Bengaluru Bandh: కావేరి జలాల వివాదం.. నేడు బెంగళూరు బంద్‌

26 Sep, 2023 10:56 IST|Sakshi

బెంగళూరు: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక  ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వివిధ కన్నడ సంఘాలు తప్పుపడుతున్నాయి. తమిళనాడుకు 15 రోజులపాటు రోజూ 5 వేల క్యూసెక్కుల కావేరి నీటినివిడుదల చేయాలని కావేరి వాటర్‌ మేనేజ్‌మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ) ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాదాపు 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. 

రైతు నాయకుడు కురుబూర్ శాంతకుమార్ నేతృత్వంలోని రైతు సంఘాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ‘కర్ణాటక జల సంరక్షణ సమితి’ పేరుతో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆందోళన కారుల పిలుపు మేరకు బెంగుళూర్‌ బంద్‌ కొనసాగుతోంది.  నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. దీంతో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

ఈ క్రమంలో బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు 144 సెక్షన్‌ విధించారు. అలాగే నేడు నగరంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతులు లేవని తేల్చిచెప్పారు. స్వచ్చందంగా బంద్‌ను పాటించాలని, బలవంతంగా బంద్‌ను అమలు చేయకూడదని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. 

స్కూల్స్‌, కాలేజీలు బంద్‌
బంద్‌ నేపథ్యంలో మంగళవారం బెంగుళూరులోని  అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరు అర్భన్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ దయానంద్‌ కేఏ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా ఆటోలు, ట్యాక్సీ యూనియన్‌లు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.

మెట్రో, ఆర్టీసీ సేవలు యధాతథం
అయితే మెట్రో సేవలు బంద్ పిలుపుతో ప్రభావితం కాకుండా యథాధావిధిగా పనిచేయనున్నాయి.  ఓలా, ఉబర్‌ వంటి సర్వీసులు సైతం పనిచేయనున్నాయి. తాము బంద్‌కు మద్దతు తెలపడం లేదని, తమ సర్వీసులు పనిచేస్తాయని ఓలా ఉబర్‌ యాజమాన్యాలు ప్రకటించాయి. హోటళ్ల యజమానుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల కూడా తెరుచుకొని ఉండనున్నాయి.

వీటితోపాటు బెంగుళూరు ఆర్టీసీ బస్సులు కూడా బంద్‌తో సంబంధం లేకుండా యథావిధిగా తమ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో మాత్రం తమిళనాడు బస్సుల ప్రవేశాన్ని నిలిపివేశారు. బెంగళూరు బంద్ దృష్ట్యా తమ ప్రయాణాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని విమాన ప్రయాణికులను అభ్యర్థిస్తూ బెంగళూరు విమానాశ్రయం ఓ ప్రకటన విడుదల చేసింది.

విమానాశ్రయానికి ప్రయాణించేటప్పుడు విలైనంత త్వరగా బయలుదేరాలని ఇండిగో సూచించింది. బంద్‌ కారణంగా సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని.. డొమెస్టిక్‌ ప్రయాణానికి రెండున్నర గంటల ముందు, అంతర్జాతీయ ప్రయాణానికి మూడున్నర గంటల ముందు చేరుకోవాలని ట్విటర్‌లో తెలిపింది. 

కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మంగళవారం బంద్‌కు మద్దతు తెలిపింది. బెంగళూరు బంద్‌కు జేడీఎస్‌ కూడా మద్దతు తెలిపింది. బంద్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. కాగా, తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో మంగళవారం చేపట్టిన నిరసనలను నిషేధించేలా కేంద్రం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు కావేరి రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

నిరసనలకు ప్రభుత్వం అనుమతి
అయితే బెంగళూరు బంద్‌కు కర్ణాటక ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమ ప్రభుత్వం నిరసనలను అడ్డుకోబోమని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఆందోళనలను కట్టడి చేయబోమని హామీ ఇచ్చింది. అయితే బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కూడా ముఖ్యమని చెప్పారు.  కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నది.

ఏంటీ కావేరి వివాదం?
తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నీటిని విడుదల చేయడానికి వీలులేదంటూ కర్నాటకలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కర్నాకట ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు ప్రజాసంఘాలు బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి.

మరిన్ని వార్తలు