శివకేశవులకు ప్రీతికరం..కార్తికం

12 Nov, 2023 01:48 IST|Sakshi
విద్యుత్‌ వెలుగుల్లో అమరావతి దేవాలయం (ఇన్‌సెట్‌లో) కార్తిక దీపం
●అమరావతిలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ●14నుంచి కార్తిక మాసం ప్రారంభం

అమరావతి: శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. నెల రోజులు పర్వదినాలుగా పరిగణిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం పన్నెండు మాసాలలో కెల్లా కార్తీకమాసానికి అత్యంత ఆధ్యాత్మిక విశిష్టత కల్గినది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నుంచి నెల రోజులపాటు భక్తులు ఉపవాసం, స్నానం, దానం, దీపారాధన చేయటం సంప్రదాయంగా వస్తుంది. శివ ప్రీతికై అభిషేకం, విష్ణు ప్రీతికై తులసీ దళార్చన చేసేందుకు శైవ కేత్రమైన అమరారామం విశిష్టమైనది. పవిత్ర పుణ్య క్షేత్రమైన అమరావతిలో శివకేశవ ఆరాధనకు ఇంద్ర ప్రతిష్టితుడైన అమరేశ్వరుని, క్షేత్ర పాలకుడైన వేణుగోపాలస్వామిని, పవిత్ర స్నానమాచరించేందుకు కృష్ణానది ఉండటంతో భక్తులకు శివకేశవ ఆరాధనకు ఈ క్షేత్రం విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది.

పంచారామాల సందర్శన

అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి. ఈ క్షేత్రాలను భక్తులు ఒకే రోజు సందర్శించటం సంప్రాదాయంగా వస్తుంది. కార్తీకమాసంలో పంచారామక్షేత్ర సందర్శనలో భాగంగా ప్రథమారామమైన అమరారామాన్ని ఆది, సోమ వారాలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి సందర్శిస్తారు. వారికి స్వామి వారి దర్శనం, ప్రసాదం అందించటం వంటి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంచారామాల యాత్రికుల సౌకర్యార్థం దేవాలయం సోమవారం రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచుతారు. మిగిలిన రోజులలో 9గంటలవరకు తెరచి ఉంచుతారు.

స్వామికి విశేష పూజలు

కార్తీకమాసం సందర్భంగా ఆలయంలో భక్తుల పరోక్షంలో కార్తీకమాస నిత్యాభిషేక పథకం ద్వారా అమరేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం అమరేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ఉదయం ఐదు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. శుక్రవారం బాలచాముండేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, కార్తీక పౌర్ణమికి కృష్ణానదిలో స్వామివారికి తెప్పోత్సవం, అనంతరం జ్వాలామాలికా దీపోత్సవం నిర్వహిస్తారు.

భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

భక్తులకు వసతి, ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం, అన్నదానం, స్నాన ఘట్టాలలో తాత్కాలిక మరుగుదొడ్లు, సీ్త్రలు దుస్తులు మార్చుకునే గదులు వంటి సౌకర్యాలను కల్పిస్తారు. అలాగే స్వామి ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చి భక్తుల క్యూలైన్ల కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. స్నానఘాట్‌లలో భక్తులు స్నానమాచరించటానికి ప్రత్యేకంగా షవర్లు ఏర్పాటు చేస్తారు. నీటిలో లోతుకు వెళ్లకుండా పడవలను ఏర్పాటు చేసి దానిపై గజ ఈతగాళ్లను నియమించారు.

అమరావతి చేరుకునేదిలా...

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అమరావతి మూడు రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

గుంటూరు నుంచి ప్రతి 15నిముషాలకు బస్సు సౌకర్యం ఉంది.

విజయవాడ నుంచి ప్రతి 30నిముషాలకు ఒక బస్‌ సర్వీసు ఉంది.

సత్తెనపల్లి నుంచి ప్రతి అరగంటకు బస్సు సర్వీస్‌ ఉంది.

మరిన్ని వార్తలు