ఇక పార్లమెంట్‌ వంతు

19 Dec, 2023 04:26 IST|Sakshi

సాక్షి,సిటీ బ్యూరో: అధికార కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ స్థానాలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల పవనాలు వీచినా.. మహా నగరానికి తాకక పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు వ్యూహానికి సిద్ధమైంది. త్వరలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సీఎం సిట్టింగ్‌ స్థానమైన మల్కాజిగిరికి ఇన్‌చార్జిగా నియమించింది. శివారులోని చేవెళ్ల నియోజకవర్గ బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద గ్రేటర్‌ పరిధిలోని సిట్టింగ్‌ స్థానమైన మల్కాజిగిరితో పాటు మిగిలిన మూడు నియోజకవర్గాలను సైతం ఖాతాలో వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినా కనీసం ఒక స్థానం కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు. గట్టిగా ఆశలు పెట్టుకున్న స్థానాల్లో సైతం బోల్తాపడింది. వాస్తవంగా రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదిపిన కాంగ్రెస్‌ హైదరాబాద్‌ నగరంపై మాత్రం దృష్టి సారించలేకపోయింది. అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకత్వ లోపం, అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం, పారాచూట్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం, కొందరు పార్టీ వీడటం, ప్రచార వైఫల్యం తదితర అంశాలు పార్టీ పరాభవానికి ప్రధాన కారణాలుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పార్లమెంట్‌ ఎన్నికల్లో ముందస్తుగానే కార్యాచరణకు ఉపక్రమించారు.

చేవెళ్లకు సీఎం రేవంత్‌..

మల్కాజ్‌గిరికి మంత్రి తుమ్మల

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌కు డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గాలకు ఇన్‌చార్జీల నియామకం

>
మరిన్ని వార్తలు