ట్రా‘ఫికర్‌’ తగ్గేనా?

25 Nov, 2023 04:44 IST|Sakshi
ప్రజారవాణాకు పెద్దపీట వేసిన ప్రభుత్వం

అడుగడుగునా ఆక్రమణలే...

రహదారులకు పక్కగా ఉండే క్యారేజ్‌వేలు ఎంత క్లియర్‌గా ఉంటే వాహన శ్రేణులు అంత వేగంగా ముందుకు కదులుతాయి. ఫుట్‌పాత్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ సౌలభ్యంతో పాటు పాదచారుల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర రోడ్లలోనూ ఆక్రమణలకు కొదవే లేదు. ఫుట్‌పాత్‌లను చిరు వ్యాపారులతో పాటు బడా బిజినెస్‌ మ్యాన్స్‌ సైతం అందినకాడికి ఆక్రమించేసుకుంటున్నారు. వీటితో పాటు పార్కింగ్‌ ప్రాంతాలుగా కేటాయించిన సెల్లార్లు సైతం వాణిజ్యపరంగా వినియోగించేస్తున్నారు. ఈ కారణంగానే ఆయా ప్రాంతాల్లో క్యారేజ్‌ వేలు కూడా కనిపించకుండా పోతున్నాయి. వీటి ప్రభావం రహదారిపై వెళ్తున్న వాహనాలపై ఉంటోంది. దీనికి తోడు నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ అవసరం.

సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని ప్రజా రవాణా వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. ఎంఎంటీఎస్‌కు తోడు మెట్రో రైల్‌ దూసుకుపోతోంది. కొత్తగా పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రోడ్లు ఎక్కుతున్నాయి. ఎక్కడిక్కడ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. అయినప్పటికీ సగటు వాహన చోదకుడికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పట్లేదు. ప్రతిరోజూ వెయ్యి చొప్పున అదనంగా రోడ్డు పైకి వస్తున్న వాహనాల తాకిడిని సిటీ రోడ్లు తట్టుకోలేకపోతున్నాయి. ఈ సమస్యలు పూర్తి స్థాయిలో తీరాలంటే కొన్ని కీలక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టీఏ విభాగంలో కలిసి చేయాల్సిన కీలక అంశాలు మరికొన్ని ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.

ఆ వాహనాలు రహదారులపై అనేకం..

రోడ్ల తిరిగే వాహనాలకు ‘జీవితకాలం’ ఉంటుంది. కమర్షియల్‌ వాహనాలకు 15 ఏళ్లు, వ్యక్తిగత వాహనాలకు 22 ఏళ్లు జీవిత కాలమని నిబంధనలు చెబుతున్నాయి. కాలం ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించి, పన్ను చెల్లించి రెన్యువల్‌ చేయించుకుంటూ ఉండాల్సిందే. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న వ్యక్తిగత వాహనాల్లో కాలం చెల్లినవి లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. కమర్షియల్‌ వాహనాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇవీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. వీటిపై అటు ఆర్టీఏ, ఇటు ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి పెడితే రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గడంతో పాటు పన్ను రూపంలో భారీ ఆదాయం చేకూరుతుంది. వీటన్నింటికీ మించి రోజురోజుకూ పెరిగిపోతున్న వాయి కాలుష్యాన్ని కొంత మేర నియంత్రించినట్లు అవుతుంది.

పార్కులు, టెర్మినల్స్‌ అత్యవసరం...

● కోర్‌ సిటీలోకి ప్రవేశించే భారీ వాహనాలు, ప్రైవేట్‌ బస్సుల వల్ల ట్రాఫిక్‌ చిక్కులు తప్పట్లేదు. నిర్ణీత సమయాల్లోనే వీటిని నగరంలోకి అనుమతిస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వీటికి పరిష్కారంలో నగరానికి నాలుగు దిక్కులా ట్రక్‌ పార్కులు, బస్‌ టెర్నినల్స్‌ నిర్మించాలనే ప్రతిపాదనలు ఏళ్ళుగా ఉన్నాయి. ఇప్పటికే బాట సింగారంలో నిర్మించిన ట్రక్‌ పార్క్‌ ఫ్రూట్‌ మార్కెట్‌గా మారిపోయింది. సకల సదుపాయాలతో నలుదిక్కులా టెర్నినల్స్‌, పార్కులు నిర్మించడంతో పాటు కచ్చితంగా వినియోగించుకునేలా చేయాలి.

● నగరంలోని రోడ్లు గరిష్టంగా 9 టన్నుల బరువు ఉన్న వాహనాలనే తట్టుకోగలరు. నిర్ణీత సమయాల్లోనూ ఇంతకు మించిన బరువు వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవడం ద్వారా రోడ్డు ధ్వంసం కావడం తగ్గుతుంది. ఈ ప్రభావం కూడా సిటీ ట్రాఫిక్‌పై ఉంటుంది. ఇప్పటికే మెట్రో రైల్‌ ప్రాజెక్టును మరింత విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి తోడు ఎంఎంటీఎస్‌ను సైతం అవసరమైన స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

...అయినా ఇంకా తప్పని తిప్పలు

ఇప్పటికీ రోడ్లపైనే కాలం చెల్లిన వాహనాలు

పార్కింగులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు

ఏళ్లుగా పత్తా లేని ట్రక్‌ పార్కులు, బస్‌ టెర్మినళ్లు

సమస్యను పరిష్కరించాలని నగర చోదకుడి డిమాండ్‌

మరిన్ని వార్తలు