ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌

2 Jun, 2023 03:54 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో మూడోదశ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 464.44 చదరపు గజాల నుంచి గరిష్టంగా 11,374 చదరపు గజాల వరకు విస్తీర్ణం కలిగిన 63 ప్లాట్లను విక్రయించనున్నారు. వ్యాపార, వాణిజ్య అవసరాలతో పాటు అపార్ట్‌మెంట్లు తదితర బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు ఎంతో అనుకూలంగా ఉన్న ఉప్పల్‌ భగాయత్‌లో గతంలో నిర్వహించిన వేలంలో తక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లు పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఎక్కువ విస్తీర్ణం కలిగినవి కొన్ని మిగిలిపోయాయి. గతేడాది మరోసారి వీటికి బిడ్డింగ్‌ నిర్వహించారు. ప్రస్తుతం 63 ప్లాట్లకు బిడ్డింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. గజానికి రూ.3,5000 చొప్పున కనీస ధర నిర్ణయించారు. కనీస బిడ్‌ పెంపుదల రూ.500 వరకు ఉంటుంది. ఆసక్తిగల నిర్మాణదారులు, రియల్టర్లు, కొనుగోలుదారులు ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. మరుసటి రోజు అంటే 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెయ్యి చదరపు గజాల లోపు ఉన్న ప్లాట్లకు రూ.5 లక్షలు, వెయ్యి చదరపు గజాల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్లకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 30న రెండు సెషన్లలో బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 32 ప్లాట్‌లకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సా. 6 గంటల వరకు 31 ప్లాట్లకు బిడ్డింగ్‌ ఉంటుంది.

నేటి నుంచి ‘నయా పోలీసింగ్‌’

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌ పునర్‌ వ్యవస్థీకరణ భాగంగా కొత్తగా ఏర్పాటైన 11 శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్లు శుక్రవారం నుంచి అధికారికంగా పని ప్రారంభించనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని పోలీసుస్టేషన్లకు భవనాలు సమకూరగా, మరికొన్నింటికి తాత్కాలికంగా కేటాయించారు. ఈ పోలీసుస్టేషన్ల పరిధులపై మ్యాప్‌లు కూడా సిద్ధం చేసిన ఉన్నతాధికారులు అటు పోలీసులతో పాటు ఇటు సామాన్య ప్రజలకు వీటిపై అవగాహన కల్పించనున్నారు. శుక్రవారం నుంచి నయా పోలీసుస్టేషన్లలో ప్రాథమిక సమాచార నివేదికల (ఎఫ్‌ఐఆర్‌) నమోదు ప్రారంభమవుతుంది. ఈ ఠాణాలకు డిజిగ్నేటెడ్‌ కోర్టులను కేటాయించాల్సిందిగా కోరుతూ ఇప్పటికే కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ న్యాయమూర్తికి లేఖ రాశారు.

కొత్త ఠాణాలు ఇవే:

దోమలగూడ, సెక్రటేరియట్‌, ఖైరతాబాద్‌, వారాసిగూడ, బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌, గుడిమల్కాపూర్‌, ఫిల్మ్‌నగర్‌, మాసబ్‌ట్యాంక్‌, మధురానగర్‌, బోరబండ

ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల ఫీజు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని వివిధ డిగ్రీ కోర్సులకు 30 శాతం ఫీజులు పెంచారు. ఇంతకుముందే పీజీ కోర్సులు, పీహెచ్‌డీ ఫీజులు పెంచిన ఓయూ అధికారులు గురువారం జరిగిన పాలక మండలి సమావేశంలో డిగ్రీ కోర్సుల ఫీజుల పెంపునకు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులకు ప్రభుత్వ కాలేజీలలో రూ.2 వేలు పెంచగా, ప్రైవేటు కాలేజీలకు రూ.4 వేల వరకు పెంచాలని నిర్ణయించారు. ఓయూలో గత పది సంవత్సరాలుగా ఫీజులు పెంచనందున ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజుల పెంచాలని నిర్ణయం తీసుకున్నట్ల్లు తెలిసింది.

మరిన్ని వార్తలు