Radio Burst: ‘ఫాస్ట్ రేడియో బరస్ట్‌’ సూర్యునికన్నా ఎంత శక్తివంతమైనదంటే..

21 Oct, 2023 10:40 IST|Sakshi

అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 800 కోట్ల క్రితం విశ్వంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాన్ని గుర్తించింది. ఈ విస్ఫోటనం ఇన్ని వందల కోట్ల ఏళ్లకు భూమికి చేరుకుందని వారు తెలిపారు. ఈ పేలుడును ‘ఫాస్ట్ రేడియో బరస్ట్‌’ (ఎఫ్‌ఆర్‌బీ) అని అంటారు. కొత్తగా గుర్తించిన ఈ విస్ఫోటనానికి ఎఫ్‌ఆర్‌బీ-20220610ఏ అని పేరు పెట్టారు. 

గత ఏడాది జూన్ 10న రేడియో టెలిస్కోప్ సాయంతో దీనిని గుర్తించారు. ఈ విస్ఫోటనం ఎక్కడ నుండి ఉద్భవించిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ, వెరీ లార్జ్ టెలిస్కోప్‌ను ఉపయోగించారు. ఈ ఎఫ్‌ఆర్‌బీ ఇప్పటివరకూ కనుగొన్న అన్ని ఎఫ్‌ఆర్‌బీల కంటే పురాతనమైనదని, అత్యంత దూరం కలిగినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
‘ఫాస్ట్ రేడియో బరస్ట్‌’లనేవి రేడియో తరంగాల ప్రకాశవంతమైన పేలుళ్లు. వీటి వ్యవధి మిల్లీసెకండ్ స్కేల్‌లో ఉంటుంది. ఈ కారణంగానే వాటి మూలాన్ని గుర్తించడం, అంతరిక్షంలో వాటి స్థానాన్ని కనుగొనడం అత్యంత కష్టమైన పని. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్‌’ను మొదటిసారిగా 2007 సంవత్సరంలో కనుగొన్నారు. నాటి నుండి శాస్త్రవేత్తలు దాని మూలాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యుడు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసేంత శక్తిని ఈ పేలుళ్లు సెకనులో వెయ్యి వంతులో ఉత్పత్తి చేస్తాయి.
 
ఎఫ్‌ఆర్‌బీ పేలుళ్లు ఎందుకు సంభవిస్తాయో శాస్త్రవేత్తలు నేటికీ గుర్తించలేకపోయారు. అయితే ఎఫ్‌ఆర్‌బీలు విశ్వంలో జరిగే సాధారణ దృగ్విషయం అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఈ దృగ్విషయాలను అధ్యయనం చేయడం వలన విశ్వం ఎలా ఏర్పడిందనేది తెలుసుకునేందుకు సహాయపడుతుంది.
 
అత్యంత వేగవంతమైన ఈ రేడియో పేలుళ్లు అనూహ్యంగా ఉంటాయి. వాటిని గమనించడం కష్టం. కెనడాలోని డొమినియన్ రేడియో ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ ఎఫ్‌ఆర్‌బీలను ట్రాక్ చేసే అబ్జర్వేటరీలలో ఒకటి. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఎఫ్‌ఆర్‌బీలపై మరింత అవగాహన కలిగేందుకు దోహదపడనుంది. కాగా ఈ అధ్యయనం వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి: యూదుడైన్‌ ఐన్‌స్టీన్‌ హిట్లర్‌ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు?

మరిన్ని వార్తలు