పట్టణాలను తలదన్నేలా పల్లె రోడ్లు | Sakshi
Sakshi News home page

పట్టణాలను తలదన్నేలా పల్లె రోడ్లు

Published Sat, Dec 2 2023 2:10 AM

- - Sakshi

బాపట్ల అర్బన్‌: పల్లె సీమల్లో పట్టణాలను తలదన్నేలా రోడ్ల నిర్మాణం చేపట్టడం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని, దీనికి నరసాయపాలెంలోని కాలనీలో నూతనంగా నిర్మించిన రోడ్డే నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. శుక్రవారం రూ.50 లక్షలతో నిర్మించిన సిమెంట్‌ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నరసాయపాలెంలో చూస్తున్నామని చెప్పారు. పల్లెల్లో రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌ పాత్‌ల నిర్మాణం చేపట్టడం గొప్ప విషయమని, ఇలాంటి అభివృద్ధిని తమ స్వగ్రామంలోనూ అమలు చేస్తానని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో ఏడాదిన్నర పాటు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. నరసాయపాలెంలో బ్రహ్మాండమైన రోడ్డు నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేష్‌, బాపట్ల ఎంపీపీ హరిబాబు గ్రాంట్‌ ఇచ్చారని, అందరి కృషితో మంచి అభివృద్ధిని చూస్తున్నామని చెప్పారు. తొలుత గ్రామంలోని అంబేడ్కర్‌, దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ చిన్న పోతుల హరిబాబు, జెడ్పీటీసీ సభ్యులు పిన్ని బోయిన ఎస్తేర్‌ రాణి, సొసైటీ అధ్యక్షుడు జయరామిరెడ్డి, నరసాయపాలెం గ్రామ సర్పంచి హైమావతి పాల్గొన్నారు.

బోన్సాయ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

పటమట(విజయవాడతూర్పు): శిల్పి రాయిని శిల్పంగా ఎలా మలచుతారో బోన్సాయ్‌ మొక్కలను కూడా అనునిత్యం సంరక్షించి వాటిని ఆకర్షణీయంగా మల్చటంలో బోన్సాయ్‌ కళాకారులు కృషి ఉంటుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు అన్నారు. రాజీవ్‌గాంధీ పార్కులో అమరావతి బోన్సాయ్‌ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 4వ తేదీ వరకు జరిగే బోన్సాయ్‌ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. బోన్సాయ్‌ మొక్కల పెంపకానికి తగిన శిక్షణ, అవగాహన అవసరం అని, ఇందులో నిష్ణాతులుగా మారాలంటే ఓపిక, సహనం అధికంగా ఉండాలన్నారు. వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ అరుదైన జాతి మొక్కలను పెంచటమే కాకుండా బోన్సాయ్‌ తరహాలో మొక్కలను పెంచేందుకు అవసరమైన సదుపాయాలను సొసైటీ సభ్యులకు వీఎంసీ కల్పిస్తుందన్నారు. సొసైటీ అధ్యక్షురాలు అమృత కుమార్‌ మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌లో రకరకాల బోన్సాయ్‌ మొక్కలను తిలకించవచ్చన్నారు.

Advertisement
Advertisement