Amazon Jungle Plane Crash: అమెజాన్‌ అడవుల్లో అద్భుతం.. సజీవంగా 40 రోజులకు దొరికిన చిన్నారులు

10 Jun, 2023 10:34 IST|Sakshi

నమ్మకం వమ్ము కాలేదు. అడవితల్లే కరుణించిందా అన్నట్లుగా అద్భుతం జరిగింది. వన్య మృగాలు.. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్‌ ముఠాల కంటపడకుండా ప్రాణాలతో బయటపడ్డారు ఆ నలుగురు చిన్నారులు. విమాన ప్రమాదంలో తల్లిని పొగొట్టుకున్నప్పటికీ.. తామైనా సజీవంగా బయటపడాలన్న వాళ్ల సంకల్పం ఫలించింది. దట్టమైన అమెజాన్‌ అడవుల్లో తప్పిపోవడంతో రంగంలోకి దిగిన కొలంబియా  సైన్యం రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి 40 రోజుల తర్వాత వాళ్ల జాడను కనిపెట్టింది. చివరకు.. అమెజాన్‌ అడవుల్లో పాపం పసివాళ్ల కథ సుఖాంతంమైంది. 

ఆ నలుగురి వయసు 13, 9, 4, 11 నెలలు. అయితేనేం దట్టమైన అమెజాన్‌ అడవుల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు.  దాదాపు నెలకు పైనే పెద్దలెవరూ లేకుండా అడవుల్లో గడిపారు. 13 ఏళ్ల లెస్లీ తన తోబుట్టువులను దగ్గరుండి కాపాడుకుంటూ వచ్చింది. సూర్యుడి వెలుతురు కూడా నేల మీద పడనంత చీకట్లు అలుముకునే అడవుల్లో.. ముందుకు సాగింది. దొరికింది తింటూ.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ముందుకు సాగింది. మే 1న వాళ్లు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికాగా..  శుక్రవారం(జూన్‌ 9న) సాయంత్రం ఆ నలుగురు చిన్నారుల జాడను కొలంబియా సైన్యంలోని ఓ బృందం గుర్తించింది.  

👉 కొలంబియా అమెజాన్‌ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన రీజియన్‌ అది. విషపూరితమైన కీటకాలు, వన్యప్రాణుల నుంచి తప్పించుకుంటూ దొరికింది తింటూ ఇన్నాళ్లూ గడిపారు ఆ చిన్నారులు. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్‌ ముఠాల కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అడవుల్లో దొరికింది తింటూ.. నీళ్లు తాగుతూ..  మధ్యలో సైన్యం ఆకాశం నుంచి జారవిడిచిన ఆహార పొట్లాలను సైతం అందుకున్నారాట.  

పౌష్టికాహర లోపం తప్పించి.. వాళ్లకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌లు సోకకపోవడం గమనార్హం. అంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే.. 11 నెలల ఆ పసికందు సైతం ఆరోగ్యంగానే ఉందని ఆర్మీ డాక్టర్లు ప్రకటించారు. పైగా ఆ చిన్నారి తన ఏడాది పుట్టినరోజును అమెజాన్‌లోనే చేసుకుందట(గడపడం). 

నలభై రోజుల క్రితం

👉 మే 1 ఉదయం, సెస్నా 206 అనే ఓ తేలికపాటి ప్యాసింజర్‌ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. కానీ, ఆ ఎయిర్‌ప్లేన్‌ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్‌ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్‌ రాడార్‌కు అందకుండా పోయింది.

👉 దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే అది ప్రమాదానికి గురైంది. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా(33) కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. దీంతో వాళ్లు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ముందుకు సాగుతున్నారేమో అని సైన్యం భావించింది. 

అవాంతరాలు ఏర్పడ్డా..
👉 వాషింగ్టన్‌కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్‌ నోరెయిల్‌(4), మరో పసికందు క్రిస్టిన్‌ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగాయి. భీకరమైన, దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్‌ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడ్డాయి. 

👉 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తూ వచ్చారు. వాళ్ల ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కొలంబియా మొత్తం వాళ్లు ప్రాణాలతో బయటపడాలంటూ దేవుడ్ని ప్రార్థిస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. 

వాళ్లకు అలవాటేనా? 
👉 అమెజాన్‌ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) తెగకు చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. పైగా లెస్లీకి వాళ్ల బామ్మ అన్ని విధాల శిక్షణ ఇచ్చిందట.  కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేసిందామె. వాళ్లు ఊహించినట్లే లెస్లీ రక్షణ బాధ్యతలు తీసుకుంది. అమ్మలా వాళ్లను ​కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. 

మరిన్ని వార్తలు