Sakshi News home page

‘ఏకగ్రీవం’కు మోకాలడ్డు అనుచితం

Published Fri, Jan 29 2021 3:16 AM

Unanimous In AP Local Body Elections Guest Column - Sakshi

‘గౌరవప్రదంగా, ఆనంద జీవనం సాగించ డానికి అవసరమైన వ్యవస్థలను మనిషి సమకూర్చుకోవాలి. అవి అందించే స్వతంత్ర, స్వయంసమృద్ధ గ్రామాలను ఏర్పరచుకున్న పుడే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం లభించినట్టు’ అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ! భారతదేశపు హృదయం పల్లెల్లోనే ఉందన్న బాపూజీ, గ్రామ స్వరాజ్య స్థాపనకు పరస్పర సహకారం, అహింస మూల సూత్రాలు కావాలన్నారు. వాటి ఆధారంగానే దేశ భవిష్యత్‌ నిర్మాణం జరగాలన్నారు. కానీ, మనం ఎక్కడో దారి తప్పాం. పాలకుల చిన్న చూపు వల్ల స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల్లోనే గ్రామం వెలవెల బోయింది. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయం, తగుసాయం లేక చతికిలబడింది. సామాన్యుల బతుకు చల్లగ జూసిన కులవృత్తులు కునారిల్లినాయి. పెరిగిన జనాభాతో అవకాశాలు తగ్గి కక్షలు, కార్ప ణ్యాలు పెచ్చరిల్లాయి. ఉపాధి లేక బతుకు భారమై గ్రామీణభారతం పట్టణాలు, నగరాలకు వలసబాట పట్టిన పరిణామమే గడచిన పాతికేళ్ల నికర చరిత్ర! ముఖ్యంగా ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ తర్వాత ‘మార్కెట్‌ మాయ’లో చిక్కి గ్రామీణ జీవితం చిద్రమై పోయింది.

ఇప్పుడిప్పుడే గ్రామ పునరుజ్జీవన చర్యలు మొదల య్యాయి. తిరుగువలసలు చర్చకు వస్తున్నాయి. రాజకీయ వ్యవస్థ పైనా ఒత్తిడి పెరిగింది. గ్రామీణంపై శ్రద్ధ చూపితేగాని రాజకీయంగా మనలేని వాతావరణం బలపడుతోంది. గ్రామాలను తీర్చిదిద్దడానికి ఇదే సరైన సమయమని జనహితం ఆలోచించే నవతరం పాలకులు కొందరు నడుం కడుతున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ఓ ఉదాహరణ! గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపనకు బుడిబుడి అడుగులు పడుతున్నాయి. చిరకాలం అధికారం అనుభవించాలనే రాజకీయ కుయుక్తితో విభజించి పాలించే కొందరి ఎత్తుగడలకు కాలం చెల్లింది. నిజాలు గ్రహిస్తున్న సగటు గ్రామం, ఆయా పెడధోరణులను తిరస్క రిస్తోంది. కొత్త ఆలోచనలు పురుడుపోసుకుంటున్నాయి. గ్రామాల్లో పరస్పర సయోధ్య, సహకార భావన, సమష్టితత్వం బలపడాల్సిన సమయమిది.

పాలనా వికేంద్రీకరణలో గ్రామమే తొలి అడుగు. గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ వ్యవస్థల ఏర్పాటు ఆయువుపట్టు! ఇదే అదనుగా, రాజకీయాలకు అతీతంగా ఊరు ఊరంతా ఒక్కట వడం తక్షణ లక్ష్యం. అందుకే, ఏకగ్రీవ ఎన్నికల ద్వారా సమష్టి భావన పెంచే కార్యాచరణ బలపడుతోంది. తద్వారా, తాము కలిసికట్టుగా కోరింది సాధించుకునే (బార్గేయినింగ్‌) శక్తి పెంచుకోగలమని గ్రామీ ణులు భావిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ముంద డుగే! అడ్డుకోవడం ప్రగతి వ్యతిరేక చర్యే అవుతుంది.

మరిన్ని ముల్కనూర్‌లు ఎందుకు రాలేదు?
కక్షలు, కార్పణ్యాలు విడనాడి, కలిసి ఏకగ్రీవంగా పంచాయతీ పాలక మండలిని ఎన్నుకుంటామంటే వద్దనకూడదు. గుడ్డుపై ఈకలు పీకే తత్వం తప్పు! సదరు గ్రామాలను ప్రోత్సహించాలి. అటువంటి ఊళ్లు ఇరుగుపొరుగునున్న ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలి. సహకార స్ఫూర్తిని, ఊరుమ్మడి పాలనా వ్యవస్థలు బలోపేతం చేసుకొని గ్రామ స్వరాజ్య భావనకు, ఈ కార్యాచరణకు నిలువెత్తు నిదర్శనం కావాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంకాపూర్‌ (నిజామాబాద్‌), గంగ దేవరపల్లి (వరంగల్‌), దుద్దెనపల్లి (కరీంనగర్‌), ముల్కనూర్‌ (వరంగల్‌), గుడ్ల వల్లేరు (కృష్ణా) తదితర సహకార సంఘాలు దశాబ్దాల తరబడి విజ యగీతాలై వినిపించాయి. వాటి పరిధిలోని దాదాపు అన్ని గ్రామా ల్లోనూ ఏకగ్రీవ గ్రామపాలక మండల్లే ఏర్పడుతుంటాయి. దేశం నలుమూలల నుంచి జనం వచ్చి చూసివెళ్లేంతగా గ్రామ స్వయం సమృద్ధికవి ప్రయోగశాలలయ్యాయి. సామాజికంగా, సాంస్కృతికం గానే కాక ఆర్థికంగానూ స్వయంసమృద్ధి సాధించిన గ్రామాలవి. సమష్టితత్వం వల్ల రాజకీయ వ్యవస్థల్ని కూడా తమ చెప్పుచేతల్లో ఉంచుకో గలిగాయి. వ్యవసాయ రంగంలోనే కాక పాడి పరిశ్రమ, పెట్రోల్‌ బంక్, పరపతి సంఘం, బ్యాంకు, మార్కెట్‌ వంటి వ్యవస్థల్ని సొంతంగా ఏర్పరచుకొని రాజ్యంపైన ఆధారపడాల్సిన అవసరమేలేని ఎదుగుదల సాధించారు.

బయటి మార్కెట్‌తో పోల్చి చూస్తే, ఆయా సంఘాల పరిధిలోని ఉత్పత్తిదారుకు రూపాయి ఎక్కువ లాభం, వినియోగదారులకు రూపాయి తక్కువ వ్యయం సాధించిన ఘనత వారికి దక్కింది. నేరాలు చాలా తగ్గిపోయాయి. జీవనానంద సూచీ రమారమి పెరిగింది. స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాల కాలంలో ఆ నాలుగయిదు పేర్లే తప్ప కొత్తవి రాలేదు, ఎందుకని? సహకార స్ఫూర్తిని పెంచేందుకు వేరే గ్రామాల్లో తగినంత ప్రోత్సాహం లభిం  చలేదు. స్వప్రయోజనాల కోసం తపించే రాజకీయపక్షాలు కూడా పెద్దగా సహకరించలేదు. రాష్ట్ర విభజన తర్వాత గుడ్లవల్లేరు తప్ప సదరు గ్రామాలు తెలంగాణలో మిగిలిపోయాయి. విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్‌లో పాండురంగపురం (కర్నూలు), నిమ్మకూరు (కృష్ణా), చిన్నపరిమి (గుంటూరు) వంటి గ్రామాల్లో కొంత సహకార భావన మొగ్గతొడిగింది. ఊరంతా కలిసికట్టుగా అభివృద్ది పనులు చేపట్టి ఇటీవల విజయవంతంగా పూర్తి చేశారు. అదే ఒరవడి కొనసాగించడా నికి అవసరమైన ప్రోత్సాహం వారికి లభించలేదు.

ఉత్సాహంపై నీళ్లు చల్లొద్దు!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామసచివాలయాలు, అనుబంధంగా వాలంటరీ వ్యవస్థ ఏర్పాటయ్యాక పాలనా వికేంద్రీకరణ ఆచరణలోకి వచ్చింది. పౌరసదుపాయాల కల్పన తేలికయింది. ఇదే సమయంలో పంచా యతీ ఎన్నికలు ముంచుకొచ్చాయి. అవెలాగూ చట్టబద్ధంగానే పార్టీ రహితంగా జరుగుతున్నాయి. కనుక గ్రామాల్లో అనవసర స్పర్ధలు వీడి ఏకగ్రీవంగా పాలకమండళ్లను ఎన్నుకోవాలనే భావనలు బలపడు తున్నాయి. కోవిడ్‌ వల్ల అర్ధంతంగా ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఇది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ ఒరవడి పంచా యతీ ఎన్నికల్లోనూ సాగితే, గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు, వ్యతిరేక భావనలు తొలగి పోతాయని ప్రజాస్వామ్య కాముకులు భావించారు. గాంధీజీ ఆశించిన అహింస సాధ్యమయ్యేది ఇలానే! పైగా, ఇరుపక్షాల వైపు నుంచి అనవసర ఎన్నికలు, ప్రచార వ్యయాలు ఉండవు. పార్టీ లకు అతీతంగా అన్న మాటే గాని, నిజానికి పోటీ ఓ రకంగా రాజకీయ పక్షాల బలప్రదర్శనగా సాగుతోంది. ఇది హర్షణీయం కాదు.

ఎన్నికల్లో పెద్ద మొత్తాలు డబ్బు ఖర్చు చేసే అభ్యర్థులు, గెలిచాక ఏదో రూపంలో లాభాలతో సహా పెట్టుబడి రాబట్టుకోవడం తేటతెల్లం. ఫలితంగా అవినీతికి ఆస్కారం ఉంటుందనేది సామాజికవేత్తల విశ్లేషణ! అలా కాకుండా... ఒకవంక పాలనా వ్యవస్థల వికేంద్రీకరణ–మరోవంక ఏక గ్రీవాలతో పాలకమండలి ఏర్పాటుతో వచ్చే గ్రామ సమష్టితత్వం వల్ల బాపూజీ కలలుకన్న గ్రామస్వరాజ్య స్థాపన సాకారమౌతుంది. ప్రభుత్వ ప్రోత్సాహక నగదుతో గ్రామాభివృద్ధికొక అవకాశం! ఎవర మైనా ఇది ప్రోత్సహించాల్సిన పరిణామం. కానీ, ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ధోరణి ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ‘ఏకగ్రీవాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఏదైనా పరిమితికి మించి జరిగితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది, కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుంది’ అని కలెక్టర్ల సమావేశంలో ఎన్నికల కమిషనర్‌ చేసిన హెచ్చరిక తప్పుడు సంకేతాలిచ్చేదే! ఏకగ్రీవాలను ఇది నిరు త్సాహపరిచే చర్య. పైగా నిర్హేతుక బదిలీలు, అర్థంలేని అభిశంసనలు ఉద్యోగవర్గాన్ని భయోత్పాతానికి గురిచేయడమే అవుతుంది. ఒక జిల్లాలో, లేదా ఒక మండలంలో ఇన్నే పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావాలి అన్న పరిమితేం లేదు! ఇక పరిమితికి మించి... అన డంలో అర్థమేముంది? ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తుందన్న మీడియా వ్యాపార ప్రకటన, దాని విడుదల పట్ల ఎస్‌ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పౌరసంబంధాల కమిషనర్‌ను సంజాయిషీ కోరినట్టు వార్తలొచ్చాయి.

ఇది సమర్థ నీయం కాదు. ప్రోత్సాహకాలు కొత్త విషయమేమీ కాదు. దేశంలో గుజ రాత్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, తెలంగాణ వంటి పలు రాష్ట్రాల్లో ఉన్నదే! అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2001లోనే, నాటి చంద్ర బాబు సర్కారు నిర్ణయం తర్వాత అధికారిక ఉత్తర్వు (జీవో నం: 1154) వెలువడింది. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. తర్వాత పలుమార్లు ప్రోత్సాహక నగదు పెంచుతూ వేర్వేరు ప్రభు త్వాలు ఉత్తర్వులిచ్చాయి. ఎలా చూసినా తప్పుబట్టాల్సిన పనికాదు. కానీ, ఏకగ్రీవాలు కాకుండా చూడండి అని పార్టీ యంత్రాంగానికి విపక్షనేత చంద్రబాబునాయుడు పిలుపునివ్వడం, దానికి దన్నుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అధికార యంత్రాంగానికి హెచ్చరికలు చేయడం యాదృచ్ఛికమేం కాదు! ఇప్పుడింకో విచిత్రం, పార్టీరహితంగా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు ప్రతిపక్షపార్టీ అధినేత ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. దీన్ని ఎస్‌ఈసీ ఎలా పరిగణిస్తుందో చూడాలి.

శతాబ్దాల ఉమ్మడి స్ఫూర్తిచరిత మనది!
గ్రామపాలనలో ప్రజాతంత్ర విధానాలకు భారతీయ సంస్కృతిలోనూ మూలాలున్నాయి. రెండున్నర వేల సంవత్సరాల కిందటి గణ రాజ్యాల్లో గ్రామీణ ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందనడానికి వైశాలి ఓ నిదర్శనం. క్రీ.శ 920లోనే తమిళనాడులోని ఓ మారుమూల పల్లెలో గ్రామస్వరాజ్య భావన ఎంత బలంగా ఉండిందో ఇటీవల వెలుగు చూసిన చరిత్ర చెబుతోంది. ఉతిరామెరూర్‌ (మధురాంతకం కు 25 కి.మీ. దూరం)లోని ఓ గ్రామ సభామండపం గోడలపై రాతలే ఇందుకు సాక్ష్యం. గ్రామసభ ఎలా ఏర్పడాలి? సభ్యులుగా ఎవరు అర్హులు? అర్హత కోల్పోతే వెనక్కి రప్పించడమెలా? ఊరుమ్మడి భావన లెలా ఉండాలి? ఇలాంటివన్నీ ఆ రాతల్లో ఉన్నాయి. భారతీయ గ్రామీణ సమాజాలు ఎంత గొప్ప స్వతంత్ర, స్వయంసమృద్ధ, గణ తంత్ర వ్యవస్థలో 1830లోనే, నాటి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ సర్‌ చార్లెస్‌ మెట్‌కాఫ్‌ నొక్కి చెప్పారు. ‘ఒక్కో గ్రామ సమాజం, ఏ కొరతా లేని ఒక్కో స్వాతంత్య్ర బుల్లి రాజ్యంగా పరిఢవిల్లుతున్నాయ’ని ఆయన పేర్కొన్నారు.

అందుకే, గ్రామాలను రాజకీయాలకు అతీ తంగా ఎదగనివ్వాలి. స్వార్థప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు, రాజ్యాంగ వ్యవస్థలు కూడబలుక్కొని స్ఫూర్తిని నిర్వీర్యపరచడం దారుణ పరిణామం. ఏ పదవులు అలంకరించినా... వ్యక్తులు ముఖ్యం కానేకాదు. అదీ, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భాన్ని వాడుకుంటున్న తీరు అభ్యంతరకరం. ఎన్నికల ప్రక్రియ ముగిసి, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా అధినేతల వైఖరే పాలనకు గీటు రాయి. సంక్షేమ ఫలాలు అందించడంలో కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, పార్టీలు చూడం... తరతమ భేదాలు లేకుండా అర్హులందరినీ ఏకరీతిన చూస్తామని సీఎం బహిరంగంగా ప్రక టిస్తున్న రాష్ట్రంలో... సంకుచిత ఎత్తుగడలకు పాల్పడటం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే! ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏక గ్రీవంగా పాలకమండలిని ఎన్నుకునే ఊరుమ్మడి భావన గొప్పది. గ్రామస్వరాజ్య సాధనలో అభినందించి, ఆహ్వానించాల్సిన తొలిమెట్టు!
పి. ప్రభాకర్‌రెడ్డి
వ్యాసకర్త ఐఏఎస్‌ (రిటైర్డ్‌) 

Advertisement

What’s your opinion

Advertisement