ధర్మ శాస్త్రాలు కుల, మతాలకు అతీతం

11 Nov, 2023 01:42 IST|Sakshi
ప్రసంగిస్తున్న సహస్రావధాని గరికపాటి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ధర్మ శాస్త్రాలు కుల, మతాలకు అతీతమని మహా సహస్రావధాని, వ్యక్తిత్వ వికాస ప్రసంగీకుడు డాక్టర్‌ గరికపాటి నరసింహారావు అన్నారు. శుక్రవారం జేసీ లా కళాశాలలోని విద్యార్థులకు ‘‘నాటి ధర్మ శాస్త్రాలు–నేటి ప్రాధాన్యం’’ అనే అంశంపై ఉపన్యాసమిచ్చారు. ఆయన మాట్లాడుతూ పంచభూతాలు కలుషితానికి మానవుల మనస్సే కారణమని చెప్పారు. యువత దేశానికి చక్కని ఆస్తి అని, వారు క్షణికావేశానికి గురి కావద్దని సూచించారు. న్యాయ విద్యార్థులు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గ్రహించడం వలన న్యాయవాదులుగా రాణించగలరని చెప్పారు. దైవభక్తి కంటే దేశభక్తి ముఖ్యమని ఉద్భోదించారు. ఆత్మ విశ్వాసం, మనోస్ధైర్యాన్ని నేర్పని చదువు వ్యర్థమని, సరైన న్యాయవ్యవస్థ, రక్షక వ్యవస్థ వలనే ప్రాచీన కాలంలో రాజ్యాలు అభివృద్ధి చెందాయని వివరించారు. ధర్మం కోసం వ్యూహాలు పన్నాలని న్యాయవాదులకు సూచించారు. దేవాలయాలపై అధికారం వంశ పారం పర్యంగా ఉండాలని, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత కాదన్నారు. వివిధ వృత్తులకు రక్షణ కల్పించడం ద్వారా ఆనాడు ప్రజలు చక్కగా జీవించారని, ధర్మశాస్త్రాలు మహిళలకు రక్షణ కల్పించాలని అన్నారు. గరికపాటి ప్రసంగం ఆద్యంతం విద్యార్థులు లీనమై ఆలకించారు. అనంతరం గరికపాటి నరసింహారావును కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో నాగార్జున ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్‌, డాక్టర్‌ కె.కృష్ణప్రసాద్‌, కార్యదర్శి వేమన కుప్పుస్వామి, పాలకవర్గ సభ్యులు కె. రామారావు, పి. గోపీచంద్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ సుధాకరబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు