అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

19 Dec, 2023 04:26 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్‌ పోలీసులు రైళ్లలో నిషేధిత వస్తువులను చేరవేసే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపారు. 15 రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో వివిధ ప్రాంతాల్లో సుమారు రూ.15 లక్షల విలువైన 60 కిలోల గంజాయితో సహా పలు నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 64,523 విలువైన 931 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు రూ. 1,34,340 విలువ కలిగిన రైల్వే సామాగ్రిని ఎత్తుకెళ్లిన 24 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. రైల్వే రిజర్వేషన్‌ అనధికారిక టిక్కెట్‌ బుకింగ్‌లపైన 24 కేసులు నమోదుచేసి రూ. 12,64,984 విలువైన అనధికారిక టికెట్‌లను జఫ్తు చేసినట్లు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్లలో ధూమపానానికి పాల్పడిన 807 మందిపై కేసులు నమోదు చేశారు. కొన్ని చోట్ల అసాంఘిక శక్తులు వాహనాలతో ఎల్‌.సీ గేట్లను ఢీకొట్టడం, నడుస్తున్న రైళ్లపై రాళ్లు రువ్వడం తదితర ప్రమాదకరమైన చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు దిగిన 20 మందిని గుర్తించి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం చేసిన 70 మందిపైన, మహిళల కోచ్‌లలో ప్రయాణించిన మరో 72 మందిపై కేసులు నమోదు చేశారు. రైల్వే ఆవరణలో చెత్తను వేసినందుకు 290 కేసులను నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల భద్రతలో భాగంగా ఆర్పీఎఫ్‌ గత 15 రోజులుగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌పైన దక్షిణ మధ్య రైల్వే, జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

రైళ్లలో గంజాయి,మద్యం, తదితర వస్తువుల సరఫరాపై కేసులు

రూ.లక్షల విలువైన వస్తువులు స్వాధీనం

ప్రయాణికుల భద్రతపై స్పెషల్‌ డ్రైవ్‌

>
మరిన్ని వార్తలు