కన్న కూతురిపై.. తండ్రి లైంగిక దాడి! ఆపై..

22 Sep, 2023 08:14 IST|Sakshi

రూ.5వేలు జరిమానా..

స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు!

హైదరాబాద్‌: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి, స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. బాధితురాలి విద్యాభ్యాసం కోసం డీఎల్‌ఎస్‌ఎ ద్వారా రూ.5 లక్షలు పరిహారాన్ని అందజేశారు.

హబీబ్‌నగర్‌ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ మద్యానికి బానిసై ఇంటి వద్దనే ఉండేవాడు. అతడి భార్య భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించేది. వారికి ఆరుగురు సంతానం. 2021 నవంబర్‌ 30న ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి భిక్షాటనకు వెళ్లింది. ఇదే అదనుగా హఫీజ్‌ తన కుమార్తె(10) పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన బాధితురాలి పిన్ని ఈ విషయాన్ని గుర్తించి ఇరుగు పొరుగుతో కలిసి ఇంటి తలుపులు పగులగొట్టి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. గురువారం స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు జడ్జి టి.అనిత కేసు పూర్వాపరాలను పరిశీలించి నిందితు మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌కు 20 ఏళ్ల కఠినకాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

మరిన్ని వార్తలు