‘అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ | Sakshi
Sakshi News home page

‘అవకాశాలను అందిపుచ్చుకోవాలి’

Published Tue, Dec 19 2023 4:26 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రపంచంలో ప్రతిభ ఉంటే ఇటీవలి కాలంలో చాలా అవకాశాలు వస్తున్నాయని, వర్ధమాన ఆటగాళ్లు వాటిని సమర్థంగా ఉపయోగించుకోవాలని భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. తమలో సత్తా ఉంటే ప్రాథమిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎక్కడైనా రాణించగలరన్నారు. అయితే విజయానికి దగ్గరి దారులు ఉండవని, కష్టపడే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గవద్దని సూచించారు. బేగంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘సెయింట్‌ జాన్స్‌ మల్టీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌’ను సోమవారం ఆయన ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో గత 37 ఏళ్లుగా ఎంతో మంది క్రికెటర్లను తయారు చేసిన ‘సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీ’కి అనుబంధంగా ఇది ఏర్పాటైంది. గతంతో పోలిస్తే ఇటీవల తమ పిల్లల క్రీడాశిక్షణకు సంబంధించి తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగిందని, వారు తగిన విధంగా ప్రోత్సాహం అందించడం మంచి పరిణామమని మాజీ క్రికెటర్‌ అభిప్రాయ పడ్డారు. అయితే ఆటల్లో ప్రతిసారి గెలుపు సాధ్యం కాదని, ఓటములు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని అందించడం కూడా ముఖ్యమన్న లక్ష్మణ్‌... నగరంలో అత్యుత్తమ కోచింగ్‌ సౌకర్యాలు ఉండటం ఇక్కడి వర్ధమాన ఆటగాళ్లకు మేలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో యువ షూటర్‌ ఇషా సింగ్‌, భారత ఫీల్డింగ్‌ మాజీ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌, భారత బాస్కెట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌, అకాడమీ కార్యదర్శి జాన్‌ మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

యువ క్రికెటర్లకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఉద్బోధ

1/1

Advertisement
Advertisement