ఆ రోజు తర్వాత ఏం జరిగింది.. | Sakshi
Sakshi News home page

ఆ రోజు తర్వాత ఏం జరిగింది..

Published Sat, Nov 11 2023 1:40 AM

- - Sakshi

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, రేంజ్‌ ఐజీ పాల్‌రాజు పర్యటించారు. 2018 జనవరి ఒకటో తేదీన గొట్టిపాడులో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎస్సీలకు, ఓసీలకు మధ్య గొడవలు జరగడం, మాకు న్యాయం చేయాలంటూ అనేకసార్లు దళితులు ఉద్యమాలు చేయడం తెలిసిందే. న్యాయం చేయాలని కోరుతూ ఎస్సీ కాలనీకి చెందిన అనితతో పాటు సుమారు రెండు వందల మందికి పైగా బాధితులు ఏపీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలు బాధితులను స్వయంగా విచారించి నివేదిక సమర్పించాలని ఉత్తర్వు లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, గుంటూరు రేంజ్‌ ఐజీ, పాల్‌రాజ్‌ విచారణ చేపట్టారు.

స్కూల్‌ ఉపాధ్యాయుల విచారణ

స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను(గొడవ జరిగిన సమయంలో ఆ పాఠశాలలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు) విచారించారు. 2018లో విద్యార్థుల పట్ల సాంఘిక బహిష్కరణ జరిగిందా? విద్యార్థులను స్కూలుకు రానివ్వకపోవడం వంటివి ఘటనలు ఏమైనా జరిగాయా అన్న వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాంటివి ఏమీ జరగలేదని, ఆ ఘటన జరిగిన తర్వాత ఒకటి రెండు రోజులు మాత్రం గొడవ ప్రభావంతో పిల్లలు స్కూలుకి రాలేదని, తర్వాత యథావిధిగా పాఠశాలకు వచ్చా రని ఉపాధ్యాయులు కలెక్టర్‌, ఐజీలకు వివరించారు. అనంతరం వివాదం జరిగిన ప్రదేశంతో పాటు ఎస్సీ కాలనీలోని చర్చి పరిసరాలు, రక్షిత తాగునీటి చెరువు సమీపంలోని తాగునీటి బావిని కలెక్టర్‌, ఐజీలు స్వయంగా పరిశీలించారు.

నిర్భయంగా నిజాలు చెప్పండి..

నిర్భయంగా నిజాలు చెప్పాలని, చెప్పలేని వారు లిఖితపూర్వకంగా అయినా వారు ఎదుర్కొన్న సమస్యలను తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి పిటిషనర్లను కోరారు. ప్రత్తిపాడు తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ వేదిక వద్ద పిటిషనర్లతో మాట్లాడారు. గొడవ జరిగిన రోజు వారు ఎదుర్కొన్న సమస్యలను బాధిత మహిళలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వారు చెప్పిన అంశాలను అధికారులు రికార్డు చేసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌ మీడియాతో మాట్లాడారు. హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ నంబర్‌ 11093/20 అనుసరించి హైకోర్టు ఆదేశాల మేరకు గొట్టిపాడులో 2018 జనవరి ఒకటో తేదీన జరిగిన ఘటన అనంతరం జరిగిన పరిస్థితులపై బాధితులను విచారించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

స్వల్ప ఉద్రిక్తత..

ప్రత్తిపాడు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితుల తరఫున పోరాడుతున్న రాజా సుందరం బాబు విచారణ వేదిక వద్దకు వస్తున్న సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకు న్నారు. హైకోర్టు కేవలం బాధితులను మాత్రమే విచారించాలని సూచించిందని, ఇతరులను వేదిక వద్దకు అనుమతించబోని పోలీసులు తెలిపారు. దీంతో దళిత మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజసుందరంబాబు కూడా లోపలకు పంపాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కొద్దిసేపు మహిళలు పోలీసుల వైఖరిపై నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అడిషనల్‌ ఎస్పీ సుప్రజ మహిళలతో మాట్లాడారు వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు.

కార్యక్రమంలో గుంటూరు ఆర్డీఓ పి.శ్రీకర్‌, అడిషనల్‌ ఎస్పీలు సుప్రజ, కోటేశ్వరరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్‌ కె.స్వాతి, డీఆర్డీఏ పీడీ హరహరనాథ్‌, సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ మధుసూదనరావు, డ్వామా పీడీ యుగంధర్‌, తహసీల్దార్‌ సిద్ధార్థ, ఎంపీడీఓ శ్రీరమ్య పాల్గొన్నారు.

గొట్టిపాడులో జిల్లా కలెక్టర్‌, ఐజీల పర్యటన ఘటనా ప్రాంతాల పరిశీలన ప్రత్తిపాడు తహసీల్దార్‌ కార్యాలయ వద్ద బహిరంగ విచారణ

Advertisement
Advertisement