Solar Mission Aditya L1 Updates: ఆదిత్య ఎల్​1.. భూమికి బై.. సూర్యుడి వైపుగా జర్నీ.. అసలు కథ షురూ

19 Sep, 2023 06:48 IST|Sakshi

సూర్యుని పై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ లో మరో కీలక ఘట్టం నమోదైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సూర్యుడిని చేరుకునేందుకు ఐదో సారి భూ కక్ష్యను పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఆదిత్య ఎల్ -1 భూప్రదక్షిణ దశ ముగించుకుని.. సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.ఇక ఇక్కడి నుంచి అసలు ఉత్కంఠ మొదలవుతుంది. 

సోమవారం అర్ధరాత్రి దాటాక.. వాహన నౌక లగ్రాంజ్​ పాయంట్​ 1 దిశగా దూసుకెళ్లడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలో వెళ్లేలా విన్యాసం చేశారు. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా మారిషస్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూ కక్ష్య పెంపును సమీక్షించాయి.

ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 శాటిలైట్ 256 కి.మీ x 121973 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాటిలైట్ సూర్యుడి వైపు ప్రయాణించి.. నిర్దేశిత ఎల్-1 పాయింట్ కు చేరాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు.

డేటా సేకరణ ప్రారంభం
సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సెప్టెంబర్​ 2వ తేదీన ఆదిత్య ఎల్ -1 (Aditya-L1) ప్రయోగించింది. అయితే ఇది శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది.

మరిన్ని వార్తలు