మచ్చుకాయల వ్యవస్థను రూపుమాపడమే లక్ష్యం

11 Nov, 2023 01:42 IST|Sakshi
మాట్లాడుతున్న నిమ్మకాయల రాజనారాయణ, ప్రభుదాసు, అన్నపూర్ణ.
మిర్చి యార్డు చైర్మన్‌ రాజనారాయణ

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డ్డులో మచ్చుకాయల వ్యవస్థను నాశనం చేసి, రైతులకు అన్యాయం జరగకుండా చూడటమే పాలకవర్గం ప్రధాన లక్ష్యమని మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ స్పష్టం చేశారు. మిర్చి యార్డు ఆవరణలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్చి యార్డులో అనాదిగా మచ్చుకాయల పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు పాలకవర్గం పగ్గాలు చేపట్టాక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. యార్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న మచ్చు కాయల దుకాణాలను మూసి వేయించడం జరిగిందని చెప్పారు. భద్రతా సిబ్బందిని కాపలా పెట్టి నమూనా కోసం కేజీలకు కేజీలు మచ్చుకాయలు తీసుకువెళ్ళే గుమస్తాలు, హమాలీలను నిలువరించామన్నారు. ఎవరైనా మచ్చుకాయలు తీసుకెళ్తున్నా స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా స్వాధీనం చేసుకున్న మచ్చు కాయలు ఆక్షన్‌ వేసి మార్కెట్‌ యార్డుకు రూ.1.50 లక్షలు మార్కె ట్‌ యార్డుకు జమ చేయడం జరిగిందని గుర్తు చేశారు. మరో 54 బస్తాలు స్వాధీనం చేస్తున్న మచ్చుకాయలు సుమారు 2,430 కిలోలు ఉన్నాయని, వాటికి త్వరలో ఆక్షన్‌ వేయడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో యార్డు పాలకవర్గ సభ్యులు జి.ప్రభుదాసు, కోలా అన్నపూర్ణ పాల్గొన్నారు.

యార్డుకు మూడు రోజులు సెలవులు...

దీపావళి పండుగ సందర్భంగా గుంటూరు మార్కెట్‌ యార్డుకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు వారంతపు సెలవులతో పాటు సోమవారం దీపావళి పండుగ సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ మంగళవారం నుంచి యార్డులో క్రయ విక్రయాలు కొనసాగుతాయని యార్డు చైర్మన్‌ రాజనారాయణ తెలిపారు.

14న మిర్చి యార్డులో ప్రత్యేక సమావేశం

గుంటూరు మార్కెట్‌ యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మిర్చి యార్డుకు సంబంధించి యార్డు చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుందని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిర్చి సీజన్‌ సమీపిస్తున్నందున మిర్చి క్రయ విక్రయాలు సజావుగా కొనసాగేందుకు, యార్డులో సీసీ కెమెరాల ఏర్పా టు, ట్రాఫిక్‌ నియంత్రణ, శాంపిల్స్‌, మచ్చు కాయల విషయం, యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. సమావేశానికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సంయుక్త సంచాలకులు కాకుమాను శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు బి.రాజబాబు, పాలకవర్గ సభ్యులతో పాటు మిర్చి ఎక్స్‌పోర్టర్స్‌, కమీషన్‌ ఏజంట్స్‌, ఎగుమతి వ్యాపారుల అసోసియేషన్స్‌, అన్ని ముఠా కార్మికుల అసోసియేషన్‌ నాయకులను ఆహ్వానించడం జరిగిందని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు