Swapnalok Complex Fire Accident: పొగ మింగిన బతుకులు.. ఆరుగురు బలి

17 Mar, 2023 06:06 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సాయంత్రం అయిదో అంతస్తులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రారంభమైన మంటలు భవనంలోని మిగతా అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కాంప్లెక్స్‌లో మొత్తం 14 మంది చిక్కుకుపోయారు. వీరిని అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌ అధికారులు బ్రోంటో స్కైలిఫ్ట్‌ వెహికిల్‌తో రెస్క్యూ చేశారు. పొగ పీల్చిన ఆరుగురు అసువులు బాశారు.

సాయంత్రం 6.30– 6.45 గంటలు..
బీ బ్లాక్‌ అయిదో అంతస్తులోని ఓ గోదాములో మంటలు చెలరేగాయి. తొలుత దట్టమైన పొగ వ్యాపించింది. కొద్దిసేపటకు అగ్నికీలలు పెరిగి ఆరు, ఏడు, ఎనిమిది అంతస్తులతో పాటు నాలుగో అంతస్తుకూ పాకాయి. పొగ, మంటల్ని గమనించిన కొందరు కాంప్లెక్స్‌ వదిలి బయటకు వచ్చేశారు. కాంప్లెక్స్‌ మొత్తానికి ఒకే మెట్ల మార్గం ఉండటం, అది ఇరుకు రావడంతో పాటు పొగ కారణంగా అయిదు నుంచి ఎనిమిదో అంతస్తుల్లో ఉన్న వాళ్లు బయటకు రాలేకపోయారు.


ఇలా మొత్తం 14 మంది కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయారు. అయిదో అంతస్తులోని బీఎం5 అనే ఈ–కామర్స్‌ కార్యాలయంలో పది మంది, ఎనిమిదో అంతస్తులోని తుకారాంగేట్‌ కానిస్టేబుల్‌ రవి ఇంట్లో అతడితో పాటు తల్లి భారతమ్మ, తండ్రి చిక్కుకుపోయారు. వీరిలో కొందరు టాయిలెట్స్‌ వైపునకు వచ్చి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో పాటు తమ సెల్‌ఫోన్లలోని లైట్లు ఆన్‌చేసి చూపిస్తూ తాము ప్రమాదంలో ఉన్నట్లు, రక్షించాలంటూ సైగలు చేశారు.

రాత్రి 7.30 గంటలు..
పది ఫైరింజన్లు, మరో అరగంటకు బ్రోంటో స్కైలిఫ్ట్‌ వెహికిల్‌ ఘటనా స్థలికి చేరుకున్నాయి. డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ప్రకాష్‌రెడ్డి తన బృందంతో వచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు.

రాత్రి 8.45 గంటలు
అయిదో ఫ్లోర్‌ నుంచి ముగ్గురు యువకులను రెస్క్యూ చేశారు. ఇలా కిందికి వచ్చిన వాళ్లు తమ కార్యాలయంలోని స్టోర్‌ రూంలో ఆరుగురు చిక్కుకుపోయారని, వీరిలో శివ, ప్రశాంత్‌, ప్రమీల, త్రివేణి, శ్రావణి, వెన్నెల కూడా ఉన్నారని చెప్పారు.

రాత్రి 9.06 గంటలు..
భారతమ్మ, రవి, ఇతడి తండ్రి దయాకర్‌తో పాటు మరో మహిళ, ప్రశాంత్‌ను రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరించారు. ఓ యువకుడు అయిదో అంతస్తులోని కార్యాలయంలో చిక్కుకున్న వారికి ఊపిరి ఆడట్లేదని, వాళ్లు బయటకు రావడానికి ఇనుప గ్రిల్‌ అడ్డంగా ఉందని చెప్పి ఆక్సిజన్‌ ఆవశ్యకతను అధికారులకు వివరించాడు. దీంతో గ్రిల్స్‌ కట్‌ చేసే సామగ్రితో బ్రోంటో స్కైలిఫ్ట్‌ వెహికిల్‌లో పైకి వెళ్లారు.

రాత్రి 9.19 గంటలు..
డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ అధికారులు ఆక్సిజన్‌ సిలిండర్లు ధరించి, తీసుకుని మెట్ల మార్గంలో కాంప్లెక్స్‌లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలెట్టారు. భవనంలోనే ఉండిపోయిన ఆరుగురి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

రాత్రి 9.45 గంటలు
అయిదో అంతస్తులోని ఓమెగా సంస్థ కార్యాలయంలో చిక్కకుపోయిన దాని యజమాని సుధీర్‌ను కిందికి తీసుకువచ్చారు. అదే అంతస్తులోని ఈ–కామర్స్‌ కార్యాలయంలో పని చేస్తున్న శివ, ప్రమీల, త్రివేణి, శ్రావణి, వెన్నెల స్పృహ తప్పి పడిపోయారని తోటి ఉద్యోగులు చెప్పడంలో అధికారులు అప్రమత్తమయ్యారు. డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ ప్రకాష్‌రెడ్డి హ్యాండ్‌ మైక్‌ చేతపట్టుకుని భవనంలో ఉన్న వాళ్లు తమ ఉనికి తెలిసేలా చేయాలని, వీలున్నంత వరకు బాత్‌రూమ్స్‌ వైపు వస్తే తాము రక్షిస్తామని పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. తొలుత బీ బ్లాక్‌కు కుడి వైపున అగ్ని కీలకు ఉన్నాయి. దీంతో చిక్కుకున్న వారికి వెనుక వైపునకు రమ్మని అధికారులు చెబుతూ వచ్చారు. రెస్క్యూ కూడా ఆ వైపున ఉన్న బాత్‌రూమ్స్‌ సమీపం నుంచే ఎక్కువ చేశారు.

రాత్రి 10.15 గంటలు..
భవనం వెనుక వైపునకూ మంటలు వ్యాపించి తీవ్రత పెరిగింది. దీంతో ఎటు నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ చేయాలి, లోపల చిక్కుకున్న అయిదుగురి విషయంలో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు ఆక్సిజన్‌ ధరించి నేరుగా అయిదో అంతస్తుకు వెళ్లి గాలించారు.

రాత్రి 10.20 గంటలు..
గ్రౌండ్‌ ఫ్లోర్‌, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో మళ్లీ మంటలు పెరిగాయి. ఒకటి, రెండో అంతస్తుల్లో వస్త్ర దుకాణాలు, పాదరక్షల దుకాణాలు ఉండడంతో మంటలు అటువైపూ వ్యాపించాయి. దీంతో భవనం పటిష్టత దెబ్బతిన్నదని భావించిన పోలీసులు రెండు వైపులా ఉన్న అపార్ట్‌మెంట్లు, వెనకవైపు ఉన్న బస్తీవాసులను ఇళ్లలోంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపించారు.

రాత్రి 10.35 గంటలు..
మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, డీసీపీ చందనా దీప్తి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అతికష్టమ్మీద గ్రిల్స్‌ తొలగించి అయిదో అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక శాఖ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ అయిదుగురిని బయటికి తీసుకువచ్చారు. వీరికి సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించారు. వీరు అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్‌ సైతం కన్నుమూశాడు. ఈ ఆరుగురికి కాలిన గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతోనే చనిపోయారు. మంటలను అదుపు చేసి భవనంలో ఇంకెవరైనా ఉన్నారా..? అనే అనుమానంతో గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు