది. శవాలను పూడ్చే వ్యక్తి అంటువ్యాధులను సృష్టించడు. కానీ, వ్యాపారి అంటువ్యాధులను సృష్టించగలడు’’ అంటూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1945లో ‘కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ అంటరాని వారికి ఏం చేశారు’’అన్న గ్రంథంలో రాసిన వాక్యాలివి.

ఈనెల 20వ తేదీన దావోస్‌లో జరిగిన ‘వరల్డ్‌ ఎక నామిక్‌ ఫోరం’ సదస్సు విడుదల చేసిన ‘ది ఇన్‌ఈక్వాలిటీ వైరస్‌’ నివేదిక, కరోనా విలయతాండవం చేసిన సమయంలో సంపన్నులు మరింత సంపన్నులయ్యారనే విష యాన్ని బయటపెట్టి, అంబేడ్కర్‌ వ్యాఖ్యలను అక్షర సత్యాలను చేసింది. కరోనా లాంటి వైరస్‌ సృష్టికి, వ్యాప్తికి వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కారణమనే చర్చ కూడా జరుగుతోంది. కరోనాయే కాదు, ఇంకా అనేక ఆరోగ్య, వాతావరణ సమస్యలకు ఈ వర్గాలు కారణం. వ్యాపారస్తుల లాభాపేక్ష వల్ల రసాయనాల వాడకం పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కల్తీ కారణంగా వ్యాధులు రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం, రోగాల ఉపశమనానికి మందుల కోసం పరుగులు తీయడం... మళ్లీ ఆ మందులు తయారు చేసేదీ వారే. 

కరోనాతో యావత్‌ ప్రపంచం విలవిల్లాడుతోన్న కష్ట కాలంలో భారతదేశంలోని వందమంది కోటీశ్వరులు మరిన్ని కోట్లకు పడగలెత్తారని ఆక్స్‌ఫామ్‌ సంస్థ తాజా నివే దికలో తేల్చిచెప్పింది. భారతదేశంలోని సంపన్నులు కరోనా సమయంలో తమ సంపదను 35 శాతం పెంచుకున్నారు. 84 శాతం కుటుంబాలు ఉపాధిని, ఆదాయాలను కోల్పో యాయి. ప్రతి గంటకు లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. దాదాపు 13 కోట్ల మంది కార్మికులు ఉద్యో గాలు కోల్పోయారు. హోటళ్ళు, పర్యాటక రంగం, రిటైల్‌ దుకాణాలు, వినోద సంబంధితమైన వ్యాపారాలు, చిన్న చిన్న హాస్పిటల్స్, ఫిట్‌నెస్‌ సెంటర్లు, చిన్న, మధ్య తరహా ప్రైవేట్‌ పాఠశాలలు, రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి ఎక్కు వగా ఉపాధిని కోల్పోయారు. అయితే కొన్ని వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే కార్యకలాపాలు మిగిలాయి. అందులో కార్పొరేట్‌ సర్వీసులు, లీగల్‌ సర్వీసులు, పబ్లిక్‌ సేఫ్టీ, ఐటీ సర్వీసులు ప్రముఖంగా ఉన్నాయి. 

ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళలో మహిళల శాతం అధికంగా ఉన్నది. మెకంజా గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన సర్వే, పురుషులకన్నా దాదాపు రెండు రెట్లు అధికంగా మహిళలు ఉద్యోగాలు కోల్పోయినట్లు తేల్చింది. చిన్న, మధ్య తరగతి మహిళా వ్యాపారవేత్తల ఆదాయాలు కూడా గణనీయంగా తగ్గాయి.  ఇప్పటి వరకు ఒకకోటీ 6 లక్షల 70 వేల మంది కరోనా దాడికి గురయ్యారు. ఒక లక్షా 53 వేల మంది మరణించారు. ఇవి ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు నిర్దిష్టమైన వివరాలను సేకరించలేదు. చాలా మంది కరోనా వల్ల చనిపోయినప్పటికీ ప్రభుత్వాలు వాటిని ఇతర వ్యాధుల కింద చూపెడుతున్నాయి. ఒక కోటి మందికి పైగా కరోనా బారిన పడినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఎక్కువ మంది ప్రభుత్వ వైద్యం కాకుండా ప్రైవేట్‌ గానే చికిత్స చేయించుకున్నారు. సరాసరిగా ఒక లక్ష రూపా యలు ఖర్చు పెట్టినా లక్ష కోట్ల రూపాయలు కరోనావల్ల నష్టపోయారు. 

ఈ పరిస్థితుల్లో మనం ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నాం. భారత ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ అతలాకుతలం చేసిన కోవిడ్‌ మహమ్మారి నేర్పిన అనుభవాల నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఏ అంశాలు ప్రాధాన్యంగా ఉండాలి? విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాదాపు 20 కోట్లకు పైగా ఉన్న వలస కార్మికులకు తిరిగి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారనేది ప్రశ్న. దీనికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉండాలి. సంపన్నులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య వర్గాలను ఇటు వైపుగా ఆలోచింపజేయాలి. దావోస్‌లో విడుదల చేసిన నివే దికలో ఆక్స్‌ఫామ్‌ చేసిన ముఖ్యమైన సూచన ఇక్కడ ప్రస్తావించాలి. వేల కోట్ల, లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న కోటీశ్వరులపైన ప్రత్యేకంగా కరోనా పన్నును విధించి, దానితో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాలి. మరొక ముఖ్యమైన అంశం వైద్య, ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు. ముఖ్యంగా వైద్యరంగంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నది. ఇప్పటికీ దేశంలో వైద్యం మీద అవుతున్న ఖర్చులో 75 శాతం ఖర్చుని ప్రజలే భరిస్తున్నారు. 

2015–16లో కేంద్ర ప్రభుత్వం 17,90,783 కోట్లు ఖర్చు చేస్తే, అందులో వైద్యరంగానికి వెచ్చించింది 34,131 కోట్లు. ఇది బడ్జెట్‌ ఖర్చులో 1.91 శాతం మాత్రమే. నూటికి నూరు శాతం మందికీ అత్యవసరమైన, ప్రాణప్రదమైన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాల శ్రద్ధకు ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో. 2020–21 బడ్జెట్‌లో వైద్యరంగం వాటా 2.22 శాతం మాత్రమే. అదే రక్షణ రంగానికి చూస్తే, 2015–16లో 2 లక్షల 25 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో అది 12.61 శాతం. 2020–21 వరకు అయిదేళ్లలో ఒక కోటీ 39 లక్షల 63 వేల 845 కోట్ల రూపాయలను రక్షణ కోసం ఖర్చు చేస్తే, ప్రజల ఆరోగ్యానికి 3 లక్షల 11 వేల 921 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు. దీనిని బట్టి ప్రభుత్వాల ప్రాధాన్యతేమిటో మనకు అర్థం అవుతుంది.

ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, కరోనా లాంటి సమస్యలు మళ్ళీ ఎదురైతే ఈసారి ప్రజలను రక్షించడం ఎవరి వల్లా కాదు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే ఎక్కువగా ఖర్చును భరించారు. కాబట్టి సంఘాలు, సంస్థలు, వేదికలు, రాజకీయ పార్టీలు బడ్జెట్‌కు ముందే, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి. ఆరోగ్యరంగంతో సహా అన్ని రంగాలకు ప్రాధా న్యతాక్రమంలో కేటాయింపులు ఉండేలా డిమాండ్‌ చేయాలి. ఇప్పటికైనా పౌరసమాజం మేల్కొనకపోతే, సామాన్యజనం పాలిట కోవిడ్‌ లాంటి మరిన్ని మహమ్మారులు మృత్యు శకటాలుగా మారతాయన్నది సత్యం.

మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077


 

మరిన్ని వార్తలు