నయా సాల్‌! కొలువుదీరిన కొత్త మద్యం దుకాణాలు

2 Dec, 2023 08:29 IST|Sakshi

హైదరాబాద్: గ్రేటర్‌లో కొత్త మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ అనుమతులు ఇచ్చింది. శుక్రవారం కొత్త దుకాణాలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో కొత్తగా 615 వైన్స్‌ షాపులకు ఎకై ్సజ్‌ శాఖ గత ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్నికల దృష్ట్యా ముందస్తుగానే నోటిఫికేషన్‌ వెలువడటంతో వ్యాపారుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అనేక చోట్ల పెద్దఎత్తున పోటీకి దిగారు. ఒక్కో మద్యం దుకాణానికి ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఫీజు విధించింది. ఒక వ్యాపారి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. శంషాబాద్‌ ఎకై ్సజ్‌ జిల్లా పరిధిలో కేవలం 100 దుకాణాలకు 9,080 మంది పోటీపడ్డారు. సరూర్‌నగర్‌లో 134 దుకాణాలకు 9012 దరఖాస్తులు వచ్చాయి.

రూ.650 కోట్ల ఆదాయం..
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 615 దుకాణాలపై లైసెన్సు ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి ఏకంగా రూ.650 కోట్ల వరకు ఆదాయం లభించినట్లు అంచనా. నగరంలోని దుకాణాల కంటే శివారు ప్రాంతాల్లోని మద్యం షాపుల కోసమే వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, శంషాబాద్‌, శేర్‌లింగంపల్లి, ఉప్పల్‌, మేడిపల్లి, కీసర, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో భారీ డిమాండ్‌ కనిపించింది. ఆగస్టులో 16వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అదే నెల చివరిలో డ్రా తీశారు. నిబంధనల మేరకు కొత్త వైన్‌ షాపులకు లైసెన్సుల ప్రక్రియ చేపట్టారు.

మూడు నెలల ముందే అనుమతి..
సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి మద్యం దుకాణాలకు ప్రభుత్వం లైసెన్సులను అందజేస్తోంది. ఒకసారి లైసెన్సు పొందిన వ్యాపారి రెండేళ్ల పాటు దుకాణం నిర్వహించవచ్చు. రెండేళ్లకోసారి అక్టోబర్‌ నెలాఖరులో నోటిఫికేషన్‌ విడుదల చేసి నవంబర్‌లో అనుమతులను ఇస్తారు. అదే నెలలో మొత్తం ఫీజులో నాలుగో వంతు చెల్లించిన వారికి డిసెంబర్‌ ఒకటో తేదీ నాటికి దుకాణాలకు లిక్కర్‌ చేరుతుంది. కాగా.. ఈ ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆగస్టులోనే ఈ ప్రక్రియను చేపట్టడంతో సెప్టెంబర్‌లో ఫీజులు చెల్లించిన వ్యాపారులు కొత్త దుకాణాలను ప్రారంభించేందుకు డిసెంబర్‌ వరకు ఆగాల్సి వచ్చింది. రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడం వల్ల ఈ మూడు నెలల పాటు భారీ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సివచ్చిందని పలువురు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు అన్ని కొత్త షాపులకు నవంబర్‌ 30 నాటికే మద్యం చేరాల్సి ఉండగా.. ఎన్నికల దృష్ట్యా డిసెంబర్‌ ఒకటో తేదీ శుక్రవారం ఉదయం నుంచే మద్యం సరఫరా కావడంతో కొన్ని చోట్ల సాయంత్రం వరకు కొత్త వైన్‌ షాపులు తెరుచుకున్నాయి.

మరిన్ని వార్తలు