అర్ధరాత్రి కారు బీభత్సం

19 Dec, 2023 07:13 IST|Sakshi
ప్రమాదానికి కారణమై కారు

చైతన్యపురి: చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకు వచ్చిన కారు రోడ్డుపై నిలుచుని ఉన్న యువకుడిని ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన చైతేషు(27) డీసీఎం డ్రైవర్‌గా పని చేసేవాడు.

తల్లిదండ్రులు చనిపోవడంతో సమీప బంధువు రాజు ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి బర్త్‌డే వేడుకకు వెళ్లి వస్తూ కాలనీ ఆర్చ్‌ వద్ద నిలబడి సిగరెట్‌ తాగుతున్నాడు. అదే సమయంలో ఎల్‌బీనగర్‌ నుంచి నాగోల్‌ వైపు వెళుతున్న స్విప్ట్‌ డిజైర్‌ కారు వేగంగా అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చైతేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు నుజ్జునుజ్జయ్యింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న ఏడుగురు యువకులను బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చౌటుప్పల్‌ తహసీల్దార్‌ కారుగా గుర్తింపు...
ప్రమాదానికి కారణమైన వాహనం దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న చౌటుప్పల్‌ తహసీల్దార్‌ హరికృష్ణకు చెందినదిగా గుర్తించారు. హరికృష్ణ కుమారుడు సాయి కార్తీక్‌ తన స్నేహితులతో కలిసి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. మద్యం మత్తు కారణంగా కారు అదుపుతప్పి ఒకరి మృతికి కారణమన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. చైతేష్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

గాయపడ్డ యువకులు వీరే
ఈ ఘటనలో గాయపడ్డ వారిలో సాయికార్తీక్‌, శరత్‌చంద్ర, మహేష్‌, సురేష్‌, నవీన్‌, రజనీకాంత్‌, నవీన్‌రెడ్డి ఉన్నారు. ఇద్దరు కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రిలో, మిగిలిన వారిలో ఒకరు యశోద ఆసుపత్రిలో, నలుగురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు