సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు జాతీయ స్ధాయి గుర్తింపు

2 Dec, 2023 02:10 IST|Sakshi
వైద్యశాలలో సూపరిండెంట్‌కు సర్టిఫికెట్‌ అందిస్తున్న కొత్త రామకృష్ణ

సత్తెనపల్లి: పట్టణంలోని ఏరియా వైద్యశాలకు నేషనల్‌ అసెస్మెంట్‌ ముస్కాన్‌ ప్రోగ్రాం క్రింద క్వాలిటీ కంట్రోల్‌ సర్టిఫికెట్‌ను అందుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఏరియా వైద్యశాలలో నిర్వహించిన సమావేశంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కొత్త రామకృష్ణ మాట్లాడుతూ నవజాత శిశువుల వార్డును ఇటీవల క్వాలిటీ కంట్రోల్‌ కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి చెందటంతో ఈ సర్టిఫికెట్‌ అందజేశారన్నారు. నవజాత శిశువుల వార్డును కార్పొరేట్‌ స్థాయికి మించి సౌకర్యాలు కల్పించామని, వైద్యులు, స్టాఫ్‌ నర్సులు అందరూ ఒక టీం వర్క్‌ చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. ఎంతో క్లిష్టతరమైన ఈ సర్టిఫికెట్‌ రావటం ఆనందకరమన్నారు. వైద్యశాల అభివృద్ధిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక చొరవ ఉండటం తమకు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.లక్ష్మణరావు మాట్లాడుతూ సత్తెనపల్లి ఏరియా వైద్యశాల ఒక అరుదైన అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని దీనికి ముఖ్య పాత్ర పోషించిన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కొత్త రామకృష్ణకి, వైద్యశాలలోని వైద్యులు డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ ప్రేమలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ శోభారాణి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ రాధ, ఎంబీఎస్సీ కౌన్సిలర్‌ రంగనాయక్‌, స్టాఫ్‌ నర్సులు ఉన్నారు.

మరిన్ని వార్తలు