డీజిల్‌ స్వాహాపై కమిషనర్‌ సీరియస్‌ | Sakshi
Sakshi News home page

డీజిల్‌ స్వాహాపై కమిషనర్‌ సీరియస్‌

Published Tue, Apr 9 2024 1:00 AM

వెహికిల్‌ షెడ్డులో అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ అశ్వినితానాజీ వాకడే
 - Sakshi

విధుల నుంచి ఔట్‌సోర్సింగ్‌

డ్రైవర్‌ రమేశ్‌ తొలగింపు

వరంగల్‌ అర్బన్‌ : పారిశుద్ధ్య వాహనాల షెడ్డులో ఆక్రమణలు, డీజిల్‌ స్వాహాపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అశ్వినితానాజీ వాకడే సీరియస్‌ అయ్యారు. డీజిల్‌ స్వాహాకు పాల్పడిన ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌ రమేశ్‌ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. ‘బల్దియా వాహనాల్లో ఇంధన దోపిడీ’ శీర్షికన ఈనెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కమిషనర్‌ స్పందించారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బల్దియా వెహికిల్‌ షెడ్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెహికల్‌ షెడ్డులో సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. షెడ్డులో సమస్యలు, వాహనాల మరమ్మతులు, హాజరును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చెత్త తరలింపు వాహనాలను వెంటనే మరమ్మతు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. వాహన షెడ్డులో సీసీ కెమెరాలు, వాహన లాగ్‌బుక్‌లకు శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు విధి గా బాధ్యతలు చేపట్టాలన్నారు. వాహనం ఎన్ని కిలోమీటర్లు తిరిగిందని, వినియోగించిన డీజిల్‌ ఎంత అనే వివరాలు ప్రతిఒక్కరి వద్ద ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కమిషనర్‌ హెచ్చరించారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజేష్‌, ఈఈ సంజయ్‌కుమార్‌, ఏఈ సంతోష్‌కుమార్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ భాస్కర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement