ఎంతటి దుస్థితి! అఫ్గాన్‌ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా

25 Aug, 2021 15:09 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారాయి. సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ భయంతో పక్కదేశాలకు తరలి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యులతో పాటు ఆ దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆ దేశ మాజీ మంత్రి డెలివరీ బాయ్‌ అవతారమెత్తాడు. మొన్నటి దాక అధికారంలో ఉన్న ఆయన ఇప్పుడు ఇంటింటికి వెళ్లి పిజ్జాలు అందిస్తున్నారు.

ఆయనే అఫ్గానిస్తాన్‌ ఐటీ మాజీ మంత్రి సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌. మొన్నటి దాక స్వదేశంలో ఐటీ అభివృద్ధిపై దృష్టి సారించిన సాదత్‌ ఇప్పుడు విదేశంలో పిజ్జాలు అందించడంపై దృష్టి పెట్టారు. ఈ దుస్థితికి గల కారణాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘గతేడాది దేశ అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీతో తనకు విబేధాలు, మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశా. రాజీనామా అనంతరం కొంతకాలం ప్రశాంతంగా జీవనం సాగింది. అనంతరం నా వద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీ బాయ్‌గా చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు. 

సాదత్‌ ప్రస్తుతం జర్మన్‌లోని లీప్‌జిగ్‌ పట్టణంలో పిజ్జాలు సైకిల్‌పై డెలివరీ చేస్తున్నారు. ఈ పని చేయడానికి తానేమీ మొహమాట పడడం లేదని పేర్కొన్నారు. సాదత్‌ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అఫ్గానిస్తాన్‌లో మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ అభివృద్ధి చేశారు. మాజీ మంత్రిగా మారిన అనంతరం స్వదేశంలోనే ఉన్నారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమిస్తారని ముందే గ్రహించి తాలిబన్లు ఆక్రమించే వారం రోజుల ముందే జర్మన్‌కు వచ్చేశారు. ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవడంతో కుటుంబ పోషణ కోసం విధిలేక డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తారు.
 

మరిన్ని వార్తలు