గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్‌.. వీడియో వైరల్‌

13 Oct, 2022 07:36 IST|Sakshi

రోమ్‌: అట్లాస్‌ ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 747 విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ల్యాండింగ్‌ గేర్‌ టైర్‌ ఊడిపోయింది. ఈ సంఘటన ఇటలీలోని టరంటో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే జరిగింది. ఈ భారీ విమానాన్ని ప్రధానంగా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ పరికరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఇటలీలోని టరంటో ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి అమెరికాలోని చార్లెస్టన్‌కు చేరుకోవాల్సి ఉంది. 

విమానం టైర్‌ ఊడిపోయిన దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. భారీ రవాణా విమానం రన్‌వేపై వేగంగా వెళ్తూ గాల్లోకి ఎగిరింది. అయితే, ఆ కాసేపటికే ల్యాండింగ్‌ గేర్‌ టైర్‌ ఊడిపోయింది. రన్‌వేపై పడి కొంత దూరం దొర్లుతూ వెళ్లింది. చక్రం ఊడిపోయిన క్రమంలో నల్లటి పొగ సైతం వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. టైర్‌ ఊడిపోయినప్పటికీ అలాగే అమెరికా చేరిన విమానం.. చార్లెస్టన్‌ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. టైర్‌ టరంటో ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే చివరిలో గుర్తించారు. 

బోయింగ్‌ 747 డ్రీమ్‌లిఫ్టర్‌ రవాణా విమానం. బోయింగ్‌ 747-400 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి రవాణా విమానంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం విమాన పరకరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు. సెప్టెంబర్‌, 2006లో తొలిసారి గాల్లోకి ఎగిరింది. అయితే, వస్తు రవాణాకు మాత్రమే అనుమతి ఉంది. కేవలం విమాన సిబ్బంది మినహా మానవ రవాణాకు దీనిని ఉపోయోగించేందుకు అనుమతి లేదు.

ఇదీ చదవండి: Work From Pub Trend: యూకేలో నయా ట్రెండ్‌ ‘వర్క్‌ ఫ్రమ్‌ పబ్‌’.. ఆడుతూ పాడుతూ పని!

మరిన్ని వార్తలు